ఒక్కసారిగా ప్రపంచం ఉలిక్కి పడినంత హడావుడి. విజయవాడ పట్టణం దద్దరిల్లిపోయింది. నేల ఈనింది. ఆకాశానికి చిల్లు పడింది. ఇంకేం లేదు. జగన్ సారథ్యంలోని ప్రభుత్వం కూలిపోయినట్లే. అన్నంత హడావుడి జరిగిపోయింది తెలుగుదేశం అను'కుల' మీడియాలో.
కానీ అదే మీడియాలో ఇప్పుడు …ఆ రాత్రి ఏం జరిగింది…తెరవెనుక ఏం జరిగింది…అసలు సమ్మె వల్ల ఏం సాధించారు? గతంలో వీరుల్లా..శూరుల్లా మాట్లాడిన వారు ఇప్పుడు ఎందుకు సైలంట్ అయిపోయారు. ఇలాంటి శీర్షికలు కనిపిస్తున్నాయి.
అసలు విషయం ఏమిటంటే ఉద్యోగులు సమ్మె చేస్తాం అన్నపుడు జనాల్లో సానుభూతి కనిపించలేదు. ఇది పచ్చి నిజం. ప్రభుత్వ ఉద్యోగుల పనితీరుపై ప్రజలకు అంత సానుకూలత లేదు. ఈ విషయంలో జనాల అభిప్రాయాలకు ఫేస్ బుక్, వాట్సాప్ పోస్ట్ లే సాక్షి. ఒకప్పుడు బతకలేక బడిపంతులు. ఇప్పుడు టీచర్ ఉద్యోగం అంత క్రేజీ ఉద్యోగం మరోటి లేదు. లక్షకు పైగా జీతాలు.
ఇక ప్రభుత్వ ఉద్యోగుల సంగతి చెప్పనక్కరలేదు. రెవెన్యూలో అవినీతి తాండవం చేస్తుంది. పాస్ పుస్తకం చేయించాలంటే ఎకరానికి అయిదు నుంచి ఆరు వేలు తీసుకుంటారన్నది జనాలందరికీ తెలిసిన సంగతే. ఇక రిజిస్ట్రేషన్ ఖర్చులు ఎంత అయితే మామూళ్లు అంత అన్నది రిజిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ లో వుందన్న సంగతీ తెలిసిందే. ఇలా ప్రతి శాఖలో అవినీతి వేళ్లూనుకుపోయింది.చంద్రబాబు అయినా జగన్ అయినా ఈ విషయంలో చేసేదేమీ లేదు.
అందువల్లే ప్రభుత్వ ఉద్యోగుల మీద జనాలకు సానుభూతి లేదు. ఇప్పుడు అలాంటి ప్రభుత్వ ఉద్యోగులు అంత ఎత్తున ఉద్యమించారని 'దేశం' అనుకుల మీడియా నానా హడావుడి చేసింది. పేజీలకు పేజీలు నింపేసింది. అదే మీడియా ఇప్పుడు, ఉద్యోగులు ఏమీ సాధించకుండానే చల్లబఢిపోయారు. ఉద్యోగ సంఘాల నాయకులు పిల్లులు అయిపోయారు. అంటూ మళ్లీ వార్తలు వండడం మొదలుపెట్టింది.
అంటే ఉద్యోగ సంఘాలకు లేదా నాయకులకు జగన్ ఒక్క రాత్రిలో ముక్కుతాడు వేసినట్లు ఆ మీడియానే ఒప్పుకుంటోంది. ఇది జనాల్లోకి వారు ఆశించన విధంగా కాకుండా వేరేగా వెళ్లింది. జగన్ గొప్పోడ్రా, ఉద్యోగులను భలే కంట్రోలు చేసాడు అనే విధంగా మాటలు వినిపిస్తున్నాయి. జగన్ దగ్గర ఉద్యోగ సంఘాల పప్పులు ఉడకలేదు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
గతంలో చంద్రబాబు మంచి చేసినా విమర్శించిన ఉద్యోగసంఘాల నేతలకు ఇప్పుడు తగిన శాస్తి జరిగిందని 'దేశం' అను'కుల' మీడియాలే టముకు వేస్తున్నాయి. ఈ వార్తలు ఉద్యోగులను జగన్ కు దూరం చేస్తాయని, వారిని రెచ్చ గొడతాయని ఈ మీడియాల ఆలోచన. కానీ ఈ వార్తలు ప్రజల్లో మాత్రం జగన్ ఇమేజ్ పెంచడానికి ఉపయోగపడుతున్నాయి.