ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై తెలుగుదేశం పార్టీ తన తీవ్ర పదజాలాన్ని ఆపడం లేదు. అసెంబ్లీ లోనూ, అసెంబ్లీ బయట తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్ర పదజాలాన్నే ఉపయోగిస్తూ ఉన్నాయి.
ముఖ్యమంత్రిని పట్టుకుని వీడూ.. వీడూ.. అంటూ ప్రెస్ మీట్లో వ్యాఖ్యానించి చంద్రబాబు నాయుడు మంత్రులను రెచ్చగొట్టారు.
అదే తీరును కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు, టీడీపీ వాళ్లు ముఖ్యమంత్రిపై స్పందిస్తున్నారు. ముఖ్యమంత్రి పిరికిపందలా వ్యవహరిస్తూ ఉన్నాడని తాజాగా తెలుగుదేశం పార్టీ వ్యాఖ్యానించింది.
చలో అసెంబ్లీ సందర్భంగా ఇలా స్పందించింది తెలుగుదేశం పార్టీ. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలానే తెలుగుదేశం పార్టీ నేతలు, మంత్రులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు జగన్ ను ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నా టీడీపీ మాత్రం తన తీరును మార్చుకోవడం లేదు.
ఇక ఆ సంగతలా ఉంటే.. దళితులు, మైనారిటీలపై దాడులకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించింది. అందులో మత్తు డాక్టర్ సుధాకర్ ఫొటోలను తెలుగుదేశం పార్టీ ప్రదర్శించింది. బహుశా దళితులు, మైనారిటీలపై దాడులంటే.. మత్తు డాక్టర్ ఫొటోలు తప్ప తెలుగుదేశానికి మరోటి దొరికినట్టుగా కూడా లేదు!
మత్తు డాక్టర్ వ్యవహారం ఇప్పుడు సీబీఐ చేతిలో ఉంది! ఈ కేసులో సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ తెలుగుదేశం స్పందించడం, కోర్టు కూడా ఆ కేసును సీబీఐకి అప్పగించడం జరిగి కొన్ని నెలలు గడిచాయి.
మరి ఆ వ్యవహారంలో ఎవరిది తప్పో చెప్పాల్సింది సీబీఐ! కేంద్రాన్ని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేయాలి. కానీ.. ఇంకా సుధాకర్ పొటోలనే పట్టుకుని ఆయనేదో జాతీయ నేత అయినట్టుగా, తాగి ఇష్టానుసారం బూతుల మాట్లాడిన వ్యక్తిని మహా దళితుడిగా ప్రొజెక్ట్ చేస్తూ టీడీపీ రాజకీయ ప్రయోజనాలను పొందాలని చూస్తున్నట్టుగా ఉంది.
ఇక పల్లెల్లో జరిగిన చిన్న చిన్న గొడవలు, అందుకు సంబంధించిన రచ్చలకు కూడా కులం కోణాన్ని కలిపి పెదబాబు, చినబాబు ట్వీట్లేసి.. దళితులపై దాడులు అంటూ ఉద్యమిస్తూ ఉన్నారు. తామే ఒక సమస్యను సృష్టించి, దానిపై ఉద్యమించడమేనా.. ప్రతిపక్ష పార్టీ పని? ప్రతిపక్ష వాసంలో ఏడాదిన్నర తర్వాత తెలుగుదేశం పార్టీ పనితీరు ఇలా ఉంది!