ఎమ్బీయస్‍: లతా మంగేశ్‌కర్‌కు నివాళి

ఫిబ్రవరి 6న తన 92వ యేట లతా మంగేశ్‌కర్ యీ లోకం విడిచి వెళ్లారు. ఆవిడ గురించి ఒక వ్యాసంలో రాయడం అసంభవం. సుశీలగారు లతాకు తీసిపోని గాయని. కానీ ఆవిడ గురించి కొన్ని…

ఫిబ్రవరి 6న తన 92వ యేట లతా మంగేశ్‌కర్ యీ లోకం విడిచి వెళ్లారు. ఆవిడ గురించి ఒక వ్యాసంలో రాయడం అసంభవం. సుశీలగారు లతాకు తీసిపోని గాయని. కానీ ఆవిడ గురించి కొన్ని పాటలను ప్రస్తావిస్తూ ఓ పెద్ద వ్యాసంలో సరి పెట్టేయవచ్చు. ఎందుకంటే సుశీల గారి జీవితం గురించి పెద్దగా రాయడానికి ఏమీ లేదు. కానీ లతా విషయంలో అలా కాదు. ఆవిడ గాయనిగా మారడానికి ఎంత కష్టపడిందో విపులంగా చెప్పాలి. ఆమె ఒక ఫైటర్‍. చిన్నవయసులోనే తండ్రి పోయాడు. కుటుంబ బాధ్యతలు మీద పడ్డాయి. గాయనిగా నిలదొక్కుకోవడానికి ఎంతో శ్రమించింది. హేళనలు భరించింది. అనేకమంది మహానుభావుల వద్ద, పట్టుదలగా అనేక విషయాలు నేర్చుకుంటూ, తనను తాను మలచుకుంది. ఆత్మగౌరవాన్ని నిలుపుకోవడానికి పోరాటాలు చేయవచ్చింది. ఉన్నతస్థానానికి చేరింది.

పైకి రావాలంటే ఇలా కష్టపడడమనేది అందరి విషయాల్లోనూ వినే విషయమే. అయితే తమ కెంత మార్కెట్ వుందో కళాకారులకు సాధారణంగా అవగాహన వుండదు. శ్రోతల చప్పట్లే మాకు చాలు అనుకుంటారు. అయితే లతాలో విశేషం ఏమిటంటే గాయనీగాయకులకు సముచిత స్థానం దక్కాలని ఆమె పోరాడింది. అప్పట్లో గ్రామఫోన్‍ రికార్డులపై గాయనీగాయకుల పేర్లు వేసేవారు కారు. పాడినది అని.. సినిమాలో పాత్ర పేరు వేసేవారు. ఫిల్మ్‌ఫేర్‍ వాళ్లు గాయనీగాయకులకు ఎవార్డులు యిచ్చేవారు కారు. ఈ వ్యవస్థపై ఆమె పోరాడింది. పాటకున్న మార్కెట్‍ వేల్యూని గుర్తించి ‘’మన వలన కదా హీరోహీరోయిన్లకు పేరు వస్తోంది, మనకు పారితోషికం పెరగాలి, రాయల్టీ యివ్వాలి’’ అని డిమాండ్‍ చేసింది. తన వరకు పోరాటం చేయడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ తనతో కలిసిరాని వాళ్లని వెలి వేయగల పంతం కూడా ఆమెలో వుంది.

పోరాటంలో కలిసి రమ్మనమని మహమ్మద్‍ రఫీని కోరింది. ఆయన చాలా సింపుల్‍ మనిషి. ‘’మనకివన్నీ ఎందుకు? మన పని పాడడం మాత్రమే, యివేం గొంతెమ్మ కోర్కెలు!?’’ అంటూ తిరస్కరించాడు. దాంతో ఆమెకు కోపం వచ్చి రఫీతో  కొన్నేళ్లపాటు పాడడం మానేసింది. అయినా ఆవిడకు చెల్లింది. ఎందుకంటే అప్పటికే ఆమె హిందీ సంగీత సామ్రాజ్యాన్ని ఏలసాగింది. ఆమె పాట లేకపోతే తమ సినిమా ఆడదేమోనని నిర్మాతలు, దర్శకులు భయపడుతున్నారు. అయినా ఆమె తన జాగ్రత్త తను పడింది. రఫీ యితర గాయనీమణులతో పాడి, వాళ్లకు పేరు రావడడానికి సహకరించడంతో వాళ్లకు అవకాశాలు రాకుండా చేయడానికి ఎత్తులు వేసింది. అంతే కాదు, ఉన్నతస్థానానికి వెళ్లాక పోటీగా వచ్చిన కొత్త గాయనీమణులను దెబ్బ తీయడానికి ప్రయత్నాలు చేసింది. వారికి అవకాశాలిచ్చిన సంగీతకారుల పట్ల వ్యవహరించిన తీరు ఎన్నో వివాదాలకు దారి తీసింది. తన మాట చెల్లించుకోవడానికి తనకు గతంలో ఎంతో దోహదపడిన వారిని కూడా తృణీకరించింది.

