సినిమాలకు సంబంధించి మామూలు సింగర్ ల పారితోషికాలు తక్కువేమో కానీ, స్టార్ సింగర్లకు భారీ రెమ్యూనిరేషన్లు ఉంటాయనేది వాస్తవం. ఇలాంటి సింగర్ లలో కూడా అత్యంత స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు లతా మంగేష్కర్. ఏదో కొంతకాలం కాలం కాదు, ఎనిమిది దశాబ్దాల పాటు ఆమె ఒక వెలుగు వెలిగారు.
ఆర్థికంగా అయితే ఎప్పుడో సెటిలయ్యారు. దశాబ్దాలుగా స్టార్ సింగర్ గానే కొనసాగారు. తనంతకు తాను వృత్తి నుంచి విరామం తీసుకునే వరకూ అవకాశాలకు లోటు లేదు. ఆ తర్వాత కూడా ఆమె కు నిరంతర ఆదాయ మార్గాలు ఉండేవి. అంతే కాదు.. విదేశాల్లో రెస్టారెంట్ల నిర్వహణలో కూడా లత పేరు వినిపిస్తూ వచ్చింది. ఇలా ఆమె కు ఆర్థికంగా లోటు లేకపోవడం కాదు, వందల కోట్ల రూపాయలకు కూడా అధిపతి.
తన వంతుగా వితరణ కార్యక్రమాలకు కూడా లత పని చేశారు. ఇప్పుడే కాదు, 1983లో వరల్డ్ కప్ నెగ్గిన భారత క్రికెట్ జట్టుకు భారీ బహుమతులు ఇచ్చేందుకు బీసీసీఐ వద్ద డబ్బులేమీ లేకపోతే, లతా మంగేష్కర్ తన గాన కచేరీలు ఏర్పాటు చేసి నిధులను పోగు చేసి కపిల్ డెవిల్స్ కు ఆర్థికంగా బాసటగా నిలిచింది. ఇలాంటి వితరణ శీలి లత. క్రికెట్ కు పెద్ద ఫ్యాన్.
స్థూలంగా లత ఆస్తులు సుమారు రెండు వందల కోట్ల రూపాయల పైనే అని బాలీవుడ్ మీడియా రిపోర్ట్ చేస్తోంది. ఇంతకు మించి కూడా ఉంటాయేమో! లత పెళ్లి చేసుకోలేదు. అధికారికంగా వారసులు లేరు. తోబుట్టువులు, వారి వారసులు ఉన్నా.. అంతా బాగా సెటిలైన వారే. ఈ నేపథ్యంలో ఈ ఆస్తులు వారికి చెందవచ్చు. అయితే మరి తన ఆస్తులను లత కుటుంబీకులకు రాసిచ్చారా? లేక వితరణ కార్యక్రమాలకే ఇచ్చారా? అనేది ప్రస్తుతానికి స్పష్టత లేని అంశం. ఆమె వీలునామా ఏమిటనేదానిపై ఇప్పుడు మీడియా కన్ను వేసింది!