టాలీవుడ్ లో ఇప్పుడు అందరి దృష్టి ఎన్టీఆర్ పైనే. ఆయన బుధవారం నాడు వైఎస్ జగన్ ను కలవడానికి వెళ్తారా? వెళ్లరా? అన్నదే. వెళ్తారనే బలంగా వినిపిస్తోంది. కానీ టాలీవుడ్ లోని తెలుగుదేశం పార్టీ అభిమానులు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
ఎన్టీఆర్ కనుక ఇప్పుడు వెళ్తే అది ఆయన జీవితకాలంలో చేసే అతి పెద్ద తప్పు అని చాలా మంది తెలుగుదేశం పార్టీ జనాలు అంటున్నారు. చంద్రబాబు భార్యపై వైకాపా నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేసినపుడు ఖండించడానికి ముందుకు రాని ఎన్టీఆర్, ఇప్పుడు ఇలా వెళ్లడం సరికాదని అంటున్నారు.
మహేష్ బాబు వెళ్తారు అనే వార్తను తెలుగుదేశం అభిమాన వర్గం తప్పు పట్టడం లేదు కానీ ఎన్టీఆర్ వెళ్తారు అంటే మాత్రం అది సరికాదు అని అంటున్నారు. ఇలా ఎందుకు అంటున్నారు? ఎందుకిలా ఫీలుతున్నారు అన్నది వారికే తెలియాలి.
ఎన్టీఆర్ ను తెలుగుదేశం పార్టీ అభిమానులు, నాయకులు, అలాగే ఓ వర్గం ఓన్ చేసుకుంటున్నారు. వాళ్లే ఇప్పుడు ఎన్టీఆర్ చర్చల కోసం జగన్ దగ్గరకు వెళ్లడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
అదీకాక మొదటి నుంచీ మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ప్రయత్నాల్లో నందమూరి బాలకృష్ణకు భాగస్వామ్యం లేదు. బహుశా ఈ కారణంగా కూడా ఎన్టీఆర్ వెళ్లడం ఈ వర్గానికి ఇష్టం లేకపోతోందేమో? మొత్తం మీద ఎన్టీఆర్ వెళ్తారా? ఈ రాత్రికి రాత్రి ఆయన మనసు ఏమైనా మార్చే ప్రయత్నం చేస్తారా? అన్నది చూడాలి.