కరోనాకి భయపడి ఇన్నాళ్లూ ఇంటి పట్టునే కాలం గడిపిన చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలనగానే ఎక్కడలేని ఉత్సాహంతో ముందుకొచ్చారు. ఒకరకంగా కరోనా భయం వెంటాడుతున్నా.. చేజారిపోతున్న ఎమ్మెల్యేలకు దిక్కుగా నిలబడటం కోసమే బాబు అసెంబ్లీకి వస్తున్నారు.
అయితే ఆ ఉత్సాహం అంతా మూడు రోజుల ముచ్చటగా మారిపోయింది. అసెంబ్లీ బయట నిరసన కార్యక్రమాలలో చంద్రబాబుని అనుకూల మీడియా పులిలాగా చూపిస్తే.. అసెంబ్లీ లోపల వైసీపీ నేతలు బాబుని పిల్లిలాగా మార్చేశారు.
పోలవరం దగ్గర బాబు భజనా కాలక్షేపాన్ని అసెంబ్లీలో ప్రదర్శించి పూర్తిగా చంద్రబాబు పరువు తీశారు జగన్. గతంలో ఆ వీడియోని చూసే అవకాశం లేనివారు కూడా ఇప్పుడు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలే బాబు భజన చూసి నవ్వుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఇక జగన్ హావభావాలు చంద్రబాబుని మరింత ఇబ్బంది పెడుతున్నాయి. చంద్రబాబుకి అప్పర్ కంపార్ట్ మెంట్ (బ్రెయిన్) లేదనడం, మెంటల్ ఆస్పత్రిలో చేర్పించకపోతే, టీడీపీ నేతలు కూడా పిచ్చోళ్లైపోతారని విమర్శించడం ఆయన ఇమేజ్ ని పూర్తిగా డ్యామేజీ చేశాయి.
అందుకే బాబులో ఆగ్రహం, ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. రోజు రోజుకీ ఆవేశంతో ఊగిపోతూ.. పోడియం ముందుకు దూసుకొస్తూ.. సస్పెన్షన్ వేటు వేయించుకుని బైటకెళ్లిపోతూ అనుకూల మీడియా ముందు నాలుగు ముక్కలు మాట్లాడి ఆత్మసంతృప్తి పొందుతున్నారు.
ఇవన్నీ జరుగుతాయని బాబుకు తెలుసు. కానీ ఈ స్థాయిలో తన పరువు పోతుందని ఆయన అస్సలు ఊహించలేదు. అందుకే అసలు అసెంబ్లీకి ఎందుకొచ్చానా అని బాధపడుతున్నారట.
కరోనా పేరు చెప్పి ఈ దఫా అసెంబ్లీ సెషన్ ని పూర్తిగా పక్కనపెట్టేసి ఉంటే బాగుండేదని సన్నిహితుల దగ్గర వాపోయారట. అందుకే అసెంబ్లీ బయటే ఎక్కువగా కాలక్షేపం చేయడానికి బాబు ఇష్టపడుతున్నారు బాబు.
బైట ఉన్నంత సేపు అనుకూల మీడియాలో తానే హీరో, లోపలికి వెళ్తే మాత్రం వైసీపీ నేతల ముందు బాబు జీరో. ఈ విషయం గ్రహించే.. సస్పెన్షన్లకు బాబు ఉత్సాహ పడుతున్నారని, లోపల వైసీపీ నేతల టార్చర్ తట్టుకోలేకే బాబు వేటు వేయించుని బైటపడుతున్నారని అంటున్నారు.
మొత్తమ్మీద ఏడాదిన్నరలోనే చంద్రబాబుకి అసెంబ్లీ అంటే విరక్తి వచ్చేలా చేసింది జగన్ టీమ్. బాబు నయవంచనను కళ్లకు కడుతూ, వీడియో సాక్ష్యాలతో సహా వివరిస్తూ, పూర్తిగా పరువు తీసేస్తోంది. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీని సైతం అసెంబ్లీ నుంచి పారిపోయేలా చేస్తోంది.