లోకేశ్ పాద‌యాత్ర‌లో త‌మ్ముళ్ల డిష్యుం డిష్యుం

లోకేశ్ పాద‌యాత్ర‌లో తెలుగుదేశం కార్య‌క‌ర్తలు ర‌క్త గాయాలు అయ్యేలా కొట్టుకున్నారు. ఇందుకు క‌ర్నూలు జిల్లా మంత్రాల‌యం నియోజ‌క వ‌ర్గం వేదికైంది. యువగళం పాదయాత్రలో భాగంగా 80వ రోజు కర్నూలు జిల్లాలో సాగింది. ఆదోని మండలం…

లోకేశ్ పాద‌యాత్ర‌లో తెలుగుదేశం కార్య‌క‌ర్తలు ర‌క్త గాయాలు అయ్యేలా కొట్టుకున్నారు. ఇందుకు క‌ర్నూలు జిల్లా మంత్రాల‌యం నియోజ‌క వ‌ర్గం వేదికైంది. యువగళం పాదయాత్రలో భాగంగా 80వ రోజు కర్నూలు జిల్లాలో సాగింది. ఆదోని మండలం పెద్దతుంబళం విడిది కేంద్రం నుంచి మంత్రాలయం నియోజకవర్గంలోకి అడుగుపెట్టారు. కోసిగి రేణుకా ఎల్లమ్మ ఆలయ మైదానంలో  బహిరంగ సభ నిర్వ‌హించారు.

అంత‌కు ముందు లోకేశ్‌కు మంత్రాల‌యం టీడీపీ ఇన్‌చార్జ్ పాల‌కుర్తి తిక్కారెడ్డి, ఆ పార్టీ బీసీ నేత ఉల్లిగ‌య్య వ‌ర్గాలు వేర్వేరుగా స్వాగ‌తం ప‌లికాయి. సాయంత్రం నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ వ‌ద్ద‌కు ఉల్లిగ‌య్య వ‌ర్గీయుల‌ను అనుమ‌తించ‌లేదు. దీంతో ఉల్లిగ‌య్య కుమారుడు సురేష్‌నాయుడు త‌న అనుచ‌రుల‌తో క‌లిసి తిక్కారెడ్డికి వ్య‌తిరేకంగా నినాదాలు చేయించారు. టీడీపీ నేత‌లు వారించారు.  

మ‌రోవైపు తిక్కారెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాల‌ని టీడీపీ జిల్లా అధ్య‌క్షుడు సోమిశెట్టి వెంక‌టేశ్వ‌ర్లు పిలుపుఇచ్చారు. ఈ వ్యాఖ్య‌లే ర‌గ‌డ‌కు దారి తీశాయి. బ‌హిరంగ స‌భ అనంత‌రం తిక్కారెడ్డి, ఉల్లిగ‌య్య వ‌ర్గాలు ప‌ర‌స్ప‌రం రాళ్ల దాడికి పాల్ప‌డ్డాయి. ఈ ఘ‌ట‌న‌లో ప‌లువురు టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు గాయాల‌య్యాయి. 

ఇరు వ‌ర్గాల వారు ప‌ర‌స్ప‌రం రాళ్లు, క‌ర్ర‌ల‌తో దాడు చేసుకోవ‌డంతో అక్క‌డ భీతావ‌హ దృశ్యం చోటు చేసుకుంది. స్థానికులు, స‌భ‌కు వ‌చ్చిన కార్య‌క‌ర్త‌లు భ‌యంతో ప‌రుగులు తీశారు. చివ‌రికి పోలీసులు రంగ ప్ర‌వేశం చేసి రెండు వ‌ర్గాల‌ను చెద‌ర‌గొట్టారు. మంత్రాల‌యం టీడీపీలో వ‌ర్గ విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఈ ఘ‌ట‌నే నిద‌ర్శ‌నం.