హీరోయిన్లపై సోషల్ మీడియాలో ట్రోల్స్ సర్వసాధారణం. ఎప్పుడు ఏ హీరోయిన్ ట్రోలింగ్ కు గురవుతుందో తెలియదు. హీరోయిన్ కాజల్ కూడా అలానే ట్రోలింగ్ కు గురైంది. ప్రస్తుతం సినిమాలన్నీ పక్కనపెట్టి, మాతృత్వంలో మాధుర్వాన్ని ఆస్వాదించేందుకు సిద్ధమౌతున్న కాజల్, ఊహించని విధంగా బాడీ షేమింగ్ కు గురైంది.
ప్రస్తుతం కాజల్ గర్భవతి. తను గర్భందాల్చిన విషయాన్ని చాన్నాళ్ల కిందటే బయటపెట్టిన ఈ బ్యూటీ, ఇప్పుడు గర్భంతో ఉన్న ఫొటోల్ని సంకోచం లేకుండా సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. అయితే పెరిగిన ఆమె పొట్టను కూడా బాడీ షేమింగ్ చేశారు కొంతమంది. గర్భం దాల్చినప్పుడు ఫొటోషూట్స్ అవసరమా అంటూ పోస్టులు పెట్టారు. మరికొంతమంది సెటైరిక్ గా మీమ్స్ పెట్టారు.
వీటన్నింటినీ చూస్తూ ఊరుకోలేదు కాజల్. ఘాటుగా సమాధానమిచ్చింది. తన జీవితంలో, శరీరంలో, ఇంట్లో, పని చేసే ప్రదేశంలో అద్భుతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని.. వాటన్నింటినీ తను ఎంజాయ్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది కాజల్. ఇలాంటి టైమ్ లో బాడీ షేమింగ్ మెసేజ్ లు, మీమ్స్ పెట్టి తన ఆనందాన్ని చెడగొట్టలేరు అనే అర్థం వచ్చేలా రిప్లయ్ ఇచ్చింది.
బాడీ షేమింగ్ మెసేజ్ లు పెట్టేవారు సహృదయంతో ఉండడం ఎలాగో నేర్చుకోవాలని.. ఒకవేళ అలా ఉండడం వాళ్ల వల్ల కాకపోతే, కనీసం తాము జీవించి, ఇతరుల్ని జీవించనివ్వాలంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చింది.
గర్భధారణ సమయంలో శరీరంలో మార్పులు అనివార్యమని, ముడతలు పడడం, పొట్ట పెరగడం, బరువు పెరగడం, మొటిమలు రావడం లాంటివి సర్వసాధారణమని తెలిపింది కాజల్. బిడ్డకు జన్మనిచ్చే క్రమంలో ఇవన్నీ ఎవరికైనా సహజంగా జరుగుతాయని, ఆ ప్రాసెస్ ను తను ఎంజాయ్ చేస్తున్నట్టు తెలిపింది. తను చెప్పిన ఈ విషయాలన్నీ చాలామందికి తెలుసని, కేవలం కొంతమంది మూర్ఖుల కోసం మాత్రమే తిరిగి వాటిని మళ్లీ చెబుతున్నట్టు మరో కౌంటర్ వేసింది కాజల్.
కాజల్ ఇచ్చిన తిరుగులేని సమాధానానికి నెటిజన్ల నుంచి మాత్రమే కాకుండా.. రాశిఖన్నా, సమంత లాంటి హీరోయిన్ల నుంచి కూడా పూర్తి మద్దతు దక్కుతోంది. ప్రస్తుతం కాజల్ దుబాయ్ లో ఉంది. అక్కడ దిగిన కొన్ని ఫొటోల్ని షేర్ చేసింది.