వీళ్లు కలవరు..కలిసిన వాళ్లపై బాధ

మాంచి మెజారిటీతో మా అధ్యక్షుడిగా గెలుపొందారు మంచు విష్ణు. ఇలా గెలిస్తే అలా బిల్డింగ్ మొత్తం తన స్వంత డబ్బుతో కడతా అన్నది ఆయన ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ పోల్ ప్రామిస్. కానీ…

మాంచి మెజారిటీతో మా అధ్యక్షుడిగా గెలుపొందారు మంచు విష్ణు. ఇలా గెలిస్తే అలా బిల్డింగ్ మొత్తం తన స్వంత డబ్బుతో కడతా అన్నది ఆయన ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ పోల్ ప్రామిస్. కానీ అది ఆయన పక్కన పెట్టేసారు అని టాలీవుడ్ మొత్తం బాహాటంగానే గుసగుసలాడుతోంది.అది వేరే విషయం.

ఇదిలా వుంటే స్వంత బావ అయినా సరే, మంచు విష్ణు వెళ్లి జగన్ ను కలవలేకపోయారు. కలిసి వుంటే ఈ పాటికి ఫొటోలు వదిలి బోలెడంత హడావుడి చేసేవారు. అలా జరగలేదు అంటే కలవలేదు అనేగా అనుకోవాలి. సరే, ఈయన కలవలేదు. లేదా కలిసే ప్రయత్నం చేయలేదు. ఏదో విధంగా కలిసిన మెగాస్టార్ చిరంజీవిపై ఎందుకు మళ్లీ కామెంట్లు?

ఇండస్ట్రీకి ఎవరో ఒకరు వారి వ్యక్తిగత స్థాయిలో కావచ్చు, మరే విధంగానైనా కావచ్చు, ఎంతో కొంత సాధిస్తే మంచిదేగా? గతంలో టికెట్ రేట్లు వస్తాయి అని వినిపించినపుడు మోహన్ బాబు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. ఈసారి మళ్లీ టికెట్ రేట్లు వస్తాయి అని వినిపిస్తుంటే విష్ణు కామెంట్లు విసిరారు.

ఏదో ఒకటి జరిగుతుంటే సరే అంతా మంచికేగా అని చూస్తూ వుండాలి కానీ, ఇది వ్యక్తిగతం, ఆ బాడీ వుంది. ఈ కమిటీ వుందని అనడం ఎందుకు? మరి అలాంటి ఉద్దేశం వుంటే గిల్డ్ అనే ప్రయివేటు బాడీ వచ్చినపుడే బాహాటంగా ఖండించవచ్చు కదా? గిల్డ్ అనే ప్రయివేటు బాడీని సురేష్ బాబుతో సహా అందరూ యాక్సెప్ట్ చేసినపుడు ఇక కమిటీలు, బాడీలు వీటి ప్రస్తావన ఎందుకు?

నిజానికి మంచువిష్ణు చేయాల్సింది ఇది కాదు. తనకు జగన్ మోహన్ రెడ్డితో వున్న సాన్నిహిత్యాన్ని, బంధుత్వాన్ని వాడి ఇండస్ట్రీ కోసం మాంచి రేట్లు తీసుకురావాలి. ఇది వ్యక్తిగతం అని ఎవ్వరూ కామెంట్ చేయరు. మంచి చేసారని మెచ్చుకుంటారు. అలా కాకుండా వేరే విధంగా కామెంట్లు చేయడం ద్వారా మెగాక్యాంప్ తో వైరం వుందనే అనుమానాలకు మరింత బలం చేకూర్చడం అవుతుంది తప్ప వేరు కాదు. 

ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ మళ్లీ కోలుకుంటోంది. రేట్లు వచ్చేస్తే మూడు సినిమాలు ఆరు విడుదలలు అన్నట్లు వుంటుంది. పెద్ద హీరోల సినిమాలు అన్నీ పాన్ ఇండియా లెవెల్ లో తయారవుతున్నాయి. మిగిలిన సినిమాలు విడుదలకు ముందే మూడు వంతులు బ్రేక్ ఈవెన్ అవుతున్నాయి. ఇలాంటి మంచి సిచ్యువేషన్ కు మరింత సాయం చేయాలని కానీ బ్రేక్ లు వేయకూడదు.