ఒకవైపు మోడీ భజన- మరో వైపు ముస్లింలతో వంచన!

చంద్రబాబునాయుడు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారు. ఒకవైపు తన రాజకీయ మనుగడ కోసం, తన మీద ఉన్న కేసులను తిరగతోడకుండా ఉండడం కోసం, తన గెలుపు కోసం ఆసరాగా నిలవగల పరాయి భుజాల కోసం ఆయన…

చంద్రబాబునాయుడు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారు. ఒకవైపు తన రాజకీయ మనుగడ కోసం, తన మీద ఉన్న కేసులను తిరగతోడకుండా ఉండడం కోసం, తన గెలుపు కోసం ఆసరాగా నిలవగల పరాయి భుజాల కోసం ఆయన మోడీ భజన చేస్తున్నారు. అదే సమయంలో.. ఏ మోడీ పరిపాలనను చూసి అయితే యావత్ ముస్లిం సమాజం భయపడుతున్నదో.. ఆ ముస్లింలను కూడా బురిడీ కొట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. 

తాజాగా గుంటూరు జిల్లా పెదకూరపాడు పరిధిలో ముస్లింలతో జరిగిన ఒక ఆత్మీయ సమావేశంలో చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. ముస్లింల రక్షణ కోసం తాను ఒక ప్రత్యేక చట్టం తెస్తానని, తనను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని ఒక అడ్డగోలు హామీ ఇచ్చేశారు. 

చంద్రబాబునాయుడు అవకాశవాద రాజకీయ నాయకుడు అనే సంగతి అందరికీ తెలిసినదే. ఏ రోటికాడ ఆ పాట పాడడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అనే సంగతి కూడా తెలిసినదే. ఆ విద్యనే ఆయన ముస్లిం సమాజం ఎదుట మరోమారు ప్రదర్శించారు. హిందూత్వ ఎజెండాను భుజాన మోస్తూ.. ఎడాపెడా చెలరేగిపోతూ ఉండే బిజెపి పాలనను ఆయన ఏకపక్షంగా సమర్థిస్తున్నారు. కేంద్రంలోని బిజెపి దార్శనికత గురించి పొగడ్తలు కురిపిస్తున్నారు. 

ఇలాంటి మాటలను.. ముస్లిం సమాజం గమనిస్తూ ఉంటుందనే సంగతి ఆ మాత్రం చంద్రబాబుకు తెలియదా అని ప్రజలు అనుకుంటున్నారు. తాను మోడీ పాలనను, విధానాలను అంత ఘనంగా సమర్థించడం ద్వారా.. ఆయన పట్ల కూడా ముస్లింలలో అపనమ్మకం భయం ఏర్పడుతున్నాయనే సంగతిని చంద్రబాబు గుర్తించలేకపోతున్నారా? అనేది సామాన్య కార్యకర్తల అనుమానం. 

చంద్రబాబు హామీ ఇస్తున్నట్టుగా మైనారిటీ ఉపప్రణాళిక లాంటిది ఆయన ఏం చేయదలచుకున్నా ఓకే.. కానీ ఒక మతం ప్రాతిపదికగా వారి రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావడం అనేది రాష్ట్రప్రభుత్వానికి ఎలా సాధ్యమవుతుంది. ఇప్పుడు రాష్ట్రంలోని పరిస్థితులను గమనించినాసరే.. ముస్లింలు ఏ రకమైన ఇబ్బందులకు గురవుతున్నారు గనుక.. వారికోసం ప్రత్యేక చట్టం తేవాలని చంద్రబాబునాయుడు మాటలు అల్లుతున్నారో అర్థం కావడం లేదు. 

పైగా ముస్లింల సమగ్ర అభివృద్ధి గురించి చంద్రబాబు మాట్లాడడం లేదు. మెకానిక్ లుగా బతికేవారికి శిక్షణ ఇప్పించి మెరుగ్గా తయారుచేస్తా అనడం ఒకరకంగా వారి నైపుణ్యాలను అవమానించడమే. ఒకవైపు జగన్ రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోనూ ఇంగ్లిషు మీడియంతో అందరూ విదేశీ కొలువులు సంపాదించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తోంటే.. ముస్లింల కోసం అరబిక్ స్కూల్ ఏర్పాటు చేస్తాననే మాటల ద్వారా చంద్రబాబు ఏం లక్ష్యిస్తున్నారో అర్థం కావడం లేదు.