ఉండ‌వ‌ల్లితో ఫైట్‌…క‌మ్మ మేధావులు ఏమ‌య్యారు?

తెలుగు మీడియా దిగ్గ‌జం రామోజీరావుకు మ‌ద్ద‌తుగా మాట్లాడేందుకు చివ‌రికి రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన మేధావి కావాల్సి వ‌చ్చిందా? అని సోష‌ల్ మీడియాలో సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి. త‌న సామాజిక వ‌ర్గ‌మైన చంద్ర‌బాబునాయుడికి ఈనాడు మీడియా…

తెలుగు మీడియా దిగ్గ‌జం రామోజీరావుకు మ‌ద్ద‌తుగా మాట్లాడేందుకు చివ‌రికి రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన మేధావి కావాల్సి వ‌చ్చిందా? అని సోష‌ల్ మీడియాలో సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి. త‌న సామాజిక వ‌ర్గ‌మైన చంద్ర‌బాబునాయుడికి ఈనాడు మీడియా సంస్థ‌ల అధినేత రామోజీరావు కొన్నేళ్లుగా మ‌ద్ద‌తుగా నిలిచిన సంగ‌తి తెలిసిందే. కేవ‌లం కులాభిమానంతోనే చంద్ర‌బాబుకు ఈనాడును ధారాద‌త్తం చేశార‌నే విమ‌ర్శ‌ల్ని రామోజీరావు మూట‌క‌ట్టుకున్నారు. బాబుకు రాజ‌గురువుగా రామోజీరావు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో మార్గ‌ద‌ర్శి ఫైనాన్స్‌లో ఆర్థిక అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌ని ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ 17 ఏళ్లుగా న్యాయ‌పోరాటం చేస్తున్నారు. ఇటీవ‌ల నిర్వ‌హించిన స‌మావేశంలో ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ టీడీపీకి , ఆడిట‌ర్లు, న్యాయ‌వాదు ల‌కు స‌వాల్ విసిరారు. మార్గ‌ద‌ర్శిపై స‌మావేశం పెడితే త‌న‌ను పిలిస్తే మార్గ‌ద‌ర్శి త‌ప్పేంటో చెబుతాన‌ని, ఒక‌వేళ త‌న వాద‌న‌లో ప‌స లేద‌ని నిరూపిస్తే కేసు విత్‌డ్రా చేసుకుంటాన‌ని చెప్పారు. ముఖ్యంగా టీడీపీకి ఆయ‌న విసిరిన స‌వాల్ ప్రాధాన్యం సంత‌రించుకుంది.

“చంద్ర‌బాబూ… మార్గ‌ద‌ర్శి వ్య‌వ‌హారాల‌పై చ‌ర్చ‌కు నేను సిద్ధంగా ఉన్నా. టీడీపీ అధికార ప్ర‌తినిధి హోదాలో చంద్ర‌బాబు ఎవ‌రినైనా చ‌ర్చ‌కు పంపాలి. సింగ‌పూర్‌, దుబాయ్‌లో చంద్ర‌బాబు ఆస్తులు లాంటి క‌ష్ట‌మైన ప్ర‌శ్న‌లు ఏవీ నేను అడ‌గ‌ను. టీడీపీ ప్ర‌భుత్వంలో వ్య‌వ‌హారాల‌పైనే అడుగుతా” అని స‌వాల్ విసిరారు.

ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ స‌వాల్‌ను టీడీపీ జాతీయ అధికార ప్ర‌తినిధి జీవీ రెడ్డి స్వీక‌రించారు. మార్గదర్శి వ్యవహారంపై ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో బహిరంగ చర్చకు సిద్ధమ‌ని జీవీరెడ్డి ప్ర‌క‌టించారు. తేదీ, సమయం, స్థలం నిర్ణయించాలని ఉండవల్లికి జీవీరెడ్డి సూచించారు.

జీవీరెడ్డి స‌వాల్‌పై ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ ఇవాళ స్పందించారు. రాజ‌మండ్రిలో మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ త‌న‌తో డిబేట్‌కు జీవీరెడ్డి సిద్ధం కావ‌డం సంతోష‌మ‌న్నారు. బ‌హిరంగ చ‌ర్చ‌కు తాను రెడీ అని ఆయ‌న చెప్పారు. ఈ సంద‌ర్భంగా కొన్ని ప్రాధాన్య‌త‌ల‌ను ఆయ‌న మీడియా ముందు పెట్టారు. ఈ బ‌హిరంగ చ‌ర్చ‌ను రామోజీరావుకు సంబంధించిన ఫిల్మ్ సిటీలో పెడితే బాగుంటుంద‌న్నారు. అయితే రామోజీని ఒప్పించే స్థాయి త‌న‌కు, జీవీరెడ్డికి లేద‌న్నారు. చంద్ర‌బాబునాయుడు చొర‌వ తీసుకుని రామోజీతో మాట్లాడితే ఒప్పుకుంటార‌న్నారు.