ఆమె వ్యక్తిగత జీవితం కూడా సాఫీగా జరగలేదు. ఒడిదుడుకులు ఉన్నాయి. సింగర్స్‌గా సుశీల లతా వంటిదైతే, జానకి ఆశా వంటిది. సుశీల, జానకి అక్కాచెల్లెళ్లు కాకపోయినా యిద్దరి మధ్య సఖ్యత వుంది. లతా, ఆశా అక్కచెల్లెళ్లే అయినా యిద్దరి మధ్య స్ఫర్దే కాదు, పోటీ కూడా వుంది. పేచీలు వున్నాయి. ఆశా అవకాశాలను లతా ఎగరవేసుకుని పోయిన సందర్భాలూ ఉన్నాయి. నిక్కచ్చిగా చెప్పాలంటే లతాలో మంచీ చెడూ అన్నీ వున్నాయి. పైకి ఎక్కి వచ్చేదాకా, ఆమె గొప్పతనం, వచ్చాక ఆమె నియంతగా వ్యవహరించిన తీరు, ఆడిన రాజకీయాలు అన్నీ చెపితే ఆమె కథ రసవత్తరమైన గాథ. తీవ్రమైన ఆవిడ యిష్టాయిష్టాల గురించి చెప్పాలని పిబి శ్రీనివాస్ గారి గురించి నేను రాసినప్పుడు యీ క్రింది సంఘటన గురించి రాశాను. చదవని లేదా గుర్తులేని వాళ్ల కోసం క్లుప్తంగా మళ్లీ చెప్తాను.

తర్వాత ఎప్పుడో జేసుదాసు, ఎస్పీబాలు హిందీలో పాడినా పిబి పాడేనాటికి దక్షిణాది వాళ్లకు హిందీ పాటలు పాడే అవకాశం యివ్వడం అబ్బురమే. బొంబాయి వాళ్లకు సౌత్‌ ఇండియన్‌ మ్యూజిక్‌ డైరక్టర్లు పనికి వచ్చారు కానీ గాయనీగాయకులు పనికి రాలేదు. తెలుగు సినిమా 'నాదీ ఆడజన్మే'ను 'మై భీ లడ్కీ హూ' (1964) పేరుతో ఏవీ మెయ్యప్పన్‌ హిందీలో చిత్రగుప్త సంగీతంతో తీశారు. 'చిన్నారి పొన్నారి పూవూ' అనే పాట వుందికదా, దాన్ని హిందీ వెర్షన్‌ 'చందాసే హోగా ప్యారా' పాడాలి. లతా హీరోయిన్‌ మీనాకుమారికి పాడుతుంది. హీరోకి ఎవరు పాడాలి? ధర్మేంద్ర హీరో కాబట్టి న్యాయప్రకారం రఫీ పాడాలి. కానీ రఫీకి, లతాకు అప్పట్లో గొడవ నడుస్తోంది. కలిసి పాడటం లేదు. అందువల్ల పిబిని బుక్‌ చేసుకున్నారు. ఈ విషయం లతాకు తెలియదు. పాట పాడబోతూ 'ఇంతకీ ఎవరూ మేల్‌ సింగర్‌?' అంది. ఫలానా పిబి అనగానే ఆవిడ మండిపడింది. 'ఓ మద్రాసీ హిందీ పాటేం పాడతాడు? అతనితో కలిసి నేను పాడడమా?' అంది.

