ఫేక్ …అసెంబ్లీ షేక్‌

అసెంబ్లీ స‌మావేశాల్లో భాగంగా నాలుగో రోజు కూడా ర‌గ‌డ చోటు చేసుకొంది. మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై మంత్రి కొడాలి నాని ఘాటు విమ‌ర్శ‌లు, టీడీపీ స‌భ్యుల అభ్యంత‌రాల మ‌ధ్య శాస‌న‌స‌భ అట్టుడికింది.  Advertisement ఇటీవ‌ల…

అసెంబ్లీ స‌మావేశాల్లో భాగంగా నాలుగో రోజు కూడా ర‌గ‌డ చోటు చేసుకొంది. మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై మంత్రి కొడాలి నాని ఘాటు విమ‌ర్శ‌లు, టీడీపీ స‌భ్యుల అభ్యంత‌రాల మ‌ధ్య శాస‌న‌స‌భ అట్టుడికింది. 

ఇటీవ‌ల ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబునాయుడు జ‌గ‌న్‌ను ఫేక్ సీఎం, గాలికి వ‌చ్చారు, ఆ గాలికే పోతార‌ని తీవ్ర ప‌ద‌జాలంతో దూషించిన విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో నాలుగో రోజు అసెంబ్లీ స‌మావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మ‌ల రామానాయుడు మాట్లాడుతూ వైసీపీ అధికారం లోకి వ‌చ్చిన త‌ర్వాత రూ.3 వేలు పెన్ష‌న్ ఇస్తామ‌న్నార‌ని, ఎక్క‌డిస్తున్నార‌ని నిల‌దీశారు. 

దీనికి స‌మాధానంగా మంత్రి నాని స్పందిస్తూ చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌ల దాడి చేశారు. త‌మ నాయ‌కుడు జ‌గ‌న్‌ను చంద్ర‌బాబు ఫేక్ సీఎం, గాలికి వ‌చ్చారు, గాలికిపోతార‌ని శాప‌నార్థాలు పెడుతున్నార‌ని, అస‌లు ఫేక్ చంద్ర‌బాబే అని దుయ్య‌బ‌ట్టారు.

త‌మ నాయ‌కుడు జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సొంతంగా పార్టీ పెట్టి, సుదీర్ఘ పాద‌యాత్ర చేసి అధికారాన్ని సొంతం చేసుకున్నార‌న్నారు. ఇదే చంద్ర‌బాబు విష‌యానికి వ‌స్తే ఎన్టీఆర్ పెట్టిన పార్టీని లాక్కున్నార‌న్నారు. అంతేకాదు, ఆయ‌న నుంచి అధికారం కూడా లాక్కున్నార‌ని మండిపడ్డారు. 

టీడీపీ ఓ ఫేక్ పార్టీ అని, చంద్ర‌బాబునాయుడు ఓ ఫేక్ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడ‌ని, ఆయ‌న ఫేక్ సీఎంగా ప‌నిచేశార‌ని తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.

1983లో ఓడిపోవ‌డంతో కాంగ్రెస్‌ను వదిలి చంద్రబాబు టీడీపీలోకి పారిపోయార‌న్నారు. అప్పుడు చంద్రగిరి నుంచి కుప్పం పారి పోయారన్నారు. ఓటుకు నోటు కేసులో హైదరాబాద్‌ వదిలి పారిపోయారన్నారు. కరోనా రాగానే కాల్వ గట్టు వదిలి పారి పోయారని తూర్పార‌ప‌ట్టారు. 

చంద్రబాబు నాయుడే గాలి ముఖ్యమంత్రి, బాబే గాలి నాయకుడని ధ్వ‌జ‌మెత్తారు. పారి పోయేవాళ్లెవరో ప్రజలందరికీ తెలుసన్నారు. కొడాలి వ్యాఖ్యలపై  టీడీపీ స‌భ్యులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ జోక్యం చేసుకుంటూ మ‌రోసారి కొడాలి విమ‌ర్శ‌ల‌నే ప్ర‌స్తావించ‌డం గ‌మ‌నార్హం.