కొండ వాలులో ఇరుక్కుపోయిన వ్యక్తి బయటపడ్డాడా?

రెండు రోజులుగా కొండ వాలుపై ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన ఓ గుంతలో ఇరుక్కుపోయిన వ్యక్తి ఎట్టకేలకు బయటపడ్డాడు. ఇండియన్ ఆర్మీ అతడ్ని కాపాడింది. ప్రమాదవశాత్తూ కొండపై నుంచి జారి ఆ వాలులో ఉన్న గుంతలో ఉండిపోయాడు…

రెండు రోజులుగా కొండ వాలుపై ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన ఓ గుంతలో ఇరుక్కుపోయిన వ్యక్తి ఎట్టకేలకు బయటపడ్డాడు. ఇండియన్ ఆర్మీ అతడ్ని కాపాడింది. ప్రమాదవశాత్తూ కొండపై నుంచి జారి ఆ వాలులో ఉన్న గుంతలో ఉండిపోయాడు బాబు అనే వ్యక్తి. అతడ్ని విజయవంతంగా సైనికులు బయటకు తీయగలిగారు.

ఇంతకీ ఏం జరిగింది?

కేరళకు చెందిన బాబు.. తన ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి మలప్పుజ దగ్గరున్న కొండపైకి ట్రెక్కింగ్ స్టార్ట్ చేశారు. అయితే కొండ మరీ నిటారుగా ఉండడంతో బాబుతో వచ్చిన మిగతా ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలోనే ట్రెక్కింగ్ ను విరమించుకున్నారు. కానీ బాబు మాత్రం పట్టు వీడలేదు. తన ప్రయాణం సాగించాడు. అనుకున్నది సాధించాడు.

అయితే శిఖరం వరకు వెళ్లిన బాబు, ప్రమాదవశాత్తూ జారిపడ్డాడు. అదృష్టవశాత్తూ అతడికి కొండపై ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన ఓ చిన్న గుంతలాంటిది దొరికింది. అందులోకి చేరుకున్న బాబు, 48 గంటల పాటు అక్కడే ఉండిపోయాడు. మిత్రులు అందించిన సమాచారం ప్రకారం, రంగంలోకి దిగిన కేరళ సహాయక సిబ్బంది ఎంత ప్రయత్నించినప్పటికీ బాబును బయటకు తీసుకురాలేకపోయారు.

దీంతో కేరళ ముఖ్యమంత్రి భారత సైన్యం సహాయం కోరారు. వెంటనే రంగంలోకి దిగిన సైన్యం.. సక్సెస్ ఫుల్ గా బాబును కొండ గుంత నుంచి బయటకు తీసుకురాగలిగారు. దీనికి సంబంధించిన ఓ చిన్న వీడియోను ఆర్మీ బయటపెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో, దానికి సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి.

2 రోజులు నీరు, తిండి, నిద్ర లేకుండా గడిపిన బాబును వెంటనే హాస్పిటల్ కు తరలించారు. ప్రాధమిక వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత బాబు ఆరోగ్యంగానే ఉన్నాడని తేల్చారు వైద్యులు.