మనవాళ్ల హిందీ, ఉర్దూ ఉచ్చారణ బాగుండదని హిందీ సినిమా వాళ్ల భయం. ఉచ్చారణ మాటకొస్తే లతా కూడా హిందీ ఫీల్డులో ముందులో యాక్సెప్ట్‌ కాలేదు. దిలీప్‌ కుమార్‌ 'ఈ మరాఠీ అమ్మాయి ఉర్దూ ఏం పాడుతుంది' అన్నాడు. లతా నౌషాద్‌ వద్ద కష్టపడి చక్కటి డిక్షన్‌ నేర్చుకుంది. మరి పిబి అలా ఎవరి దగ్గరా నేర్చుకున్నట్టు కనబడదు. స్వయంకృషితోనే హిందీ, ఉర్దూలలో చక్కటి ఉచ్చారణ సాధించారు. అదేమీ పట్టించుకోని లతా అలా అనగానే 'ఏం చేయమంటావు తల్లీ, రఫీతో నువ్వు పాడటం లేదు కదా' అన్నారు వీళ్లు. ‘రఫీ లేకపోతే ముకేష్‌ లేడా, మన్నా దే లేడా? ఎవరూ దొరకనట్టు ఈయనెందుకు?’ అంది. మొత్తానికి బతిమాలి ఆవిణ్ని ఒప్పించారు. పాట పాడడం పూర్తయ్యేసరికి లతాకు పిబి సత్తా తెలిసింది. తర్వాత ఆవిడ బొంబాయి వెళ్లి అనేకమంది నిర్మాతలకు, పదిమంది సంగీతదర్శకులకు ఈయన్ని సిఫారసు చేసింది. అవి పెద్దగా ఫ్రక్టిఫై అవ్వలేదనుకోండి. సౌత్‌లో అన్ని భాషల్లో ఉన్న మార్కెట్‌ వదులుకుని వెళ్లడానికి యీయనకూ కుదరలేదు.

ఇంత టాలెంట్ వున్న పిబి గురించి లతా ఏమీ తెలియకుండా అలా దురుసుగా మాట్లాడడం అన్యాయం కదా! అయినా ఆవిడ అహం అటువంటిది. ఐనా లతా అంటే పిబికి చాలా యిష్టం. వాళ్ల అమ్మాయికి స్వరలత అని పేరు పెట్టుకున్నారు. గాయనిగా లతా సిల్వర్‌జూబ్లీ జరిగినప్పుడు ఆయన 'సప్తస్వర సుందరీ' అనే శీర్షికతో ఓ ప్రశంసాగీతం రాసి, స్వరపరచి, టేప్‌లో రికార్డు చేసి ఆమె యింటికి వెళ్లి సమర్పించారు. మేం ‘‘హాసం’’ పత్రిక నడిపే రోజుల్లో పిబి చేత లతాపై సీరియల్‌ రాయించాం. ఈ కవిత మకుటం ‘సప్తస్వర సుందరీ’ అనే పేరుతోనే లతా జీవితచరిత్రను 19 సంచికలపాటు రాశారు పిబి. ఆయనకు చక్కటి అబ్జర్వేషన్‌ వుంది, విశ్లేషణ వుంది. బ్రహ్మాండమైన భాషాపరిజ్ఞానం వుంది. అయినా ఆ సీరియల్‌ పాఠకులకు అంతగా రుచించలేదు.

దానికో కారణం వుంది. పిబి రాసిన లతా సీరియల్‌ వేసేముందు నటగాయకుడు కిశోర్‌ కుమార్‌ గురించి నేను రాసిన 'కిశోర్‌ జీవన ఝరి' అనే సీరియల్‌ వేశాం. కిశోర్‌ జీవితం మోస్ట్‌ కలర్‌ఫుల్‌. క్రేజీ పెర్శనాలిటీ, నాలుగు పెళ్లిళ్లు, కాంట్రవర్సీలు, జీవితంలో ఎగుడుదిగుళ్లు, యాక్టర్‌గా ఫెయిలవ్వడం, సింగర్‌గా మళ్లీ పైకి రావడం వగైరాలతో సీరియల్‌ మహా రంజుగా నడిచింది. దాని వెంటనే వచ్చింది, లతా సీరియల్‌. పైన చెప్పినట్లు లతా జీవితంలో కూడా కాంట్రవర్సీలు వున్నాయి. సి రామచంద్రను పెళ్లి చేసుకుందా మనుకుందనీ, ఓపి నయ్యర్‌తో పడలేదనీ, రాయల్టీ విషయంలో రఫీతో పోట్లాడిందనీ, ఎస్‌డి బర్మన్‌కు కొన్నాళ్లు పాడలేదనీ, మిగతా గాయనీ మణులను పైకి రానీయకుండా అణిచేసిందనీ – ఇలా చాలా వున్నాయి. అవన్నీ రాస్తారేమోనని పాఠకుల ఆశ.

