ఏపీలో రైతుల పరామర్శ యాత్రకు వచ్చిన పవన్.. తెలంగాణ వరద సాయాన్ని అన్యాపదేశంగా ప్రస్తావించారు. అక్కడ వరదలు వచ్చినప్పుడు టీఆర్ఎస్ సర్కారు వెంటనే ఒక్కో కుటుంబానికి 10వేల రూపాయలు ఆర్థిక సాయం చేసిందని, ఏపీలో రైతులకు ఆమాత్రం కూడా సాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ఆర్థిక సాయంపై చాలా విమర్శలున్నాయి, అదే సమయంలో అసలా సాయం అందుకున్నవారి సంఖ్య తక్కువ, దిగమింగినవారి సంఖ్య ఎక్కువనే ఆరోపణలున్నాయి. మరి ఆ లెక్కల్ని ఇక్కడ ప్రస్తావించడం ఎందుకు? పోనీ కేసీఆర్ ని అంతగా పొగడాలనిపిస్తే.. గ్రేటర్ పోలింగ్ తర్వాతే అక్కడి వరద సాయం పవన్ కి గుర్తొచ్చిందా? గ్రేటర్ ఎన్నికల్లో కేసీఆర్ చేసిన వరద సాయాన్ని ఎందుకు గుర్తు చేసుకోలేకపోయారు.
పొత్తు ధర్మం ప్రకారం అక్కడ బీజేపీకి మద్దతిచ్చిన పవన్ కి, ఏపీలోకొచ్చేసరికి కేసీఆర్ హీరో అయిపోయారు, జగన్ ని విమర్శించాలని చూస్తున్నారు. ఇలాంటి రెండు నాల్కల ధోరణి వల్లే రెండు నియోజకవర్గాలకు కాకుండా పోయిన పవన్, ఇంకా తన వ్యవహార శైలి మార్చుకోలేకపోతున్నారు.
పవన్ రెండుకళ్ల సిద్ధాంతానికి మరో మచ్చుతునక రైతుల పోరాటం. ఏపీలో రైతులు వరద నష్టంతో అల్లాడిపోతున్నారని, ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, మంత్రులు బాధ్యతతో వ్యవహరించడంలేదని విమర్శిస్తున్న పవన్ కి ఢిల్లీలో జరుగుతున్న పోరాటం కనపడ్డంలేదా.
వ్యవసాయ బిల్లులకి వ్యతిరేకంగా రైతులంతా హస్తినని చుట్టుముట్టడం పవన్ కంటికి కనిపించలేదా. కనీసం ఆ రైతుల గురించి ఓ మాట కూడా మాట్లాడని పవన్ కి, ఏపీ రైతుల పక్షాన మాట్లాడే అర్హత ఎక్కడుంది.
కరోనా కష్టకాలంలో రాష్ట్రంలో అడుగు పెట్టడానికే భయపడ్డారు పవన్, ఆ తర్వాత చాతుర్మాస దీక్ష పేరుతో మరికొన్నాళ్లు కాలం గడిపారు. అంతా అయిపోయాక తన ఫస్ట్ ప్రయారిటీ సినిమాలకేనంటూ ముందు మొహానికి రంగులేసుకున్నారు, ఆ తర్వాత మేకప్ తీసేసి, షూటింగ్ కి ప్యాకప్ చెప్పేసి, తీరిగ్గా నివర్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వచ్చారు. ఎవరిది బాధ్యత, ఎవరిది అవకాశవాదం?
రైతుల తరపున పోరాటం చేస్తా, పరిహారం పెంచకపోతే ఉద్యమం మొదలు పెడతానంటున్న పవన్ కల్యాణ్.. అసలు అంచనాలు తయారు కాకముందే ఎకరాకి 30వేల సాయం అడగడం మరీ విడ్డూరం. మాస్క్ వేసుకుని, చేతులకు తొడుగులు వేసుకుని పొలాల్లో దిగితే హీరో అవుతారనుకుంటే అది వట్టి భ్రమే. పవన్ ఇంకా ఆ భ్రమల్లోనే కాలం గడుపుతున్నారు. వరద సాయంపై బురద రాజకీయం చేస్తున్నారు.