తన మామ గారైన జేసీ దివాకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డిల స్థానాన్ని ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి భర్తీ చేయాలని తహతహలాడుతున్నట్టున్నారు. జేసీ తనయుల కంటే వారింటి అల్లుడైన ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డినే ఎక్కువగా వార్తల్లో కనిపిస్తుంటారు.
టీవీ చర్చల్లో విరివిగా పాల్గొంటూ ప్రత్యర్థులపై విరుచుకుపడుతుంటారు. ఇక ఎల్లో చానళ్ల చర్చల్లోనైతే వైసీపీ ప్రభుత్వంతో పాటు ఆ పార్టీ నేతలపై ఏం మాట్లాడినా అడ్డుకునే వారెవరూ ఉండరు. దీంతో ఆయనకు ముఖ్యమంత్రి , మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలంటే లెక్కే లేదు.
అలవాటులో పొరపాటుగా మండలిలో కూడా అదే విధంగా మాట్లాడి మంత్రి బొత్స సత్యనారాయణతో తిట్లు తిన్నారు. మరోసారి అలా మాట్లాడితే చెప్పుతో కొడతానని మంత్రి బొత్స సత్యనారాయణ తిట్టారంటే, దీపక్‌రెడ్డి ఎలా మాట్లాడి ఉంటారో అర్థం చేసుకోవచ్చు.
ఇలాంటి ధోరణులను సభ్య సమాజం హర్షించదు. అయితే చర్యకు ప్రతిచర్య అని న్యూటన్ థర్డ్ లా చెప్పినట్టు …పాలకప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం ఎప్పుడో పరిధి దాటింది.
నిన్న మండలి సమావేశాల్లో కూడా సభ్యుల మధ్య ఆవేశకావేశాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష సభ్యులు ప్రసంగిస్తున్నప్పుడు మంత్రులు రన్నింగ్ కామెంట్రీ చేస్తున్నారని, నోటికొచ్చినట్టు దూషిస్తూ సభ గౌరవాన్ని తగ్గిస్తున్నారని మండిపడ్డారు.
మంత్రుల ప్రవర్తన వీధిరౌడీల్లా ఉందని తీవ్ర పదజాలంతో దూషించారు. అలాగే అధికార పక్ష సభ్యులకు సమీపంలో ఉన్న తన స్థానాన్ని మార్చాలని లేదా రక్షణైనా కల్పించాలని చైర్మన్‌ను ఆయన కోరారు.
దీపక్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు. మంత్రుల్ని వీధి రౌడీలని మరోసారి అంటే చెప్పుతో కొడతానని హెచ్చరించారు. దీంతో సభలో రగడ చోటు చేసుకొంది.
మంత్రుల్ని వీధి రౌడీలని అనడం సరైందా అని బొత్స ప్రశ్నించారు. ప్రజలు వీధి రౌడీలని ఎన్నుకున్నారా? ఇలాంటి మాటలతో ప్రజల్ని అవమానిస్తారా అని మంత్రి గట్టిగా నిలదీశారు.
దీపక్‌రెడ్డి మాట్లాడుతూ మంత్రుల్ని వీధి రౌడీలని తాను అనలేదన్నారు. మంత్రి మాత్రం తనను చెప్పుతో కొడతానని మూడు సార్లు అన్నారని దీపక్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఏది ఏమైనా మండలిలో తమ బలం ఎక్కువ ఉందని ప్రతిపక్ష సభ్యులు విరవీగి మాట్లాడ్డం వల్ల ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రత్యర్థులపై నోరు పారేసుకోవడం వల్ల తన మామగారికి ఏ గతి పట్టిందో గుర్తెరిగి దీపక్‌రెడ్డి వ్యవహరిస్తే మంచిదని పాలక పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు.