విజ‌య‌సాయిరెడ్డికి ఎక్క‌డిదీ ధైర్యం?

ఏపీకి ఎంత అన్యాయం చేస్తున్నా ప్ర‌ధాన రాజ‌కీయ ప‌క్షాలు ప్ర‌శ్నించ‌లేని దుస్థితి. ఏపీలోని అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల‌న్నీ మోదీ ప‌క్ష‌మే. దేశంలో ఇలాంటి వింత ప‌రిస్థితి మ‌రెక్క‌డా ఉండ‌దు. త‌మ‌ను ప్ర‌శ్నించ‌లేని రాజ‌కీయ ప‌క్షాల…

ఏపీకి ఎంత అన్యాయం చేస్తున్నా ప్ర‌ధాన రాజ‌కీయ ప‌క్షాలు ప్ర‌శ్నించ‌లేని దుస్థితి. ఏపీలోని అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల‌న్నీ మోదీ ప‌క్ష‌మే. దేశంలో ఇలాంటి వింత ప‌రిస్థితి మ‌రెక్క‌డా ఉండ‌దు. త‌మ‌ను ప్ర‌శ్నించ‌లేని రాజ‌కీయ ప‌క్షాల అధైర్యాన్ని సాకుగా తీసుకుని మోదీ స‌ర్కార్ విభ‌జ‌న హామీల‌ను అట‌కెక్కించింది. ఇటీవ‌ల ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌లో మ‌రోసారి మోదీ ప్ర‌భుత్వం ఏపీకి తీర‌ని అన్యాయం చేసింది.

ఈ నేప‌థ్యంలో బ‌డ్జెట్‌పై చ‌ర్చ‌లో భాగంగా రాజ్య‌స‌భ‌లో వైసీపీ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి ధైర్యాన్ని కూడ‌దీసుకుని మోదీ స‌ర్కార్‌పై పెద్ద విమ‌ర్శే చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కోణంలో కేంద్రం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌ను చెత్త బ‌డ్జెట్‌తో పోల్చారు. నిజంగా ఈ విమ‌ర్శ చేసింది వైసీపీ ఎంపీనేనా అనే అనుమానం ఎవ‌రికైనా రాక‌మాన‌దు. కేంద్ర బ‌డ్జెట్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ నిప్పులు చెర‌గ్గా, ఏపీ సీఎం జ‌గ‌న్ మాత్రం ఇంత వ‌ర‌కూ నోరు మెద‌ప‌క‌పోవ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది.

అలాంటిది ఏకంగా చెత్త బ‌డ్జెట్ అని విజ‌య‌సాయిరెడ్డి ఘాటు విమ‌ర్శ చేయ‌డంతో తోటి వైసీపీ, టీడీపీ స‌భ్యులు కూడా అవాక్కైన ప‌రిస్థితి. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ నిరాశ పరిచిందని ఆయ‌న అన్నారు. ఆత్మ నిర్భరత కేంద్రానికే కాదు రాష్ట్రాలకూ అవసరమేనని ఆయ‌న అన్నారు. సెస్‌లు, సర్‌ఛార్జ్‌ల పేరుతో రాష్ట్రాల పన్ను వాటా తగ్గించారని వాపోయారు.  

2010-2015 మధ్య ఏపీ షేర్‌ 6.9 శాతం కాగా, 2015-2020 నాటికి ఏపీ పన్నుల వాటా 4.3 శాతానికి పడిపోయిందని ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ దృష్టికి విజయసాయిరెడ్డి తీసుకెళ్లారు. అలాగే వ్యవసాయంపై ఏపీ ప్రభుత్వం 5.9 శాతం నిధులు ఖ‌ర్చు చేస్తోంటే, కేంద్ర ప్ర‌భుత్వం కేవ‌లం 3.9 శాతం మాత్రమే వెచ్చిస్తోంద‌ని ఆరోపించారు.  

విద్య కోసం ఏపీ 11.8 శాతం ఖర్చు చేస్తుంటే కేంద్రం 2.6 శాతం ఖర్చు చేస్తోందని తూర్పార ప‌ట్టారు.  ఏపీ ప్రభుత్వంపై కేంద్రం సవతి ప్రేమ చూపిస్తోందని ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటు విమ‌ర్శ చేశారు.

ఇవాళ రాజ్య‌స‌భ‌లో కేంద్రంపై విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శ‌లు వింటుంటే… ఇన్నాళ్లుగా లేని ధైర్యం ఇప్పుడు కొత్త‌గా ఎక్క‌డి నుంచి, ఎలా వ‌చ్చింద‌నే ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇదే రీతిలో మొద‌టి నుంచి కేంద్రాన్ని నిల‌దీసి వుంటే, ఏపీకి ఈ దుస్థితి వచ్చి వుండేది కాద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

క‌నీసం ఇప్ప‌టికైనా కేంద్రాన్ని నిల‌దీస్తున్నందుకు సంతోష‌మే అని, విభ‌జ‌న హామీల‌ను సాధించుకునేలా మోదీ స‌ర్కార్‌పై పోరాటం చేయాల‌ని నెటిజ‌న్లు హిత‌వు చెబుతున్నారు.