కాంగ్రెసే లేక‌పోతే.. నిప్పులాంటి నిజాలు !

పార్ల‌మెంట్ సాక్షిగా కాంగ్రెస్‌పై ప్ర‌ధాని మోదీ త‌న అక్క‌సును వెళ్ల‌గ‌క్క‌డం చర్చ‌నీయాంశ‌మైంది. రెండుసార్లు అధికారంలోకి వ‌చ్చిన బీజేపీ… కోలుకోలేని స్థితిలో ఉన్న కాంగ్రెస్‌పై ఇంకా ఉగ్ర‌రూపం ప్ర‌ద‌ర్శించ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. అస‌లు త‌న‌కు దేశంలో…

పార్ల‌మెంట్ సాక్షిగా కాంగ్రెస్‌పై ప్ర‌ధాని మోదీ త‌న అక్క‌సును వెళ్ల‌గ‌క్క‌డం చర్చ‌నీయాంశ‌మైంది. రెండుసార్లు అధికారంలోకి వ‌చ్చిన బీజేపీ… కోలుకోలేని స్థితిలో ఉన్న కాంగ్రెస్‌పై ఇంకా ఉగ్ర‌రూపం ప్ర‌ద‌ర్శించ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. అస‌లు త‌న‌కు దేశంలో ఎదురు లేద‌ని భావిస్తున్న బీజేపీ… ఇంకా కాంగ్రెస్‌ను ప్ర‌త్యామ్నాయంగా చూస్తోంద‌న్న భావ‌న నిన్న‌టి ప్ర‌ధాని విమ‌ర్శ‌ల‌తో రూడీ అయింది.

ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్‌పై మోదీ చేసిన కొన్ని వ్యాఖ్య‌ల‌పై త‌ప్ప‌క చ‌ర్చించుకోవాలి. ఈ దేశంలో కాంగ్రెస్ అనే పార్టీ లేక‌పోయి వుంటే… కొన్ని దురాగ‌తాలు జ‌రిగేవి కావ‌ని మోదీ చెప్పుకొచ్చారు. నిజ‌మే, ఆయ‌న మాట‌ల‌ను అంద‌రూ అంగీక‌రించాల్సిందే. కాంగ్రెస్ అనే పార్టీనే లేక‌పోయి వుంటే తానెక్క‌డో ఒక్క‌సారి ప్ర‌ధాని మోదీ అంత‌రాత్మ‌ను ప్ర‌శ్నించుకోవాలి. కాంగ్రెస్ కుటుంబ పాల‌న‌, అవినీతి , అప్ర‌జాస్వామిక విధానాలే న‌చ్చ‌కే 2014లో బీజేపీకి దేశ ప్ర‌జానీకం ప‌ట్టం క‌ట్టింది.

గ‌త ఐదేళ్ల పాల‌న‌లో ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని, ఆశ‌యాల్ని ఎంత వ‌ర‌కు నెర‌వేర్చారో ప్ర‌ధాని మోదీ దేశానికి స‌మాధానం చెప్పాలి. కాంగ్రెస్ అనే బూచీని రెండోసారి కూడా చూపి బీజేపీ అధికారంలోకి వ‌చ్చింద‌నేది వాస్త‌వం. రెండోసారి కూడా ప్ర‌ధాని ప‌ద‌వి చేప‌ట్టిన మోదీ, గ‌త ఏడున్న‌రేళ్ల‌లో ఏం చేశారో చెప్ప‌డానికి బ‌దులు ప్ర‌త్య‌ర్థుల‌పై విరుచుకుప‌డడం న్యాయ‌మా?

పార్ల‌మెంట్‌లో కాంగ్రెస్‌పై మోదీ చేసిన ఘాటు విమ‌ర్శ‌లేంటో తెలుసుకుందాం.

