మోడీ సర్కారుపై దుమ్మెత్తిపోస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఈ విషయంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోని సీఎంల కన్నా కేసీఆర్ స్పందనే చాలా ఘాటుగా ఉంది! ఇటీవలి కేంద్ర బడ్జెట్ పై కేసీఆర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర బడ్జెట్ ను ఒక గోల్ మాల్ గా అభివర్ణించారు. కేంద్రం తీరును తీవ్రంగా తప్పు పట్టారు. అంతే కాదు.. బీజేపీ విధివిధానాల మీద కూడా ఆయన ఘాటుగా స్పందించారు.
మోడీ వస్త్రధారణ మీద కూడా కేసీఆర్ పంచులు వేశారు. పంజాబ్ కు వెళితే సిక్కుల తలపాగా, తమిళనాడుకు వెళితే లుంగీ, ఈశాన్య రాష్ట్రాలకు వెళితే అక్కడి సంప్రదాయ వస్త్రధారణ.. ఇలాంటివి తప్ప మోడీతో దేశానికి దక్కిన ప్రయోజనం ఏమిటన్నట్టుగా కేసీఆర్ ప్రశ్నించారు. మోడీ వస్త్రధారణల మీద చాన్నాళ్ల తర్వాత ఒక రాష్ట్ర సీఎం ఈ రేంజ్ లో స్పందించారు.
ఇక ముచ్చింతల్ లోని రామానుజ విగ్రహాన్ని మోడీ ఏర్పాటు చేసినట్టుగా ఉత్తరాదిన బీజేపీ సోషల్ మీడియా టీమ్ ప్రచారం చేసుకుంటోందంటూ కూడా ఆ పార్టీని కార్నర్ చేశారు. ఏ అవకాశాన్నీ వదలకుండా బీజేపీని, కమలదళం తీరును కేసీఆర్ దుయ్యబడుతున్నారు.
ఇంత వరకూ బాగానే ఉంది కానీ, కేసీఆర్ సౌండ్ ఇక్కడ చేస్తుంటే, ఢిల్లీలో మాత్రం రీ సౌండ్ రావడం లేదు. కేసీఆర్ వ్యాఖ్యలపై ఢిల్లీ రేంజ్ బీజేపీ నేతలు స్పందించడం ఎలా ఉన్నా, ఈయన వ్యాఖ్యలు జాతీయ మీడియాలో మాత్రం పెద్దగా హైలెట్ కావడం లేదు. రాజ్యాంగాన్ని మార్చాలంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యపై కూడా మరీ పెను సంచలన స్థాయిలో కవరేజీ రాలేదు. అదీ ఒక వార్తలాగా మాత్రమే ఇచ్చింది నేషనల్ మీడియా.
ఒకవేళ ఎవరైనా ఉత్తరాది రాష్ట్రాల సీఎం గనుక కేసీఆర్ లా మాట్లాడి ఉంటే రచ్చ అయ్యేదేమో! పీఎం మోడీపై ధ్వజమెత్తుతున్న సీఎంగా కేసీఆర్ కు విస్తృతమైన కవరేజీ వచ్చేది. అయితే సౌత్ లో ఏం జరిగినా దానితో దేశానికి సంబంధం లేనట్టుగా ట్రీట్ చేసే హిందీ బెల్ట్ ఇంగ్లిష్ మీడియా కేసీఆర్ ప్రకటనలను హైలెట్ చేయడం లేదు. ఎవరైనా ఉత్తరాది రాష్ట్రాల సీఎం ఇలా మాట్లాడి ఉంటే మాత్రం కథ మరోలా ఉండేది ఈ పాటికి!