పాపం బాబు: వంతులు వారీగా క్లాసులు

అసెంబ్లీ వేదికగా చంద్రబాబు పరువు తీయడానికి వైసీపీ మంత్రులు వంతులు వేసుకున్నట్టు అర్థమవుతోంది. పోలవరానికి చంద్రబాబు ఏం చేశారనే విషయంపై నిన్న మంత్రి అనిల్ క్లియర్ పిక్చర్ చూపించగా.. మధ్యలో ముఖ్యమంత్రి జగన్, బాబు…

అసెంబ్లీ వేదికగా చంద్రబాబు పరువు తీయడానికి వైసీపీ మంత్రులు వంతులు వేసుకున్నట్టు అర్థమవుతోంది. పోలవరానికి చంద్రబాబు ఏం చేశారనే విషయంపై నిన్న మంత్రి అనిల్ క్లియర్ పిక్చర్ చూపించగా.. మధ్యలో ముఖ్యమంత్రి జగన్, బాబు భజన ప్రహసనాన్ని చూపించి నవ్వులు పూయించారు.

ఈరోజు కొడాలి నాని ''ఫేక్ కామెంట్ల''పై బాబుకి చుక్కలు చూపించారు. అసెంబ్లీ మొదలైన రోజు పోడియం ముందు చంద్రబాబు చేసిన ఓవర్ యాక్షన్ అందరూ చూశారు. అదే రోజు అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడిన బాబు జగన్ పై నోరు జారారు. ఫేక్ సీఎం అంటూ శృతిమించి మాట్లాడారు.

ఆ ఫేక్ మాటలపై వైసీపీ నేతలు గుర్రుగానే ఉన్నా.. సమయం చూసుకుని మంత్రి కొడాలి నాని బాబుపై విరుచుకుపడ్డారు. 151మంది ఎమ్మెల్యేల బలం ఉన్న పార్టీ నాయకుడు, 3వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసిన ప్రజా నాయకుడిని ఫేక్ సీఎం అనడానికి బాబుకి ఎంత ధైర్యం అంటూ మండిపడ్డారు నాని. అదే సమయంలో ఎవరు ఫేక్, ఎవరు రియల్ అనే విషయాన్ని సోదాహరణంగా వివరించారు.

టీడీపీ పెట్టింది చంద్రబాబు కాదు, టీడీపీ అధినాయకుడిగా చంద్రబాబు న్యాయబద్ధంగా ఎన్నిక కాలేదు, చివరికి ముఖ్యమంత్రి పీఠంపై కూడా ఆయన న్యాయంగా కూర్చోలేదు. మామకి వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్నారు, దొడ్డిదారిన ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకుని సీఎం అయ్యారు. ఇప్పుడు చెప్పండి ఎవరు ఫేక్ సీఎం, ఎవరు రియల్ సీఎం అని ప్రశ్నించారు నాని.

నిన్నటికి నిన్న మంత్రి అనీల్ కుమార్ చంద్రబాబు పరువు తీసి పడేశారు. పోలవరం ప్రాజెక్టు పేరు చెప్పి బాబు ఐదేళ్ల పాటు ఏం చేశారనే విషయాన్ని కూలంకుషంగా సభ ముందుంచారు. బాబు ముఖంలో నెత్తురు చుక్క లేకుండా చేశారు. అంతకంటే ముందు ఆర్థిక మంత్రి బుగ్గన, బాబుకు క్లాస్ తీసుకున్నారు. భ్రమరావతి కేంద్రంగా బాబుకు చుక్కలు చూపించారు. నకిలీ పథకాల అమలు కోసం ఇతర రంగాల్ని ఎలా దెబ్బతీశారో లెక్కలతో సహా బయటపెట్టారు.

ఇవి కాకుండా మధ్యలో జనసేన ఎమ్మెల్యే, వైసీపీ అనుకూల నేత రాపాక వరప్రసాద్ కూడా బాబును చెడుగుడు ఆడుకున్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 ఏళ్ల ముఖ్యమంత్రి ఎందుకూ పనికిరాలేదంటూ పరువు తీశారు.

ఇలా రోజుకొకరు చొప్పున వంతుల వారీగా బాబును చెడుగుడు ఆడుకుంటున్నారు. రోజుకొకరు ఫుల్ డోస్ ఇచ్చేస్తున్నారు. మధ్యమధ్యలో జగన్ ఝలక్ లు కొసమెరుపు. రేపు ఎవరికి అవకాశం ఇచ్చారో చూడాలి.