అబ్బే… నాకు సిగ్గూఎగ్గూ లేవండి!

అన‌గ‌న‌గా ఒక ఎంపీ. ఆయ‌న పేరులోనే రాజు. చేష్ట‌లు మాత్రం ప‌ర‌మ నీచ‌నికృష్ట‌మైన‌వి. త‌ల్లిపాలు తాగి రొమ్ము గుద్దే స్వ‌భావం. టికెట్ ఇచ్చి, గెలిపించి… అత్యున్న‌త చ‌ట్ట స‌భ‌కు పంపిన పార్టీపై గ‌త కొంత…

అన‌గ‌న‌గా ఒక ఎంపీ. ఆయ‌న పేరులోనే రాజు. చేష్ట‌లు మాత్రం ప‌ర‌మ నీచ‌నికృష్ట‌మైన‌వి. త‌ల్లిపాలు తాగి రొమ్ము గుద్దే స్వ‌భావం. టికెట్ ఇచ్చి, గెలిపించి… అత్యున్న‌త చ‌ట్ట స‌భ‌కు పంపిన పార్టీపై గ‌త కొంత కాలంగా విషం చిమ్ముతున్నాడు. విషం అనే ప‌దం కంటే తీవ్ర‌మైన‌ది ఏదైనా వుందంటే దానికి ఆయ‌న పేరు పెట్టొచ్చు. అందుకు ఆయ‌న అన్ని విధాలా అర్హుడు మ‌రి!

త‌న పార్టీకి చెందిన ముఖ్య‌మంత్రి, ఇత‌ర ప్ర‌భుత్వ‌, పార్టీ పెద్ద‌ల‌పై ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని కులం, మ‌తం పేరుతో విద్వేష‌పూరిత విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అవి కాస్త హ‌ద్దులు దాట‌డంతో నేర ప‌రిశోధ‌క విభాగం అధికారులు జోక్యం చేసుకోవ‌ల‌సి వ‌చ్చింది. ఒక శుభ‌సాయంత్రాన ఆయ‌న్ను తీసుకెళ్లి చ‌క్క‌గా ఒక గ‌దిలో స‌త్క‌రించారు. స‌త్కారానికి మెచ్చి ఆయ‌న అబ్బా, అమ్మా అంటూ ఆనందంలో వేసిన కేక‌లకు దిక్కుల‌న్నీ మార్మోగాయి. స‌ద‌రు విభాగం స‌త్కారానికి తీపి గుర్తులు ఇప్ప‌టికీ ఆయ‌న హృద‌యంలో నిలిచిపోయాయి.

తన‌ను కాళ్ల‌తో, చేత‌ల‌తో ఏ విధంగా స‌న్మానించారో, ఆ సంద‌ర్భంలో త‌న ఫీలింగ్స్ ఏంటో భావోద్వేగంగా వ‌ర్ణిస్తూ వుంటారు. ఇటీవ‌ల స‌ద‌రు రాజు గారు కొత్త ప‌ల్ల‌వి అందుకున్నారు. త‌న‌పై అన‌ర్హ‌త వేటు వేయించాల‌ని, లేదంటే రాజీనామా చేసి తాడోపేడో తేల్చుకుంటాన‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లికారు. రాజుగారిలో పౌరుషం పొంగుకొచ్చిందే, ఈ సారి గ‌ట్టిగానే త‌గిలేలా ఉన్నారే అని అంద‌రూ భావించారు.

దీంతో మ‌రోసారి ఉప ఎన్నిక జ‌రుగుతుంద‌నే భావ‌న‌తో స‌ర్వేలు కూడా మొద‌ల‌య్యాయి. త‌న‌కు తానుగానే 2 ల‌క్ష‌ల‌కు పైగా మెజార్టీతో త‌న పార్టీనే మ‌ట్టి క‌రిపిస్తాన‌ని గొప్ప‌ల‌కు పోయారు. ఎన్నికైన మొద‌లు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల మొహాలే చూడ‌ని, ఈ ముఖాన్ని మ‌ళ్లీ ఎలా ఎన్నుకుంటార‌నే అమాయ‌క ప్ర‌శ్న‌లు వేయ‌కూడ‌దు. రాజుగారి గ‌డువు కాస్త ముగిసింది. ఈ లోపు సోష‌ల్ మీడియా ఆయ‌న‌కు స‌వాల్‌ను, రాజీనామా డెడ్‌లైన్‌ను గుర్తు చేసింది.

దీంతో ఆయ‌న మీడియా ముందుకొచ్చారు. అబ్బే… నేను అలా అన‌లేదంటూ త‌న‌కు అల‌వాటైన యూట‌ర్న్ తీసుకున్నారు. త‌న‌కు ఏ మాత్రం సిగ్గూఎగ్గూ లేవ‌ని చాటుకున్నారు. అన‌ర్హ‌త వేటుకు కొత్త డెడ్‌లైన్‌ను పెట్టారు. ఈ నెల 5వ తేదీన రాజీనామా చేస్తాన‌ని అన‌లేద‌ని ఆయ‌న బుకాయించారు. త‌న‌పై అన‌ర్హ‌త వేటుకు ఈ నెల 11వ తేదీ వ‌ర‌కు స‌మ‌యం ఇచ్చాన‌ని, వారికి అది సాధ్య‌ప‌డ‌లేద‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఇంకా ఆయ‌న ఏమ‌న్నారంటే…

స‌రైన స‌మ‌యంలో రాజీనామా చేయ‌డంపై నిర్ణ‌యం తీసుకుంటాన‌న్నారు. ఇక నా వ‌ల్ల కాదు, నువ్వే రాజీనామా చేయ్ అని త‌మ పార్టీ అధినేత చెబితే అప్పుడే రాజీనామా చేస్తా అని మెలిక పెట్టారు. ఇలాంటివి సిగ్గుశ‌రం లేని వాళ్లు మాత్ర‌మే మాట్లాడ్తార‌ని క‌థ‌లోని నీతి. ఈ క‌థ చ‌దువుతుంటే, లేదా వింటుంటే వ‌ర్త‌మాన రాజ‌కీయాల్లో ఏ రాజ‌కీయ నాయకుడైనా గుర్తు రావ‌చ్చు. 

ఎందుకంటే క‌థ‌లు స‌మాజం నుంచే పుడుతాయి. బ‌హుశా ఈ క‌థ కూడా అలాంటిదే కావ‌చ్చు. ఏ మాత్రం నైతిక‌త‌, విలువ‌లు లేని వాళ్లు ప్ర‌జాప్ర‌తినిధులై మ‌న నెత్తిన కూచుంటే అంత‌కంటే హింస ఏముంటుంది? ఇలాంటి వాళ్ల‌ను ఎన్నుకున్న ప్ర‌జ‌లు ఎంత‌గా ఆవేద‌న చెందుతుంటారో వ‌ర్ణ‌నాతీతం.