అప్పొచ్చింది…బ‌ట‌న్ నొక్కే వేళైంది!

సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయ‌డంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి మ‌రే స‌ర్కార్ సాటి రాదు. న‌వ‌ర‌త్నాల పేరుతో గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు భారీ సంక్షేమ ప‌థ‌కాల‌తో కూడిన మ్యానిఫెస్టోను జ‌గ‌న్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.…

సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయ‌డంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి మ‌రే స‌ర్కార్ సాటి రాదు. న‌వ‌ర‌త్నాల పేరుతో గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు భారీ సంక్షేమ ప‌థ‌కాల‌తో కూడిన మ్యానిఫెస్టోను జ‌గ‌న్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. క‌రోనాతో ఆర్థిక ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారిన‌ప్ప‌టికీ సంక్షేమ ప‌థ‌కాల అమ‌ల్లో మాత్రం ఏపీ స‌ర్కార్ రాజీ ప‌డ‌లేదు. ఇదే కొన్ని వ‌ర్గాల్లో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త పెంచ‌డానికి కార‌ణ‌మైంది.

చివ‌రికి ప్ర‌భుత్వం ఉద్యోగుల‌కు జీతాలు ఎప్పుడిస్తారో ఇప్ప‌టికే తెలియ‌ని ప‌రిస్థితి. మ‌రోవైపు మూడున్న‌రేళ్ల పాటు బ‌ట‌న్ నొక్క‌డం త‌ప్ప‌, మ‌రెలాంటి అభివృద్ధి ప‌థ‌కాల‌కు నోచుకోలేద‌నే విమ‌ర్శ బ‌లంగా వుంది. ఈ నేప‌థ్యంలో మొద‌టిసారి నిధులు లేక‌పోవ‌డంతో  షెడ్యూల్ ప్ర‌కారం సంక్షేమ ప‌థ‌కం ల‌బ్ధిదారుల‌కు డ‌బ్బు వేయ‌లేని ప‌రిస్థితి. తాజాగా అప్పు పుట్ట‌డంతో ఎట్ట‌కేల‌కు ప‌ది రోజుల ఆల‌స్యంగా జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన ల‌బ్ధిదారుల ఖాతాల్లో న‌గ‌దు జ‌మ చేయ‌డానికి ముహూర్తం ఖ‌రారైంది.

ఈ నెల 16న ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా నార్ప‌ల‌లో జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన ప‌థ‌కం ల‌బ్ధిదారుల స‌మావేశం నిర్వ‌హించాల్సి వుండింది. అయితే ఖ‌జానాలో నిధులు నిండుకోవ‌డంతో వాయిదా వేయాల్సి వ‌చ్చింద‌ని స్వ‌యంగా చీఫ్ సెక్ర‌ట‌రీ జ‌వ‌హ‌ర్‌రెడ్డి ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా రాష్ట్ర ప్ర‌భుత్వానికి రూ.3 వేల అప్పు పుట్టింది. దీంతో ఇవాళ నార్ప‌ల‌లో జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెనకు సంబంధించి స‌భ నిర్వ‌హిస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్థుల‌కు 912.71 కోట్లు మొత్తాన్ని సీఎం జ‌గ‌న్ బ‌ట‌న్ నొక్కి జ‌మ చేయ‌నున్నారు. ప్ర‌తి ఏటా రెండు విడ‌త‌ల్లో ఉన్న‌త చ‌దువులు చ‌దివే పేద విద్యార్థులు  భోజ‌న , వ‌స‌తి ఖ‌ర్చుల కోసం ప్ర‌భుత్వం జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన కింద ఆర్థిక సాయం అంద‌జేస్తోంది. ఐటీఐ విద్యార్థుల‌కు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థుల‌కు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజ‌నీరింగ్‌, మెడిసిన్ త‌దిత‌ర కోర్సులు చ‌దివే విద్యార్థుల‌కు రూ.20 వేలు చొప్పున ఆర్థిక సాయం అంద‌జేస్తోంది. 

జ‌గ‌న్ పాల‌న‌కు ఇక ఏడాది మాత్ర‌మే గ‌డువు వుంది. ఇంత వ‌ర‌కూ సంక్షేమ ప‌థ‌కాల‌కు ఎలాంటి అడ్డంకులు లేకుండా నెట్టుకొచ్చారు. ఇప్పుడు కాస్త త‌డ‌బాటు క‌నిపిస్తోంది. ఈ ఇబ్బంది తాత్కాలిక‌మే అయితే జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఇబ్బంది లేదు. లేదంటే ఇంత‌కాలం చేసిన మంచి అంతా వృథానే.