ఇన్నేళ్లు గడచిపోయాయి. జనసేనాని పవన్ కల్యాణ్ ఇప్పుడు హఠాత్తుగా పోలవరం ప్రాజెక్టు మీద అవ్యాజప్రేమానురాగాలను కురిపిస్తున్నారు ఎందుకు? ఇటీవలి ఢిల్లీ పర్యటనలో కూడా కేంద్రమంత్రిని కలిసి పోలవరం విషయంలో వినతిపత్రాలు సమర్పించిన పవన కల్యాణ్, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు సందర్శనను కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. వచ్చే నెలలో ఆయన సందర్శన ఉంటుందని, ఆయన నెంబర్ టూ నాదెండ్ల మనోహర్ ఆల్రెడీ ప్రకటించారు.
పవన్ కల్యాణ్ హఠాత్తుగా పోలవరం మీదకు తన ప్రేమను పూర్తిగా మళ్లించడానికి వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని పలువురు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే.. బోణీ కొట్టి అసెంబ్లీలో తన పార్టీ కాలు పెట్టాలని పవన్ కల్యాణ్ కలగంటున్నారు.
ఖచ్చితంగా తమ పార్టీ గెలిచే సీటు అంటూ ఆయనకు ఇంకా ఏదీ కనిపించడం లేదు. అలాంటిది ఏదైనా తేలితే.. ఆ సీటునుంచి తాను బరిలోకి దిగాలనేది ఆయన కోరిక. తన కోసం ఇంకా ప్రాబబుల్స్ ఎంపికలోనే ఉన్నారు.
అదే సమయంలో కులబలం కూడా పుష్కలంగా ఉన్నది గనుక.. గోదావరి జిల్లాల్లో తమ పార్టీకి ఈసారి గతంలో కంటె సానుకూల వాతావరణం ఉంటుందనేది పవన్ అంచనాగా తెలుస్తోంది. అలాంటి గోదావరి జిల్లాల్లోని వాతావరణాన్ని మరింతగా తమకు అనుకూలంగా మార్చుకోడానికి, అక్కడి ప్రజలను మరింతగా బురిడీ కొట్టించడానికి, పవన్ కల్యాణ్, తాజాగా పోలవరం స్కెచ్ వేసినట్టుగా కనిపిస్తోంది.
పోలవరం మీద ఇంత ప్రేమ నటిస్తున్న పవన్ కల్యాణ్.. ఆ ప్రాజెక్టుకు నిధులు కేటాయించే విషయంలో కేంద్రంలోని పెద్దలను ఏం అడిగారు. ‘కేంద్ర బడ్జెట్లో ముష్టి వేసినట్టుగా నిధులు విదిలిస్తోంటే.. ఈ ప్రాజెక్టు ఎన్ని వందల సంవత్సరాలకు పూర్తవుతుంది సార్’ అని కేంద్రాన్ని ఎందుకు అడగలేకపోయారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలో తాను కూడా భాగస్వామి పార్టీనే అని చెప్పుకోడానికి ఉబలాటపడే పవన్ కల్యాణ్ కేంద్రంనుంచి పోలవరం కోసం ఏం సాధిస్తున్నారు.
పోలవరం అనేది పూర్తిగా జాతీయ ప్రాజెక్టు కాగా, పనులు పూర్తి చేయడానికి కేంద్రం సకాలంలో నిధులు ఇవ్వకపోవడం అనే దారుణం శనిలా పట్టి వెన్నాడుతోంది. దానిని నిలదీయగల సత్తా పవన్ కు లేదు.
నిర్వాసితులందరికీ పరిహారం కూడా కేంద్రమే చెల్లించాలి అనేది ప్రధాన డిమాండ్ కాగా, ఆ విషయం వారి వద్ద ప్రస్తావించే ధైర్యం కూడా పవన్ కల్యాణ్ కు లేదు. ఇలాంటి పిరికి నాయకుడు.. ఇప్పుడు పోలవరం వెళ్లి అక్కడి నిర్వాసితులతో మాట్లాడి వాళ్ల సమస్యలను తెలుసుకుంటారట. పోలవరం జాప్యానికి జగన్మోహన్ రెడ్డి కారణం అంటూ పసలేని నిందలు వేయడానికి తప్ప ఆయన యాత్రలో మరో పరమార్థం లేదు.
నిధులు ఇవ్వకుండా వంచిస్తున్న కేంద్రంలోని బిజెపిని నిలదీసే, కనీసం ప్రశ్నించే దమ్ములేని ఈ నాయకుడు.. పోలవరం డ్రామా షురూ చేస్తుండడమే చిత్రం.