ఊరందరిది ఒక దారైతే ఉలిపి కట్టెది ఇంకో దారి అనే చందంగా వైసీపీ తీరు ఉంది. ప్రతిపక్షాల్ని లొంగదీసుకోడానికి ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలను కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ ఉసిగొల్పుతోందనే విమర్శ వెల్లువెత్తుతోంది. ఈడీ, సీబీఐ, ఐటీ అనేవి కేవలం కమోదీ సర్కార్ చేతిలో తోలుబొమ్మలని దేశ వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలన్నీ దుమ్మెత్తి పోస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయమై ఇటీవల సుప్రీంకోర్టులో పలు విపక్ష పార్టీలు పిటిషన్ కూడా వేశాయి. అయితే సుప్రీంకోర్టు ప్రతిపక్షాల వాదనతో ఏకీభవించకపోవడం వేరే సంగతి.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చెలాయిస్తున్న వైసీపీ వాదన విచిత్రంగా ఉంది. వివేకా హత్య కేసులో సీబీఐ కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేయడానికి కుట్ర పన్నుతోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ హైకోర్టులో అవినాష్‌రెడ్డి బెయిల్‌పై విచారణ సందర్భంగా ఆయన తరపు న్యాయవాది నిరంజన్‌రెడ్డి కూడా ఇదే వాదన వినిపించడం గమనార్హం.
ఎలాంటి సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా కడప ఎంపీ అవినాశ్‌రెడ్డిని అరెస్టు చేయడానికి సీబీఐ అత్యుత్సాహం చూపుతోందని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించడాన్ని చూడొచ్చు. అవినాశ్ టార్గెట్‌గా దర్యాప్తు చేస్తోంది తప్ప.. ఇతర కీలక అంశాలను పట్టించుకోవడం లేదని వాదించారు. శుక్రవారం అవినాశ్‌రెడ్డి విడుదల చేసిన వీడియోలో కూడా సీబీఐ దర్యాప్తు అధికారి రామ్‌సింగ్ తేడా మనిషని, అతను కుట్రపూరితంగా విచారిస్తున్నారని ఆరోపించారు.
ఒకవేళ అదే నిజమైతే, అడిగినా, అడగకపోయినా కేంద్రంలో మోదీ సర్కార్‌కు మద్దతు ఇస్తున్న వైసీపీ ఆ మాత్రం కుట్రల్ని అడ్డుకోలేకపోతోందా? సీబీఐ అధికారి స్వతంత్రంగా అంత దూకుడు ప్రదర్శించే అవకాశం వుంటుందా? మరి మోదీ సర్కార్ ఏం చేస్తున్నట్టు? అన్యాయానికి గురి అవుతున్నామన్న భావనలో వైసీపీ వుంటే, ఆ విషయమై ఎలాంటి మాట సాయం చేయని మోదీ సర్కార్‌కు మద్దతు ఇస్తున్నట్టు? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో వెన్నెముక లేని పార్టీలు ఏవైనా వున్నాయా? అంటే.. ఆంధ్రప్రదేశ్ వైపు వేలెత్తి చూపే పరిస్థితి.
చివరికి సీబీఐలో విచారణాధికారిని కూడా నియంత్రించలేని దయనీయ స్థితిలో వైసీపీ వుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే సీబీఐ అధికారి వల్లే తాను అన్యాయంగా వివేకా హత్య కేసులో ఇరుక్కుంటున్నానని అవినాశ్‌రెడ్డి ఆరోపిస్తుండడం వల్లే ఈ మాట అనాల్సి వస్తోంది.
కేవలం సీబీఐలో ఓ అధికారిపై మాత్రమే విమర్శలు చేస్తున్నారంటే, కేంద్ర ప్రభుత్వం సక్రమంగా చేస్తోందని వైసీపీ నమ్ముతున్నట్టుగా భావించొచ్చా? ఒకవైపు బీజేపీ ప్రభుత్వం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందకుండా, మరోవైపు కేంద్రంలో ఆ పార్టీకి ఎందుకు మద్దతు ఇస్తుందనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి వుంది.