పవన్ స్క్రిప్టును చదువుతున్న చంద్రబాబు!

సాధారణంగా చంద్రబాబునాయుడు తాను అనేక మంది ఇతర నాయకులకు స్క్రిప్టు రైటర్ గా ఉంటారు. తనతో కలిసి నడవదలచుకునే నాయకులందరూ కూడా ఏయే సందర్భాల్లో ఏం మాట్లాడాలో విపులంగా స్క్రిప్టు రాసి ఆ మేరకు…

సాధారణంగా చంద్రబాబునాయుడు తాను అనేక మంది ఇతర నాయకులకు స్క్రిప్టు రైటర్ గా ఉంటారు. తనతో కలిసి నడవదలచుకునే నాయకులందరూ కూడా ఏయే సందర్భాల్లో ఏం మాట్లాడాలో విపులంగా స్క్రిప్టు రాసి ఆ మేరకు వారితో చిలక పలుకులు పలికిస్తుంటారు. 

ఈ సాంప్రదాయానికి భిన్నంగా చంద్రబాబునాయుడు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలను గమనిస్తే.. ఆయన పవన్ కల్యాణ్ పంపిన స్క్రిప్టును చదువుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ప్రసంగం మొత్తం కులాల వాసన కొడుతోంది. పవన్ కల్యాణ్ మాట్లాడుతున్న కులాల గోలనే తలపిస్తోంది. 

సాధారణంగా ఏ కులాలతో సమావేశమైతే ఆ కులాల వారిని సంతృప్తి పరచేలా రాజకీయ నాయకులు మాట్లాడుతుంటారు. అంతవరకు ఏ నాయకుడికి కూడా మినహాయింపు ఉండదు. 

వచ్చే ఏడాది ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి తపన పడుతూ వరుస సమావేశాలు నిర్వహిస్తున్న చంద్రబాబు.. తాజాగా బీసీలతో ఒక సభ పెట్టారు. ఇలాంటి సభలో బీసీలను ఉద్ధరించేస్తాననే మాటలు చెప్పడం సహజం. అలాగే పీ4 అంటూ తానొక కొత్త తారకమంత్రం కనుగొన్నాడు గనుక.. దాని గురించి డప్పు కొట్టుకోవడం కూడా సహజం. కానీ చంద్రబాబు మాటలన్నీ అచ్చంగా పవన్ కల్యాణ్ స్క్రిప్టులాగా సాగిపోయాయి. 

పవన్ కల్యాణ్ తన ప్రతి ప్రసంగంలో.. తనకు తెలిసిన కులాల పేర్లన్నీ కాగితంలో రాసుకుని ఆ పేర్లను జాగ్రత్తగా చదివి.. ఆ కులాలు అన్నింటికీ రాజ్యాధికారం ఇచ్చేస్తాను. మీ ఒక్క కులం ముఖ్యమంత్రి అయితే చాలా.. అంటూ రంకెలు వేస్తుంటారు. అక్కడికి తాను అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని సమస్త వెనుకబడిన కులాల వారికి ముఖ్యమంత్రి పదవిని రోజుల వారీగా పంచిపెట్టడానికి ఫిక్సయినట్టుగా పవన్ కల్యాణ్ మాట్లాడుతుంటారు. 

చంద్రబాబు ఆయన లాగా లిస్టు చదవలేదు గానీ.. రాష్ట్రంలోని అన్ని కులాల వారికి జనాభా ప్రాతిపదికన ప్రత్యక్ష ఎన్నికల్లో అవకాశం కల్పిస్తాం అని ప్రకటించారు. ఎంతైనా చంద్రబాబు కాస్త తెలివైన వాడు గనుక.. పవన్ కల్యాణ్ లాగా తలా తోకా లేకుండా మాట్లాడే వ్యక్తి కాదు గనుక.. ప్రత్యక్ష ఎన్నికల్లో అవకాశం లేకపోతే గనుక.. పరోక్షంగా వారికి అవకాశం కల్పిస్తాం అని ఒక మెలిక కూడా పెట్టారు. 

నాయకుడనే వాడు సమతుల్య సంక్షేమాన్ని ఆచరణలోకి తీసుకురావడానికి ప్రయత్నించాలి గానీ.. కులాల దామాషాల్లో నేలబారు మాటలతో ప్రజలను వంచించడానికి పూనుకోవడంలో చంద్రబాబు- పవన్ కల్యాణ్ ఇద్దరూ ఒకే తీరుగా వ్యవహరిస్తున్నారు.