‘ఈ దేశంలో సుదీర్ఘ కాలం పాటు పాల‌న సాగించిన కాంగ్రెస్‌ వల్లే అనేక దారుణాలు. కాంగ్రెస్‌ అధికార దాహంతో దేశంలో ప్రజాస్వామ్యం గొంతు నులిమింది. ఆ పార్టీ అధికారంలో లేకపోయి ఉంటే దేశంలో వారసత్వ రాజకీయాలు, సిక్కుల ఊచకోత, కశ్మీరీ పండిట్లపై అరాచకాలు జరిగేవి కావు. ఎమర్జెన్సీ, కులాలు, ప్రాంతాల వారీగా దేశ విభజన జరిగి ఉండేది కాదు. కాంగ్రెస్‌ లేకపోతే భారతదేశం మనోభావాల ఆధారంగా నిర్ణయాలు జరిగి ఉండేది. విదేశీ ధృక్పథం లేకపోయేది. మేము చరిత్రను మార్చడంలేదు. ప్రజల జ్ఞాపకాలను తాజా చేస్తున్నాం. చరిత్రను కొన్ని వందల ఏళ్లు వెనక్కి తీసుకెళ్తున్నాం. చరిత్ర అంటే అదే. కానీ, కొందరికి చరిత్ర అంటే ఒక కుటుంబం మాత్రమే’ అని వ్యాఖ్యానించారు.

రాత్రికి రాత్రి పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేసి దేశ ప్ర‌జానీకాన్ని న‌డిరోడ్డుపై రోజుల త‌ర‌బ‌డి నిల‌బెట్టిన ఘ‌న‌త ఎవ‌రిదో ప్ర‌ధాని చెప్పి వుంటే బాగుండేది. రైతు చ‌ట్టాలు తీసుకొచ్చి… ఢిల్లీ కేంద్రంగా ఏడాది పాటు క‌ర్ష‌కులు అలుపెర‌గ‌ని ఉద్య‌మం చేసేందుకు కార‌కులెవ‌రో ప్ర‌ధాని చెప్పి వుంటే బాగుండేది. క‌రోనా మొద‌టి వేవ్‌లో కేవ‌లం ఒక్క‌రోజు ముందు లాక్‌డౌన్ ప్ర‌క‌ట‌న చేసి… ఎక్క‌డిక‌క్క‌డ జ‌నం నిలిచిపోయేలా చేసిందెవ‌రో ప్ర‌ధాని ప్ర‌క‌టించి వుండే బాగుండేది. వంద‌లు, వేల కిలోమీట‌ర్ల దూరాన్ని కాలిన‌డ‌క‌న జ‌నం చేరుకోడానికి ఎవ‌రి పాల‌నా విధాలు కార‌ణ‌మో ప్ర‌ధాని పార్ల‌మెంట్‌లో చెప్పి వుంటే ఎంతో బాగుండేది.

క‌రోనాతో దేశం అంతా అల్లాడుతుంటే చ‌ప్ప‌ట్లు కొట్టాల‌ని, దీపాలు వెలిగించాల‌నే పిలుపుతో న‌వ్వుల‌పాలైంది ఎవ‌రో మోదీ చెప్పి వుంటే బాగుండేది. ఔను, మోదీని విమ‌ర్శించి లాభం ఏంటి? ఇలాంటి వ్య‌క్తి ప్ర‌ధాని కావ‌డానికి కాంగ్రెస్ ఐదు ద‌శాబ్దాల పాల‌నా వైఫ‌ల్యాలే కార‌ణం. మోదీ విమ‌ర్శిస్తున్న‌ట్టు కాంగ్రెస్ ఆ త‌ప్పులే చేయ‌క‌పోయి వుంటే, మ‌న‌కు ఇలాంటి గొప్ప ప్ర‌ధాని వ‌చ్చి వుండేవారు కాదు. 

ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్‌, అలాగే ఇత‌ర ప్ర‌తిష్టాత్మ‌క కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌లు ప్రైవేట్‌పరం అయ్యేవి కావు. వాటి ఆస్తుల‌ను అమ్ముకునే దుస్థితి మ‌న‌కు ఏర్ప‌డేది కాదు. కాంగ్రెస్ లేక‌పోయి వుంటే ఇవ‌న్నీ జ‌రిగి వుండేవి కావ‌ని మోదీ మాట‌ల్లోని నిజాల‌ను గ్ర‌హించాలంటే కాసింత లోతుగా అధ్య‌య‌నం చేయాలి.