మే 9వ తేదీ నుంచి ఏపీ సర్కార్ ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. అసలు వినేవాళ్లు ఎవరు జగనన్నా? అని జనం ప్రశ్నిస్తున్నారు. ప్రతి వారం కలెక్టర్ల నేతృత్వంలో నిర్వహించే స్పందన కార్యక్రమంలో సమస్యలపై ప్రజలు ఇస్తున్న దరఖాస్తులను పరిష్కరించే దిక్కులేదు. గ్రామ సచివాలయాలు, తహశీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా సమస్యలకు పరిష్కారం దొరకని పరిస్థితి.
ఇప్పుడు కొత్తగా స్పందనను మరింత మెరుగులు దిద్దేందుకు అంటూ ‘జగనన్నకు చెబుదాం’ తీసుకొస్తున్నట్టు జగన్ చెప్పుకొచ్చారు. కొత్త కార్యక్రమం గురించి చెప్పుకోడానికి బాగుంది. కానీ ఆచరణకు వచ్చే సరికి సీఎం అనుకున్న స్థాయిలో ప్రజలకు మంచి జరగడం లేదు. ఆరు నెలల క్రితం వైసీపీ సోషల్ మీడియా టీమ్‌ని కొత్తగా ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా టీమ్ జగనన్న పేరుతో మొబైల్ యాప్‌ను తీసుకొచ్చారు. ఇందులో నేరుగా జగనన్నతో నేరుగా మాట్లాడండి అంటూ ప్రత్యేక ఆప్షన్ ఇచ్చారు. ఇక్కడ చేరవేసే విషయాలు నేరుగా సీఎం జగన్ డాష్ బోర్డులోకి వెళ్తాయని, వెంటనే ఆయన రియాక్ట్ అవుతారని గొప్పలు చెప్పారు. ఇంత వరకూ టీమ్ జగనన్ యాప్ ద్వారా జగన్‌తో నేరుగా ఎంత మంది ఇంటరాక్ట్ అయ్యారు? వారికి సీఎం ఇచ్చిన సమాధానం ఏంటో చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకంటే కేవలం జగన్‌కు చెప్పుకునేందుకు కొందరు షో చేయడం తప్ప, పొడిచేదేమీ లేదు.
చంద్రబాబు చేతిలో నుంచి జగన్ చేతిలోకి పాలన మారిందే తప్ప, అలసత్వం, విధానాలు అట్లే కొనసాగుతున్నాయి. కనీసం చంద్రబాబు అంటే అధికారులకు ఒక భయమనేదైనా వుండేది. ఇప్పుడు జగన్ పాలనలో అది కూడా లేదు. ఇష్టారాజ్యమైంది. కనీసం అధికార పార్టీ నేతలు చెప్పినా… అధికారులు స్పందించని పరిస్థితి. వైసీపీ నేతలు సొంత పనులు చక్కదిద్దుకునేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు.
తమ ప్రభుత్వ ఖజానాలో డబ్బు లేదని, కాంట్రాక్టులు, ఇతరత్రా పనులు చేసుకుని డబ్బు సంపాదించుకునే అవకాశం లేదని వైసీపీ నేతలు చాలా త్వరగా గ్రహించారు. దీంతో నేతలంతా భూముల ఆక్రమణ, ప్రభుత్వ భూములను చట్టపరంగా సొంతం చేసుకోవడం, ఇసుక, మట్టి విచ్చలవిడిగా కొల్లగొడుతూ సొమ్ము చేసుకోడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. మరోవైపు జగన్ తాను క్రమం తప్పకుండా సంక్షేమ పథకాల లబ్ధి చేకూరుస్తానని, ప్రజలంతా క్షేమంగా ఉన్నారనే భ్రమలో ఉన్నారు. క్షేత్రస్థాయిలో అసలేం జరుగుతున్నదో ఆయనకు చెప్పేవాళ్లు ఉన్నారో, లేదో కూడా తెలియని పరిస్థితి.
ప్రతిదీ నిధులతో ముడిపడిన విషయం కావడంతో, జగన్‌కు ఎవరూ ఏమీ చెప్పడం లేదనే చర్చ నడుస్తోంది. దీంతో జనంలో ఒక రకమైన అసహనం నెలకుంది. దీన్ని పట్టించుకునే పాలకుడు కావాలి. మరోవైపు ఆర్థిక పరమైన అంశాలేవీ తమకు చెప్పొ ద్దంటూ ఉన్నతాధికారులు, అధికార పార్టీకి చెందిన పెద్దలు తెగేసి చెబుతున్నట్టు ఎమ్మెల్యేలు వాపోతున్నారు. తనకు చెబితే సమస్యలన్నీ పరిష్కరిస్తామనడం కేవలం ప్రచారానికి తప్ప, మరెందుకూ ఉపయోగపడవనే వాదన వినిపిస్తోంది. సమస్యలు చెప్పాలని హెల్ప్‌లైన్ నంబర్ 1902 ఇవ్వడం కాదని, ఎన్నింటికి పరిష్కారం చూపారో చెప్పడం ముఖ్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో ఇలాంటివి చంద్రబాబునాయుడు చాలా జిమ్మిక్కులు చేశారని, ఇప్పుడు జగన్ వాటిని కొనసాగిస్తున్నారనే విమర్శ లేకపోలేదు. గ్రామ స్థాయి మొదలుకుని మండలం, నియోజకవర్గం, జిల్లా, ఆ తర్వాత రాష్ట్రస్థాయి వరకూ అధికారులెవరూ పలికే పరిస్థితిలో లేరన్నది వాస్తవం. ఇదంతా అధికార పార్టీ స్వయంకృతాపరాధమే. ఎందుకంటే తమకు లాభం వచ్చే పనులు తప్ప, ప్రజాప్రయోజనాలపై దృష్టి సారించే నేతలెవరూ లేరు. అదే ఇప్పుడు వారి మెడకు చుట్టుకుంటోంది. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ఏదో మంచి చేయాలన్న తలంపు జగన్‌లో ఉండొచ్చు. కానీ ప్రజల గోడు వినే వాళ్లే కరువయ్యారు.