ఈయన చూస్తే లతాను మెచ్చుకోవడమే తప్ప వ్యతిరేకంగా ఒక్కమాట అనకపోవడం చూసి పాఠకులు నొచ్చుకోవడం మొదలెట్టారు. మేనేజింగ్‌ ఎడిటర్‌గా పాఠకులను శాంతింపజేయడం నా బాధ్యత. అందువల్ల లతా గురించిన కాంట్రవర్సీలన్నిటిమీదా నేను వేర్వేరు పేర్లతో బాక్స్‌ ఐటమ్స్‌ రాయడం మొదలెట్టాను. మెయిన్‌ బాడీ మేటర్‌తో కాన్‌ఫ్లిక్ట్‌ రాకుండా వేరే కలర్‌లో వేస్తూ, ఆయన పొగడ్తలను బ్యాలన్స్‌ చేస్తూ సీరియల్‌ నడిపాను. నిజానికి పిబి ఎవరి గురించి రాసినా విమర్శ అస్సలు వుండదు. అందర్నీ మెచ్చుకోవడమే. అంటే దానివల్ల ఆయన లబ్ధి పొందుతారని కాదు. ఆయన మృదుస్వభావం, సహృదయం అలాటివి. మరి ఇలాటాయన నేను రాసిన బాక్స్‌ ఐటమ్స్‌ గురించి ఎలా ఫీలయ్యారు?  సీరియల్‌ నడిచే రోజుల్లోనే నేను మద్రాసు వెళ్లినపుడు పిబి గార్ని కలిశాను. ఆయన నవ్వుతూ భుజం తట్టి 'మీ కిశోర్‌ కుమార్‌ సీరియల్‌ చదివాను, చాలా బాగుంది.' అని మెచ్చుకుని, 'అవునూ, లతా సీరియల్‌లో బాక్స్‌ ఐటమ్స్‌ అలా వేస్తున్నారేమిటి?' అన్నారు.

'చచ్చాంరా బాబూ' అనుకుని, 'మీ దానికి బ్యాలన్స్‌ చేయాలని.. పత్రికానిర్వహణలో ఇవి తప్పవులెండి' అన్నాను ఆయన ఆ విషయం వదిలిపెట్టేస్తే బాగుండును అనుకుంటూ. 'అబ్బే, అవి వద్దు. ఎందుకొచ్చిన కాంట్రవర్సీలు. మనకు కావలసినది ఆవిడ పాట. మిగతా గొడవలు అనవసరం.’ అన్నారాయన. ‘కిశోర్ గురించి అన్నీ రాశాను, మీకు నచ్చాయన్నారు కూడా. పాఠకులకు వాటిపై కూడా ఆసక్తి వుంటుంది కదా.’ అన్నాను. ‘కిశోర్ సంగతి వేరు. అతను బతికి వుండగా వేసినా ఫర్వాలేకపోయేది. కానీ యీవిడ సంగతి వేరు. మనసులో కక్ష పెట్టుకుంటుంది.’ అన్నారు. ‘ఆవిడకు తెలుగు రాదు కదండీ’ అన్నాను. ‘ఉంటారుగా మనవాళ్లు… మోసేస్తారు.’ అన్నారాయన. 2003 ప్రాంతం అంటే లత ప్రాబల్యం బాగా తగ్గిపోయింది. అయినా పిబి ఆవిణ్ని చూసి భయపడ్డారంటే ఆవిడ తరహా ఎటువంటిదో తెలుస్తోంది కదా!

