ఫ్లాప్ అయితే ఓటీటీ కూడా లైట్

మూవీ ఆఫ్ ది మంత్.. మెగా మూవీ.. సూపర్ సెన్సేషనల్ మూవీ.. బిగ్గెస్ట్ మూవీ ఆఫ్ ది ఇయర్.. ఫ్లాప్ సినిమాకు కూడా ఇలాంటి ట్యాగ్ లైన్స్ తగిలించి ప్రచారం చేసుకుంటాయి టీవీ ఛానెళ్లు,…

మూవీ ఆఫ్ ది మంత్.. మెగా మూవీ.. సూపర్ సెన్సేషనల్ మూవీ.. బిగ్గెస్ట్ మూవీ ఆఫ్ ది ఇయర్.. ఫ్లాప్ సినిమాకు కూడా ఇలాంటి ట్యాగ్ లైన్స్ తగిలించి ప్రచారం చేసుకుంటాయి టీవీ ఛానెళ్లు, ఓటీటీ సంస్థలు. ఎందుకంటే, సినిమా ఫ్లాప్ అయినా తమకు బిజినెస్ అవ్వాలి కాబట్టి. కానీ ఇప్పుడీ పద్ధతి మారిపోయింది. ఫ్లాప్ సినిమాల్ని ఓటీటీలు, టీవీ ఛానెళ్లు లైట్ తీసుకుంటున్నాయి.

ఎంత పెద్ద హీరో అయినా ఓటీటీ సంస్థలకు అనవసరం. సినిమా సక్సెస్ అయితే, తమ ఓటీటీ కోసం మరోసారి దానికి ప్రచారం కల్పిస్తాయి. సెపరేట్ గా మార్కెటింగ్ బడ్జెట్ రిలీజ్ చేసి మరీ స్ట్రీమింగ్ డేట్ వరకు ఊదరగొడతాయి. సినిమా ఫ్లాప్ అయితే మాత్రం ప్రచారానికి పైసా ఖర్చుపెట్టడం లేదు. సైలెంట్ గా స్ట్రీమింగ్ కు పెట్టేసి చేతులు దులిపేసుకుంటున్నాయి.

హంట్, ఎమిగోస్, రంగమార్తాండ.. ఇలా ఎన్నో సినిమాలు సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేశాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి రావణాసుర కూడా చేరిపోయింది. తమ ప్రతి సినిమాకు భారీగా ప్రచారం చేసే అమెజాన్ సంస్థ రవితేజ సినిమాను లైట్ తీసుకుంది. కామ్ గా స్ట్రీమింగ్ కు పెట్టేసింది. మరోవైపు దసరా స్ట్రీమింగ్ కు నెట్ ఫ్లిక్స్ చేసిన హంగామాను మనం చూశాం. ఇంత తేడా ఉంది.

ఇక టీవీ ఛానెళ్లు కూడా ఇలానే వ్యవహరిస్తున్నాయి. థియేటర్లలో హిట్టయిన సినిమాకే ప్రమోషనల్ బడ్జెట్ పెడుతున్నాయి. వీకెండ్ ప్రైమ్ టైమ్ లో టెలికాస్ట్ చేస్తున్నాయి. ఫ్లాప్ అయిన సినిమాల్లో, ఎంత పెద్ద హీరో ఉన్నప్పటికీ వాటికి పెద్దగా ప్రచారం చేయడం లేదు. అంతేకాదు.. పొద్దున్న లేదా మధ్యాహ్నం స్లాట్స్ లో వాటిని ప్రసారం చేసి మమ అనిపిస్తున్నాయి.

ఫ్యాన్స్ ఇప్పుడు వీటిని కూడా గమనిస్తున్నారు. ఏ హీరో సినిమాకు ఏ స్లాట్ వచ్చింది, ఎవరెంత ప్రచారం చేస్తున్నారనే అంశాల్ని కూడా లెక్కలోకి తీసుకొని మరీ ట్రోలింగ్ షురూ చేస్తున్నారు.