రిలేష‌న్ షిప్ లో గిఫ్టింగ్ ఇంపార్టెన్స్ ఎంతో!

బ‌హుమ‌తులు… తీసుకోవ‌డం చాలా మందికి ఇష్ట‌మే కావొచ్చు. ఇవ్వ‌డం ఇష్టం లేక‌పోవ‌చ్చు. మ‌రి కొంద‌రు తీసుకోవ‌డాన్ని కానీ, ఇవ్వ‌డాన్ని కానీ పెద్ద సీరియ‌స్ గా తీసుకోరు. తాము వాటికి అతీతం అనే భావ‌న వీరిలో…

బ‌హుమ‌తులు… తీసుకోవ‌డం చాలా మందికి ఇష్ట‌మే కావొచ్చు. ఇవ్వ‌డం ఇష్టం లేక‌పోవ‌చ్చు. మ‌రి కొంద‌రు తీసుకోవ‌డాన్ని కానీ, ఇవ్వ‌డాన్ని కానీ పెద్ద సీరియ‌స్ గా తీసుకోరు. తాము వాటికి అతీతం అనే భావ‌న వీరిలో పెంపొంది ఉంటుంది. గిఫ్ట్ లు ఇవ్వ‌డం, తీసుకోవ‌డం ఈ రెండూ వీరికి ఇబ్బందిక‌ర‌మైన అంశాలే. ఈ త‌ర‌హా మ‌న‌స్త‌త్వం కొంద‌రిలో పెంపొంది ఉంటుంది. 

ఇవ్వగ‌లిగే శ‌క్తి ఉన్నా కూడా ఈ అంశాన్ని వీరు లైట్ తీసుకుంటారు. బ‌య‌ట‌వాళ్ల విష‌యంలో ఇలా వ్య‌వ‌హ‌రిస్తే ఓకేనేమో కానీ, ఒక బంధంలో ఉన్నాకా మాత్రం గిఫ్టింగ్ చాలా కీల‌క‌మైన అంశం! త‌ప్ప‌నిస‌రిగా గిఫ్ట్ లు ఇవ్వాల్సిందే అంటూ తీర్మానించ‌లేం కానీ, బ‌హ‌మతులు మ‌నుషుల‌ను క‌ట్టిప‌డేసే అస్త్రాల్లో ఒక‌ట‌ని మాత్రం గుర్తుంచుకోవాలి.

త్వ‌ర‌లోనే వేలైంటెయిన్స్ డే ఉంది. జ‌నాల్లో ఈ రోజు ప‌ట్ల రెండు ర‌కాల ధోర‌ణులు క‌నిపిస్తాయి. అందులో ఒక‌టి పాజిటివ్, మ‌రోటి నెగిటివ్. ఇలాంటి దినోత్స‌వాల‌న్నీ కేవ‌లం మార్కెటింగ్ గిమ్మిక్స్ అని, కేవ‌లం వ్యాపారాల కోసం వీటిని హైలెట్ చేస్తార‌నే అభిప్రాయం కూడా గ‌ట్టిగా ఏర్ప‌డింది. దీంతో ఈ సంద‌ర్భాన్ని గిఫ్ట్ తో ప్రేమ ప్ర‌క‌ట‌న‌కు ఉప‌యోగించుకోవాల‌ని భావించని వారూ ఉంటారు!

ఇదే కాదు.. మామూలుగానే గిఫ్ట్ ఇవ్వ‌డం, ప్ర‌త్యేకంగా సంద‌ర్భాన్ని అలా సెల‌బ్రేట్ చేయ‌డం చాలా మందికి ఇష్టం ఉండ‌ని అంశం. కానీ.. ఒక్క‌సారి అలా ప్ర‌త్యేక సంద‌ర్భాన్ని గిఫ్ట్ తో సెల‌బ్రేట్ చేస్తే మాత్రం ఆ సంద‌ర్భం అవ‌త‌ల వారికి శాశ్వ‌తంగా గుర్తు ఉండిపోతుంది.

చిన్న‌దో పెద్ద‌దో.. గిఫ్ట్ గా మాత్రం గుర్తుండిపోతుంది. ఈ గిఫ్టింగ్ అంతా పాశ్చాత్య సంస్కృతి అనుకుంటాం. కానీ.. ఏ సంస్కృతిలో అయినా మ‌న‌సుపై ముద్ర వేయ‌గ‌ల శ‌క్తి గిఫ్ట్ గా ఉండ‌నే ఉంటుంది. 

మా ఆయ‌న పెళ్లి రోజుకు ఇచ్చిన గిఫ్ట్ ఇది, మా ఆవిడ ప్ర‌జెంటేష‌న్ ఇది.. అంటూ ప‌క్క‌వారికి చెప్పుకోవ‌డంలో కూడా ఒక ర‌క‌మైన గ‌ర్వం ఉండ‌నే ఉంటుంది. చాలా మంది త‌మ పార్ట్ న‌ర్ కోసం త‌మ సంపాద‌న నుంచి చాలా మొత్తం ఖ‌ర్చు పెడుతూ ఉంటారు. గోల్డ్ తీసివ్వ‌డం, శారీలు తీసివ్వ‌డం.. ప్ర‌తి దాంప‌త్యంలోనూ జ‌రిగే ప‌నే. మ‌రి ఇదే తీసివ్వ‌డ‌మే ఒక ప్ర‌త్యేక సంద‌ర్భంలో జ‌రిగితే, అదొక గిఫ్ట్ అన్న‌ట్టుగా బిల్డ‌ప్ ఇస్తే మాత్రం దాని ప్ర‌భావం మ‌రింతగా పెరుగుతుంది. ఊరికే అలా బ‌య‌ట‌కు వెళ్లిపోయి షాపింగ్ చేసి కొనేసి ఇస్తే.. అది జ‌స్ట్ షాపింగ్. అదే ప్ర‌త్యేక సంద‌ర్భంలో ప్ర‌త్యేకంగా ఇస్తే మాత్రం అది గిఫ్ట్ అయిపోతుంది. దాని ప్ర‌భావం పెరుగుతుంది!

ఇక ప్రేమ‌లో ఉన్న వారికి మాత్రం ఇది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేని అంశం. ప్రేమ‌లో ఉన్నాం కాబ‌ట్టి.. ల‌వ‌ర్ ను అడుగ‌డుగునా ఆక‌ట్టుకోవాల‌నే భావ‌న అనునిత్యం ఉంటుంది. కాబ‌ట్టి.. ల‌వ్ లో గిఫ్ట్ లు ఇచ్చిపుచ్చుకోవ‌డాలు త‌ర‌చూ జ‌ర‌గ‌వ‌చ్చు. 

ఇక వివాహ‌బంధం లో ర‌క‌ర‌కాల సంద‌ర్భాల‌ను గిఫ్ట్ తో ప్ర‌త్యేకంగా మార్చ‌వ‌చ్చు. గ్రాట్యిట్యూడ్ ను చాటుకోవ‌డానికి, ఏదైనా సారీ చెప్ప‌డానికి కూడా గిఫ్ట్ ల‌ను తెలివిగా ఉప‌యోగించుకోవ‌చ్చు. గిఫ్ట్ ఎమోష‌న్స్ ను క్యారీ చేయ‌గ‌ల సాధ‌నం అని మాత్రం గుర్తుంచుకోవాలి!