పీఆర్సీ వ్యవహారం సద్దుమణిగింది.. ప్రభుత్వ ఆర్థిక స్థితిని ఉద్యోగులు అర్థం చేసుకున్నారు. ఇప్పటి పరిస్థితుల్లో గొప్ప పీఆర్సీనే ఇచ్చారనే విషయాన్ని స్వయంగా వారే ఒప్పుకున్నారు. సమ్మె విరమించుకున్నారు.. ఇక అంతా ప్రశాంతం అని ప్రజలు అనుకుంటున్న తరుణంలో టీచర్లు కొత్తగోల ప్రారంభించారు. ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న వారందరూ ద్రోహులని, ప్రభుత్వంతో లాలూచీ పడ్డారని నానా మాటలు అంటున్నారు. సరికొత్త ఉద్యమానికి కార్యచరణ ప్రణాళిక ప్రకటిస్తున్నారు.
రాష్ట్రం ఎంతగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ.. ప్రభుత్వం ఉద్యోగులకు 24 శాతం ఫిట్మెంట్ తో జీతాలను పెంచింది. పీఆర్సీ అమల్లోకి వచ్చినప్పుడు బేసిక్ పేలు పెరుగుతాయి గనుక.. తదనుగుణంగా హెచ్ఆర్ఏ లు తగ్గడం చాలా సాధారణమైన విషయం. అయితే ఈ దఫా.. ప్రభుత్వం హెచ్ఆర్ఏలు తగ్గించిన తీరు ఉద్యోగులకు కష్టం కలిగించింది. పైగా.. గతంలో ఐఆర్ రూపంలో 27శాతం ఇస్తూ వచ్చిన ప్రభుత్వం తేడాను రికవరీ చేయాలనుకోవడం ఉద్యమానికి దారి తీసింది. ఉద్యోగులు పోరుబాట పట్టగానే.. ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ రెండింటి విషయంలో ఉద్యోగుల అభిప్రాయాల్ని మన్నించాలని నిర్ణయించుకుంది.
అయితే నిజానికి ఉద్యోగులు ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీతో చర్చలకే వెళ్లకుండా.. తామేదో పెద్ద ఉద్యమం చేసేస్తున్న బిల్డప్ తో రభస చేయడానికి ప్రయత్నించారు. వీరి నిరసనలు వ్యక్తమైన తొలిరోజునుంచి.. చర్చలకు వస్తే సమస్య పరిష్కారం అవుతుంది కదా..అని ప్రభుత్వ పెద్దలు చెబుతూనే ఉన్నారు. అయితే.. ఉద్యోగులు మాత్రం చర్చలకు వెళ్లకుండా.. పోరుబాటలోనే వెళ్లారు. ఛలో విజయవాడ కూడా నిర్వహించారు.
ఆ తర్వాత చర్చలకు వెళ్లారు. వాళ్లు అడిగిన ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే ఒప్పుకుంది. తామేదో ఛలో విజయవాడ కార్యక్రమం ద్వారా ప్రభుత్వాన్ని భయపెట్టి వాటిని సాధించినట్లుగా ఉద్యోగులు చెప్పుకోవడానికి ఉత్సాహపడ్డారు. అంతే తప్ప.. ఆ కార్యక్రమానికి ముందు వాళ్లు చర్చలకు వెళ్లి ఉన్నా.. ఆ సమస్యలు తీరిపోయి ఉండేవి. అదనపు భారం సంగతి ఎలా ఉన్నప్పటికీ.. ఉద్యోగుల కోసం దాన్ని మోయడానికి ప్రభుత్వం సిద్ధపడింది.
అయితే ఇప్పుడు టీచర్లు ప్రత్యేకంగా గగ్గోలు పెట్టడం ప్రారంభించారు. సమ్మె విరమణ ప్రకటించిన ఉద్యోగ నేతలను తిడుతున్నారు. చిన్న చిన్న ఊర్లకు కూడా పెద్ద పెద్ద హెచ్ఆర్ఏ శ్లాబులు కావాలనేది టీచర్ల కోరిక. ఎందుకంటే.. టీచర్లు ఎవ్వరూ వారు పనిచేస్తున్న గ్రామాల్లో నివాసం ఉండరు. వారి వారి వ్యక్తిగత అవసరాల నిమిత్తం దూరంగా అయినా సరే నగరాల్లో పట్టణాల్లో నివాసం ఉంటారు. అందుకని ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన హెచ్ఆర్ఏ శ్లాబులు వారికి చాలా తప్పుగా కనిపిస్తున్నాయి.
ఉద్యోగులు అందరికీ ఆమోదయోగ్యంగా కనిపించిన నిర్ణయాలు.. ఒక్క టీచర్లకు మాత్రమే భిన్నంగా కనిపిస్తున్నాయంటే దాని అర్థం.. వారి ఆలోచనల్లోనే తేడా ఉన్నదని! ఆ వాస్తవాన్ని వారు తెలుసుకోవాలి. ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉన్నదని గుర్తించాలి. అలా కాకుండా.. కొత్తగా రభస చేయడానికి ప్రయత్నిస్తే వారికీ మన్నన దక్కదు! ఒకవేళ అలా గోల చేయాలనుకున్నా.. చేసుకోవచ్చు. అందరి మీద నిందలు వేయడం.. ప్రభుత్వాన్ని తూలనాడడం కాకుండా.. వారు కూడా సమ్మెకు వెళ్లవచ్చు. ఫలితం ఎలా ఉంటుందో వారికే అర్థమవుతుంది.