మంత్రి అప్ప‌ల‌రాజుకు ప‌రాభ‌వం

జ‌గ‌న్ కేబినెట్ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజుకు ప‌రాభ‌వం జ‌రిగింది. దీంతో సీఎంతో పాటు శార‌దా పీఠం ఉత్స‌వాల్లో పాల్గొన‌కుండా ఆయ‌న అవ‌మాన భారంతో వెనుతిరిగారు. ప్ర‌భుత్వం ఇచ్చిన అలుసు… చివ‌రికి కేబినెట్ మంత్రిని కూడా…

జ‌గ‌న్ కేబినెట్ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజుకు ప‌రాభ‌వం జ‌రిగింది. దీంతో సీఎంతో పాటు శార‌దా పీఠం ఉత్స‌వాల్లో పాల్గొన‌కుండా ఆయ‌న అవ‌మాన భారంతో వెనుతిరిగారు. ప్ర‌భుత్వం ఇచ్చిన అలుసు… చివ‌రికి కేబినెట్ మంత్రిని కూడా లెక్క‌చేయ‌ని స్థితి వ‌చ్చింది.

విశాఖ శార‌దా పీఠం వేడుక‌ల్లో పాల్గొనేందుకు సీఎం జ‌గ‌న్ వెళ్లారు. ఉత్త‌రాంధ్ర‌కు చెందిన మంత్రి అప్ప‌ల‌రాజు కూడా అక్క‌డికి వెళ్లారు. శార‌దా పీఠం ఆశ్ర‌మంలోకి అనుచ‌రుల‌తో క‌లిసి వెళ్లేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నించారు. అయితే మంత్రిని మాత్ర‌మే లోప‌లికి అనుమ‌తించి, అనుచ‌రుల‌ను అక్క‌డున్న సీఐ అడ్డుకున్నారు. అనుచ‌రుల‌ను కూడా త‌న‌తో పాటు అనుమ‌తించాల‌ని మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.

మంత్రి అభ్య‌ర్థ‌న‌ను సీఐ ఖాత‌రు చేయ‌లేదు. ఇద్ద‌రి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. త‌నను సీఐ దుర్భాష‌లాడార‌ని మంత్రి ఆరోపించారు. త‌మ నాయ‌కుడిపై సీఐ దూష‌ణ‌ల‌కు వ్య‌తిరేకంగా మంత్రి అనుచ‌రులు ఆందోళ‌న‌కు దిగారు. త‌న‌కు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని మంత్రి సీదిరి అప్ప‌లరాజు డిమాండ్ చేశారు. మంత్రి డిమాండ్‌ను సీఐ లెక్క‌పెట్ట‌లేదు.

సీఐని స‌స్పెండ్ చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. త‌న‌ను తిడితే, ప్ర‌భుత్వాన్ని అన్న‌ట్టే అని మంత్రి వాపోయారు. ఈ నేప‌థ్యం లో పోలీస్ ఉన్న‌తాధికారులు జోక్యం చేసుకుని మంత్రికి స‌ర్ది చెప్పారు. సీఐ క‌థేంటో హోంమంత్రి సుచ‌రిత వ‌ద్దే తేల్చుకుంటాన‌ని మంత్రి హెచ్చ‌రించారు. చివ‌రికి శార‌దా పీఠం వేడుక‌ల్లో పాల్గొన‌కుండానే మంత్రి వెనుతిరిగారు.  

పోలీసులకు అప‌రిమిత‌మైన అధికారాల‌ను క‌ట్ట‌బెట్ట‌డం వ‌ల్లే చివ‌రికి మంత్రుల‌ను కూడా లెక్క‌చేయ‌ని దుస్థితి వ‌చ్చింద‌ని మంత్రి అనుచ‌రులు విమ‌ర్శిస్తూ అక్క‌డి నుంచి వెళ్లిపోయారు.