స్టార్ డైరక్టర్ కాదు.. స్టార్ కంటెంట్ కావాలి

అఖిల్ కోసం నాగార్జున ఓ రాజమౌళిని లేదా ఓ బోయపాటి లాంటి దర్శకుడ్ని ఎందుకు తీసుకురాడు? ఓ స్టార్ డైరక్టర్ తో సినిమా సెట్ చేస్తే అయిపోతుంది కదా? సగటు అక్కినేని అభిమాని ఆవేదన…

అఖిల్ కోసం నాగార్జున ఓ రాజమౌళిని లేదా ఓ బోయపాటి లాంటి దర్శకుడ్ని ఎందుకు తీసుకురాడు? ఓ స్టార్ డైరక్టర్ తో సినిమా సెట్ చేస్తే అయిపోతుంది కదా? సగటు అక్కినేని అభిమాని ఆవేదన ఇది. దీనిపై అఖిల్ స్పందించాడు. అది తమ స్టయిల్ కాదంటున్నాడు.

“స్టార్ డైరక్టర్లపై ఒత్తిడి పెట్టి తీసుకొచ్చి సినిమా చేయడం మా స్టయిల్ కాదు. ఇప్పుడైతే నేను పెద్ద డైరక్టర్ తోనే సినిమా చేశాను. నా ఫ్యాన్స్ కూడా హ్యాపీ. ప్రతి సినిమాకు పెద్ద దర్శకుడు దొరకడు కదా, నాతో సినిమా చేయాలని పెద్ద డైరక్టర్లు అనుకోవాలి, నేను అనుకుంటే సరిపోదు. నాకు సింక్ అయ్యే వ్యక్తులతో సినిమాలు చేస్తే ఎక్సయిటింగ్ గా ఉంటుంది. ప్రస్తుతం అదే చేస్తున్నాను. పెద్ద దర్శకులు ఎవరున్నారని నేను వెదకడం లేదు, మంచి కంటెంట్ ఎక్కడుందో వెదుకుతున్నాను.”

ఇలా పెద్ద దర్శకులతో సినిమాలు చేయకపోవడంపై స్పందించాడు అఖిల్. స్టార్ డైరక్టర్ తో మంచి కాంబినేషన్ సెట్ అయితే తనకు కూడా ఆనందంగా ఉంటుందని, కానీ పొద్దున్న లేచిన వెంటనే ఏ కాంబినేషన్ సెట్ చేద్దామనే ఆలోచన కంటే, ఎలాంటి కంటెంట్ అయితే బాగుంటుందనే ఆలోచన తనకు నచ్చుతుందన్నాడు.

“నిజానికి పెద్ద డైరక్టర్ అనే ఇమేజ్ ఇప్పుడు ఎవరికీ లేదు. మంచి కంటెంట్ ఉందా లేదా అనేది మాత్రమే మేటర్. అలా అని పెద్ద దర్శకులతో చేయనని, చిన్న దర్శకులనే చేస్తానని అనడం లేదు. ఆ కోణంలో ఆలోచించడం లేదంతే. నాకు ఎలాంటి కంటెంట్ కావాలో చాలా క్లియర్ గా తెలుసు. అలాంటి మంచి కంటెంట్ వచ్చినప్పుడు దర్శకుడు ఎవరనేది చూడను.”

ప్రస్తుతం సురేందర్ రెడ్డితో ఏజెంట్ సినిమా చేసిన అఖిల్, తన నెక్ట్స్ సినిమాను కొత్త దర్శకుడితో చేస్తున్నానని, ఆ తర్వాత స్టార్ డైరక్టర్ తో చేసే అవకాశం ఉందని తెలిపాడు.