ఆ 29 సీట్లలో బాబుకు ఓటమే…ముందే జోస్యం

వచ్చే ఎన్నికల్లో మళ్లీ టీడీపీ ఖాతాలో ఓటమి రాసేందుకు జనాలు సిద్ధంగా ఉన్నారని వైసీపీ మంత్రి మేరుగ నాగార్జున స్పష్టం చేశారు. బాబు అంటే అబద్ధాలు అన్నది జనాలకు బాగా తెలుసు కబట్టే పనిగట్టుకుని…

వచ్చే ఎన్నికల్లో మళ్లీ టీడీపీ ఖాతాలో ఓటమి రాసేందుకు జనాలు సిద్ధంగా ఉన్నారని వైసీపీ మంత్రి మేరుగ నాగార్జున స్పష్టం చేశారు. బాబు అంటే అబద్ధాలు అన్నది జనాలకు బాగా తెలుసు కబట్టే పనిగట్టుకుని ఓడిస్తారని అసలు విషయం చెప్పేశారు.

తాను దళితుల మీద అనేక రకాలుగా మాట్లాడిన చంద్రబాబు ఇపుడు ఏమీ అనలేదని అంటున్నారని, కానీ రికార్డులు అబద్ధాలు చెప్పవు చంద్రబాబూ అన్నారాయన. దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అని బాబు అన్న మాటల వీడియోను విశాఖ వైసీపీ పార్టీ ఆఫీసులో వేసి మరీ మీడియాకు చూపించారు. తోకలు కత్తిరిస్తామని బీసీలను అవమానించారని గుర్తు చేశారు.

ఏపీలో 29 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయని గతసారి 28 వైసీపీయే గెలిచిందని, ఈసారి మాత్రం ఏ కొరతా లేకుండా 29 సీట్లూ తమ పార్టీయే గెలుస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ఎన్నికలు అనగానే చంద్రబాబు కొత్త మాటలు కొత్త రగాలు అందుకుంటారని, చెప్పిందే చెబుతూ జనాలను మభ్యపెడుతున్న విషయం ఆయనకు తెలియకపోయినా ప్రజలకు తెలుసు అని చురకలేశారు.

రోడ్ల మీద తండ్రీ కొడుకులు తిరుగుతున్నా ఆదరణ లేదని దాంతో అసహనంతో తమ పార్టీ మీద విమర్శలు చేస్తున్నారని నాగార్జున సెటైర్లు వేశారు. పద్నాలుగేళ్ల పాటు అధికారం కట్టబెడితే ఏమీ చేయలేనిది మళ్ళీ అధికారం ఇస్తే చెస్తాను అని బాబు చెప్పడం కంటే విడ్డూరం ఉంటుందా అని మంత్రి ప్రశ్నించారు.

ప్రజలు అమాయకులు కాదు చంద్రబాబూ తెలుగుదేశం చరిత్ర మీ చరిత్ర వారికి బాగా తెలుసు అని ఆయన ఫైర్ అయ్యారు. బాబు కంటే బలమైన దళిత వ్యతిరేకి ఎవరూ ఉండబోరని మండిపడ్డారు. బాబు నోటి వెంట పలికేది పేదల మాట అధికారంలో ఉంటే మాత్రం పెత్తందారుల పక్షమని విమర్శించారు.

విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం సాక్షిగా తమ ప్రభుత్వం పేదల బడుగుల పక్షమని ఆయన స్పష్టం చేశారు. ఆ విగ్రహం చెబుతుంది ఏపీలో దళితులకు ఏమి అభివృద్ధి చేశామో అనేది అని ఆయన అంటున్నారు. 53 వేల కోట్లను గత నాలుగేళ్ల కాలంలో దళితుల సంక్షేమం కోసం ఖర్చు చేసిన వైసీపీని విమర్శించడానికి టీడీపీ నేతలు నోరు ఎలా వస్తోందని నిలదీశారు. 2024లో కూడా బాబు పార్టీ రథచక్రాలను ఊడగొట్టి ఓడగొట్టేందుకు దళితులు సిద్ధంగా ఉన్నారని నాగార్జున ఘాటైన హెచ్చరిక జారీ చేశారు.