సచివాలయం మహిళా పోలీస్ లను ప్రత్యేక జీవో ప్రకారం డిపార్ట్ మెంట్ లో చేర్చుకోవడమే కాకుండా, వారికి యూనిఫామ్ కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. రాష్ట్రవ్యాప్తంగా మహిళా పోలీసులకు ఖాకీ యూనిఫామ్ ఇవ్వబోతున్నారు. ఇందుకు సంబంధించి వారికి యూనిఫామ్ కుట్టించేందుకు ప్రభుత్వమే ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లాలో మాత్రం ఇలా యూనిఫామ్ కోసం కొలతలు ఇవ్వాలంటూ మహిళా పోలీసులకు డిపార్ట్ మెంట్ కబురు పంపించింది. ప్రస్తుతం రెండు డివిజన్లకు చెందిన మహిళా పోలీసులు కొలతలు ఇచ్చేందుకు నెల్లూరు నగరంలోని పోలీస్ కార్యాలయానికి చేరుకున్నారు.
అయితే అక్కడ కొలతలు తీసుకోడానికి మగ టైలర్లు, చేతిలో టేపు పట్టుకొని రెడీగా ఉండడం చూసి షాకయ్యారు. కొలతలు తీసుకునే సమయంలో ఆడవాళ్లు ఇబ్బంది పడ్డారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మహిళల యూనిఫామ్ కొలతలు తీసుకోడానికి పురుషుల్ని ఎలా వినియోగిస్తారంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కామెంట్లు పడ్డాయి. ఉన్నతాధికారులు కూడా సీరియస్ కావడంతో జిల్లా ఎస్పీ వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు.
యూనిఫామ్ కొలతల వ్యవహారానికి ఓ హెడ్ కానిస్టేబుల్ ని బాధ్యుడిగా చేస్తూ అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక జెంట్ టైలర్స్ ని పంపించేసి, లేడీ టైలర్స్ ని సిబ్బందిని అక్కడ ఉంచి, వారితోనే కొలతలు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. అయితే అప్పటికే ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా వైరల్ గా మారింది. నెల్లూరు పోలీసుల తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు.
టీడీపీ రాజకీయం..
మహిళల యూనిఫామ్ కొలతలకు పురుషులను వినియోగించడం తప్పే. అయితే వెంటనే ఆ తప్పుని స్థానిక పోలీసులు దిద్దుకున్నారు. వివరణ ఇచ్చారు, మహిళా సిబ్బందినే అక్కడికి పంపించారు. అయితే అంతలోనే టీడీపీ ఈ వ్యవహారానికి రాజకీయ రంగు పులిమింది. మహిళల యూనిఫామ్ కొలతలు తీసే దగ్గర పురుషుల్ని ఎలా అనుమతిస్తారంటూ టీడీపీ మహిళా నాయకులు రెచ్చిపోయారు. నేరుగా జగన్ ని సీన్ లోకి తెచ్చారు. జగన్ పాలనలో మహిళా కానిస్టేబుళ్లకే రక్షణ లేదని, ఇక మహిళలకు రక్షణ ఎక్కడినుంచి వస్తుందని అన్నారు.
అసలీ విషయంలో జగన్ తప్పు ఏమైనా ఉందా..? మహిళల స్వావలంబనకు మహిళా పోలీసుల్ని నియమించడమే తప్పా..? వారిని పోలీస్ డిపార్ట్ మెంట్లో విలీనం చేసుకునే విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని జీవో విడుదల చేయడమే తప్పా..? లేక యూనిఫామ్ ఇవ్వాలనుకోవడం తప్పా..? స్థానికంగా కొలతలు తీసుకునే విషయంలో పోలీసులు చేసిన తప్పుకి జగన్ ని బాధ్యుడిగా చేయాలని చూస్తున్నారు టీడీపీ నేతలు. బోడిగుండుకి, మోకాలికి ముడేస్తామంటున్నారు.
దృష్టి పెట్టిన మహిళా కమిషన్
మరోవైపు ఈ మొత్తం వ్యవహారంపై మహిళా కమిషన్ దృష్టిపెట్టింది. పురుష టైలర్ తో మహిళా పోలీస్ యూనిఫామ్ కొలతలు తియ్యడంపై మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, నెల్లూరు ఎస్పీ తో మాట్లాడారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటామని, నెల్లూరు ఎస్పీ, మహిళా కమిషన్ కు హామీ ఇచ్చారు.