పెళ్లంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు చూసి పెళ్లి చేయాలని పెద్దలు చెబుతారు. ఇప్పుడు తరాలు చూసి పెళ్లిళ్లు చేసుకునే పరిస్థితి లేదు.
కానీ ఉన్నంతలో మంచీచెడులు చూసుకుని పెళ్లి చేసుకుని సంతోషంగా గడపాలని ఎవరైనా ఆశిస్తారు. అయితే అప్పుడప్పుడు నిత్య పెళ్లి కొడుకులు మనకు తారసపడుతుంటారు. అలాంటి వాళ్ల దృష్టిలో పెళ్లంటే కట్నకానుకలు, అమ్మాయిలను అప్పనంగా తీసుకొచ్చే తంతు మాత్రమే.
ఇప్పుడు అలాంటి నిత్య పెళ్లి కొడుకు గురించి తెలుసుకుందాం. తన భర్త నాలుగు పెళ్లిళ్లు చేసుకోవడమే గాకుండా మరో ఆరుగురితో సహజీవనం చేస్తున్నాడని ఓ భార్య ఆవేదన వ్యక్తం చేస్తుండడం గమనార్హం.
తన భర్తపై కఠిన చర్యలు తీసుకుని తనకు నష్టపరిహారం చెల్లించేలా చేయాలని ఆమె కోరుకుంటున్నారు. ఈ మేరకు ఆమె హైదరాబాద్ సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలు చెప్పిన ప్రకారం వివరాలివే.
మియాపూర్‌లోని హెచ్ఎంటీ స్వర్ణ ప్యాలెస్‌లో వెంకటబాలకృష్ణ పవన్‌కుమార్ నివాసం ఉంటాడు. నగరానికి చెందిన హిమబిందు తనకు మంచి అబ్బాయి కావాలని మ్యాట్రిమోనీ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో ఆమెకు 2018లో వెంకట బాలకృష్ణ పవన్‌కుమార్‌తో పెళ్లి జరిగింది. కట్నకానుకల కింద రూ.28లక్షలు, పెళ్లి ఖర్చులకు మరో రూ.10లక్షలు ఇచ్చారు. పెళ్లి తర్వాత దంపతులిద్దరూ దుబాయ్‌కి వెళ్లారు. అక్కడ హిమబిందుపై వేధింపులకు పాల్పడ్డాడు.
ఎలాగైనా తనను విడిపించుకోవాలనే కుట్రకు తెరలేపాడు. దీనికి కారణం లేకపోలేదు. అప్పటికే అతనికి మరో ముగ్గురితో పెళ్లిళ్లు కావడమే. చావు కబురు చల్లగా చెప్పినట్టు ….తనకు మూడు పెళ్లిళ్లు అయిన విషయాన్ని హిమబిందుకు పవనే స్వయంగా చెప్పాడు. అంతేకాదు, మూడో భార్యను పరిచయం కూడా చేశాడని, ఆమే నిజమైన భార్యగా కూడా తనతో చెప్పాడని హిమబిందు వాపోతూ చెప్పారు.
భర్త నుంచి తనకు ప్రాణహాని ఉందని, అతని నుంచి రక్షణ కల్పించాలని ఏడాది క్రితం మహిళా పోలీసు స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి న్యాయం కోసం పోలీసు స్టేషన్, కోర్టుల చుట్టూ తిరుగుతున్నట్లు ఆమె తెలిపారు.
తన భర్త పవన్‌కుమార్‌కు కఠినంగా శిక్షించి కట్నం డబ్బులు, పెళ్లి ఖర్చులు మొత్తం రూ.38లక్షలు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారామె.