విజయవాడలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ హాజరయ్యారు. ఎన్టీఆర్‌తో పాటు చంద్రబాబుపై కూడా ఆయన పొగడ్తల వర్షం కురిపించారు. దీంతో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల లక్ష్యం నెరవేరినట్టైంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ప్రసంగాలకు సంబంధించి రెండు పుస్తకాలను ఆవిష్కరించారు.
శాసనసభలో, బయట , వివిధ సందర్భాల్లో ఎన్టీఆర్ ప్రసంగాల్ని “ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్, వెబ్‌సైట్ కమిటీ” నేతృత్వంలో “నందమూరి తారకరామరావు చారిత్రక ప్రసంగాలు”, “నందమూరి తారకరామరావు శాసనసభ ప్రసంగాలు” శీర్షికలతో రెండు పుస్తకాలను ప్రచురించింది. ఇందులో ముఖ్యమైన అంశాల్ని ఈనాడు పత్రిక ఎంతో ఇష్టంగా ఒక ఫుల్ పేజీ ప్రచురించింది.
అయితే ఇందులో ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగం మిస్ కావడం చర్చనీయాంశమైంది. 1994లో తిరుగులేని ప్రజాభిమానాన్ని ఎన్టీఆర్ చూరగొన్న సంగతి తెలిసిందే. 1994లో టీడీపీ వామపక్షాలతో కలిసి పోటీ చేసింది. 294 స్థానాలకు గాను 216 చోట్ల టీడీపీ ఘన విజయం సాధించింది. ఏడాది తిరగనకే చంద్రబాబు వెన్నుపోటుకు గురైన ఎన్టీఆర్… గద్దె దిగాల్సి వచ్చింది. అల్లుడి చేతిలో వెన్నుపోటుకు గురి కావడాన్ని ఎన్టీఆర్ జీర్ణించుకోలేకపోయారు. ఈ సందర్భంగా చంద్రబాబు, ఆయనకు సహకరించిన ఈనాడు మీడియా అధినేత రామోజీరావుపై కూడా ఎన్టీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రసంగం చరిత్రలో నిలిచిపోయింది.
అయితే తాజాగా తీసుకొచ్చిన రెండు పుస్తకాల్లో కూడా ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగానికి చోటు లేనట్టే కనిపిస్తోంది. ఎందుకంటే ఈనాడు పత్రికలో ఇవాళ ప్రచురించిన కీలక ప్రసంగాల్లో అది లేకపోవడం గమనార్హం. 1983 నుంచి 1988 వరకూ వివిధ సందర్భాల్లో ఎన్టీఆర్ చేసిన ప్రసంగాల్లో ముఖ్యమైన వాటికి చోటు కల్పించారు. కానీ 1995తో సీఎం పీఠంపై నుంచి తనను గద్దె దించిన సందర్భంలో ఎన్టీఆర్ చేసిన చారిత్రక ప్రసంగాన్ని మాత్రం తమకు కన్వినియంట్‌గా విస్మరించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చరిత్రను వక్రీకరించడం అంటే ఇదే కాబోలు. అయితే పుస్తకాల్లో ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగానికి చోటు ఇవ్వనంత మాత్రాన… చంద్రబాబుతో పాటు రామోజీరావు నైజం గురించి ఆ దివంగత నేత చేసిన పరుష వ్యాఖ్యలు ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయి. వాటిని చెరపడం ఎవరి వల్లా కాదని గుర్తిస్తే మంచిది.