దర్శకుడు మారుతి- బాహుబలి ప్రభాస్ సినిమా అనే ఆసక్తికరమైన వార్తను 'గ్రేట్ ఆంధ్ర' తొలిసారి వెల్లడించిన సంగతి తెలిసిందే. దాని టైటిల్ గా 'రాజా డీలక్స్ ' అనే దాన్ని రిజిస్టర్ చేయించారని కూడా వెల్లడించిన సంగతీ తెలిసిందే. అక్కడి నుంచి పాపం డైరక్టర్ మారుతికి కష్టాలు మొదలయ్యాయి.
తాము కూడా ఈ విషయంలో ముందుండాలని, అప్ డేట్ లు ఇవ్వాలని చాలా మీడియా సంస్థలు కిందా మీదా కావడం ప్రారంభమైంది.అందులో భాగంగా ఎవరి ఊహాగానాలు అవి చేస్తున్నాయి.
కానీ ఆ హాఫ్ బేక్డ్ న్యూస్ లు అన్నీ మారుతిని ఇరుకున పెడుతున్నాయి. అవే నిజం అనుకుని ఫ్యాన్స్ రకరకాలుగా ట్విట్టర్ లో కామెంట్లు పెడుతున్నారు. అసలు సబ్జెక్ట్ ఏమిటన్నది, ఎక్కడ ఎప్పుడు షూట్ అన్నది, మారుతికి ప్రభాస్ కు మాత్రమే ఇప్పటికి పరిమితమై వున్నాయి. కానీ ఇలా హాఫ్ బేక్డ్ బయటకు వస్తుంటే ఫ్యాన్స్ కలవరపడిపోతున్నారు.
ఈ విషయమై మారుతి 'గ్రేట్ ఆంధ్ర' తో మాట్లాడుతూ 'ఎవరు పడితే వాళ్లు వాళ్లకి తోచినవి రాసేస్తున్నారు. ముందు ఫ్యామిలీ సబ్జెక్ట్ అన్నారు. తరువాత ఇంకోటి అన్నారు. ఇప్పుడు సింగిల్ సెట్ లోనే సగం సినిమా అంటున్నారు. ఇవేవీ నిజం కాదు. వన్స్ సినిమా స్టార్ట్ అయిన తరువాత అన్నీ తెలుస్తాయి..అంత వరకు ఫ్యాన్స్ ఓపిగ్గా వుండాలని' అన్నారు.
ఇదిలా వుంటే విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం ఈ సినిమా షూట్ ఫస్ట్ షెడ్యూలు తొలి 15 రోజులు మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వుంటుంది. ఇలా అప్పుడు అప్పుడు రెండేసి వారాల వంతున చాలా త్వరగా ఈ సినిమాను ఫినిష్ చేసి విడుదల చేస్తారు. ఈ సినిమాకు నిర్మాత డివివి దానయ్య. ప్రభాస్ చేస్తున్న అవుట్ అండ్ అవుట్ సినిమాలకు భిన్నంగా వుండబోతోందీ సినిమా.