చివరగా ‘మీరు అంతగా ఆ మేటర్‌ రాద్దామనుకుంటే వేరే పేజీల్లో వేసుకోండి. నేను రాసే మేటర్‌ పక్కనే వేయకండి.' అన్నారు. ఏ పత్రికలోనైనా అలా వేయడం జరుగుతుందా? రెండు వెర్షన్లూ పక్కపక్కనే వేస్తారు. సరేసరే అంటూ బుర్ర వూపాను కానీ నా పద్ధతిలోనే నేను వెళ్లాను. అయితే సుగుణం ఏమిటంటే ఆయన లతా పట్ల ఎంత ఉదారంగా వున్నారో మా పట్లా అంతే ఉదారంగా వున్నారు. 'నేను చెప్పినట్లు చేయకపోతే సీరియల్‌ ఆపేస్తాను' అని బెదిరించలేదు. ‘‘హాసం’’ పత్రిక మూతపడ్డాక, ‘‘హాసం బుక్స్’’ వేయసాగాం. కిశోర్ పుస్తకం మూడు ముద్రణలకు వచ్చినా, లతా పుస్తకం మాత్రం వేసే సాహసం చేయలేదు. పిబి గారి స్తోత్రపాఠం పాఠకులకు నచ్చదనే భయం చేత! మరి నేను రాసిన మెటీరియల్ వేస్టవుతోంది కదా! అందుకని లతాపై పాజిటివ్ విషయాలు, తొలినాళ్ల జీవితం, పాటల విశ్లేషణ కూడా నేను రాసి, సమగ్రమైన పుస్తకం వేద్దామనుకుని ‘స్వరసామ్రాజ్ఞి లతా’ అనే పేరు పుస్తకం ప్లాను చేసి ఎనౌన్సు కూడా చేశాను. పుస్తకం రాయకపోయినా కవరు పేజీ రెడీ చేసుకున్నాను. (ఫోటో చూడండి)

అయితే ఇతర వ్యాపకాల్లో పడి, పుస్తకరచన వాయిదా వేశాను. సంగీతం గురించి రాసే పుస్తకాల్లో ఉన్న ఒక యిబ్బంది కూడా నేను గమనించాను. ఫలానా పాట చూడండి ఎంత మార్దవంగా పాడారో, ఫలానా చోట లాలిత్యం ఎలా పలికిందో చూడండి.. అని మనం రాస్తే పాఠకుడికి ఆ పాట వెంటనే గుర్తుకు రావాలి. హిందీ పాటల గురించి తెలుగు పాఠకుడికి చెప్పేటప్పుడు కష్టం వుంటుంది. ఎందుకంటే తెలుగువాళ్లలో చాలామందికి ట్యూన్ గుర్తే కానీ లిరిక్ స్పష్టంగా తెలియదు. ఒక్కో పాటలో సాకి గుర్తుంటుంది, మరో దానికి పల్లవి గుర్తుంటుంది. సినిమా పేరు రాసినా, సంగీతదర్శకుడి పేరు రాసినా చాలామంది గుర్తు పట్టలేరు. అందువలన మనం చెప్పిన పాట అతనికి అందకుండా పోతుంది. బాణీ వినిపిస్తే ఓహ్, యిదా అనుకుంటాడు. విఎకె రంగారావు గారు పత్రికల్లో శీర్షిక రాసే రోజుల్లో గ్రామఫోన్ రికార్డు నెంబరు రాసేవారు. గ్రామఫోన్ల వాడకం తగ్గాక, అలాటి రిఫరెన్సులు యివ్వడం మానేశారు.

లతా వంటి గాయకురాలి పాటలు విడుదలైన 60 ఏళ్లకు మనం ప్రస్తావించేటప్పుడు యువతరం పాఠకుడికి తెలియదేమో, యీ గ్యాప్‌ను అధిగమించడం ఎలా అని ఆలోచిస్తూ, కాలయాపన చేశాను. ఈ మధ్యే తట్టింది. పాట గురించి రాసినప్పుడు యూట్యూబ్ లింకు యిస్తే సరిపోతుంది కదాని. ఈ కాలమ్‌లో కొందరు హిందీ నటీనటుల గురించి యీ ప్రయోగం చేశాను. పాఠకులకు నచ్చింది. ఇప్పుడు లతా మరణించారు కాబట్టి ఆ పుస్తకం మెటీరియల్‌ను యీ కాలమ్‌లోనే వారానికి రెండు ఇన్‌స్టాల్‌మెంట్ల చొప్పున సీరియల్‌గా రాసి, అది ప్రజాదరణ పొందితే, ఫైనల్‌గా పుస్తకంగా వేస్తే మంచిదనిపిస్తోంది. కాలమ్‌లో వేసినప్పుడు పాటలకు లింకు యిస్తాను. పాట వినగానే లతా ఘనత, ఆమెను తీర్చిదిద్దిన సంగీతదర్శకుల ప్రతిభ అర్థమౌతుంది. ఎందుకంటే భారతీయ సినీసంగీతం ఉన్నన్నినాళ్లు లతా పేరు కూడా చిరస్థాయిగా వుంటుంది. ఆవిడ స్మృతికి యిదే నా నివాళి.

ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2022)