ఈ డిబేట్‌లో రామోజీరావు పాల్గొన‌వ‌చ్చ‌ని, అవ‌స‌ర‌మైతే ఆయ‌న జోక్యం చేసుకోవ‌చ్చ‌న్నారు. సీఐడీ ద‌ర్యాప్తు సంద‌ర్భంలో బెడ్‌పై ప‌డుకున్న‌ట్టుగా, త‌మ డిబేట్‌లో ఆయ‌న ప‌డుకుని పాల్గొన‌వ‌చ్చ‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. రామోజీ ఫిల్మ్ సిటీలో కాక‌పోతే తెలుగుదేశం కార్యాల‌యంలో డిబేట్ నిర్వ‌హించాల‌ని త‌న రెండో ప్రాధాన్యం కింద సూచించారు. ఇవి రెండూ కాక‌పోతే బ‌హిరంగంగా హైద‌రాబాద్ ప్రెస్‌క్ల‌బ్‌లో నిర్వ‌హించొచ్చ‌న్నారు. వ‌చ్చే నెల 14న ఆదివారం డిబేట్‌కు తాను సిద్ధ‌మ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు.  

అయితే క‌మ్మ సామాజిక వ‌ర్గం పార్టీగా గుర్తింపు పొందిన టీడీపీ కోసం రామోజీరావు జ‌ర్న‌లిజం నైతిక విలువ‌ల‌న్నింటికీ పాత‌రేశార‌నే విమ‌ర్శ వుంది. ఇప్పుడు పీక‌ల్లోతు క‌ష్టంలో ఉన్న‌ప్పుడు, ఆయ‌న త‌ర‌పున బ‌ల‌మైన వాద‌న వినిపించేందుకు రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన టీడీపీ జాతీయ అధికార ప్ర‌తినిధి, యువ మేధావి జీవీరెడ్డి త‌ప్ప‌, మ‌రొక‌రు లేరా? అని సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ సాగుతోంది.  

టీడీపీ అధికారంలో వుంటే మాత్రం ఆర్థిక మేధావులంటూ ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్యక్షుడు తుర్ల‌పాటి కుటుంబ‌రావు, అలాగే బాబు హ‌యాంలో ప్ర‌భుత్వ ప‌త్రికా సంపాద‌కుడిగా అధికార ద‌ర్పం ప్ర‌ద‌ర్శించిన మ‌రొకాయ‌న‌, ఇక రామోజీని వెన‌కేసుకొచ్చేందుకు ఈనాడు, ఈటీవీల‌కు అభిప్రాయాలు చెప్పే టీడీపీ అనుకూల క‌మ్మ మేధావులు, పార్టీ నాయ‌కులు ఏమ‌య్యారంటూ నెటిజ‌న్లు నిల‌దీస్తున్నారు. 

టీడీపీ అధికారంలో వుంటే మాత్రం ప‌ద‌వులు, పంప‌కాలన్నీ క‌మ్మ సామాజిక వ‌ర్గం వాళ్ల‌కు, స‌మ‌స్య వ‌స్తే మాట్లాడ్డానికి ఇత‌ర సామాజిక వ‌ర్గం వాళ్లు కావాల్సి వ‌చ్చిందా? ఇదేం ఖ‌ర్మ టీడీపీకి, రామోజీకి అంటూ నెటిజ‌న్లు సెటైర్స్ విసురుతున్నారు.

రామోజీరావుపై నిజంగా ప్రేమే వుంటే ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ స‌వాల్ స్వీక‌రించే ద‌మ్ము, ధైర్యం ఒక్క జీవీరెడ్డికి తప్ప‌, ఆయ‌న సామాజిక వ‌ర్గం నాయ‌కులు, మేధావుల‌కు ఎందుకు లేక‌పోయింద‌నే నిల‌దీత‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇదే సంద‌ర్భంలో జీవీరెడ్డికి కూడా నెటిజ‌న్లు చుర‌క‌లు అంటిస్తున్నారు. ఉండ‌వ‌ల్లితో డిబేట్ అంటే ఎల్లో చాన‌ళ్ల‌లో కూచొని స‌వాల్ విసిరినంత ఈజీ కాద‌ని హిత‌వు చెబుతున్నారు. 

ఎల్లో చాన‌ళ్ల చ‌ర్చ‌ల్లో అంతా ఏకోప‌న్యాస‌మే అని, యాంక‌ర్ల‌కు, రాజ‌కీయ పార్టీల నాయ‌కుల‌కు తేడా ఏంటో తెలియ‌నంత‌గా విమ‌ర్శ‌లు చేస్తుంటార‌ని, బ‌హిరంగ చ‌ర్చలో అది సాధ్యం కాద‌ని జీవీరెడ్డి గుర్తించుకోవాల‌ని నెటిజ‌న్లు వార్నింగ్ ఇస్తున్నారు.