హనుమంతుడిపై టీటీడీ పుస్తకం.. మళ్లీ గొడవ తప్పదా

గతంలో ఓసారి హనుమంతుడి జన్మస్థానంపై గొడవ జరిగింది. తిరుమల అంజనాద్రి హనుమంతుడి జన్మస్థలం అంటూ టీటీడీ ప్రకటించడంతో ఉత్తరాదిన కొన్ని ఆధ్యాత్మిక సంఘాలు అభ్యంతరం తెలిపాయి. Advertisement హనుమంతుడి జన్మస్థానం గురించి అప్పట్లో పుస్తక…

గతంలో ఓసారి హనుమంతుడి జన్మస్థానంపై గొడవ జరిగింది. తిరుమల అంజనాద్రి హనుమంతుడి జన్మస్థలం అంటూ టీటీడీ ప్రకటించడంతో ఉత్తరాదిన కొన్ని ఆధ్యాత్మిక సంఘాలు అభ్యంతరం తెలిపాయి.

హనుమంతుడి జన్మస్థానం గురించి అప్పట్లో పుస్తక ముద్రణకు కాస్త ముందూవెనకా ఆడిన టీటీడీ ఇప్పుడు మరోసారి పుస్తకం వ్యవహారాన్ని తెరపైకి తెస్తోంది. ఈనెల 16న పుస్తకావిష్కరణకు మహూర్తం కూడా ఖరారు చేశారు. మరి ఈసారి ఎలాంటి పరిణామాలుంటాయో చూడాలి.

అంజనాద్రిపై పట్టుదల..

అంజనాద్రి ఆంజనేయుడి జన్మస్థలం అని టీటీడీ నమ్ముతోంది, ఎవరూ కాదనలేరు. కానీ దాన్ని ప్రపంచం అంతా నమ్మాలని, నమ్మి తీరాలని చేస్తున్న ప్రయత్నమే బెడిసి కొట్టింది. దేవుడు సర్వాంతర్యామి అనే సూత్రాన్ని నమ్మితే ఎవరూ దీన్ని వ్యతిరేకించేవారు కూడా కాదు. కానీ ఇప్పుడు దేవుడు మా వాడు, మా కులం, మా ఊరు.. అనే తారతమ్యాలు ఎక్కువయ్యాయి. దీంతో సమస్య మొదలైంది.

హంపీ దగ్గర ఉన్న విజయనగరం, కిష్కింద, నాసిక్, జార్ఖండ్, గుజరాత్, మహారాష్ట్ర సహా పలు ప్రాంతాల్లోని కొన్ని ప్రదేశాలను హనుమంతుడి జన్మస్థానాలుగా అక్కడివారు నమ్ముతుంటారు. వారిలో కొంతమంది టీటీడీ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని చూశారు. తీరా ఇక్కడ జరిగిన చర్చలు అర్థాంతరంగా ముగిసిన తర్వాత ఎవరి వాదన వారే కరెక్ట్ అని చెప్పుకున్నారు.

అయితే టీటీడీ నియమించిన కమిటీ మాత్రం అంజనాద్రి ఆంజనేయుడి జన్మస్థానం అంటూ నిర్థారించింది. అంజనాద్రిలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు కూడా భూమిపూజ చేయబోతోంది. అక్కడ అంజనాదేవితో పాటు, బాలాంజనేయ స్వామికి ఆలయం, ముఖమండపం, గోపురం నిర్మించబోతున్నారు. యాదాద్రి పునర్నిర్మాణానికి స్కెచ్ లు వేసి ఇచ్చిన సినీ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి తో ఇక్కడ కూడా స్కెచ్ లు వేయించబోతున్నారు.

మొత్తానికి టీటీడీ మాత్రం ఆంజనేయుడి జన్మస్థలం, ఆలయాల నిర్మాణాలకు ఉత్సాహంగా ఉంది. మరి దీనిపై కొత్తగా వివాదాలు వస్తాయా, ఇప్పటికే ఓసారి చర్చోపచర్చలు జరిగాయి కాబట్టి, ఈసారి ఎవరూ ఆటంకాలు చెప్పకపోవచ్చు. మరి పుస్తకం విడుదలైన తర్వాత ఎలాంటి సమీక్షలు వస్తాయో చూడాలి.