ఉపాధ్యాయుల‌ అత్యాశ‌…స‌మాజ స్పంద‌న‌!

ఉద్యోగుల స‌మ్మెకు ఫుల్‌స్టాప్ ప‌డింద‌ని అనుకుంటున్న త‌రుణంలో ఉపాధ్యాయులు షాక్ ఇచ్చారు. ప్ర‌భుత్వంతో పీఆర్సీ సాధ‌న స‌మితి చేసుకున్న ఒప్పందం త‌మ‌కు అంగీకారం కాద‌ని, డిమాండ్లు సాధించుకునేందుకు తాము ప్ర‌త్యేకంగా పోరాడుతామ‌ని ఉపాధ్యాయ సంఘాలు…

ఉద్యోగుల స‌మ్మెకు ఫుల్‌స్టాప్ ప‌డింద‌ని అనుకుంటున్న త‌రుణంలో ఉపాధ్యాయులు షాక్ ఇచ్చారు. ప్ర‌భుత్వంతో పీఆర్సీ సాధ‌న స‌మితి చేసుకున్న ఒప్పందం త‌మ‌కు అంగీకారం కాద‌ని, డిమాండ్లు సాధించుకునేందుకు తాము ప్ర‌త్యేకంగా పోరాడుతామ‌ని ఉపాధ్యాయ సంఘాలు ప్ర‌క‌టించి ట్విస్ట్ ఇచ్చాయి. ఇందుకు ప్ర‌త్యేక జేఏసీ కూడా ఏర్పాటు చేస్తున్న‌ట్టు కొన్ని ఉపాధ్యాయ సంఘాలు ప్ర‌క‌టించాయి. ఉపాధ్యాయుల‌కు సెల‌వులు ఎక్కువై, ప‌ని త‌క్కువ కావ‌డం వ‌ల్లే రాష్ట్ర సంప‌దంతా తమ‌కే ఇవ్వాల‌నే రీతిలో ఉద్య‌మానికి తెగ‌బ‌డుతున్నార‌నే తీవ్ర విమ‌ర్శ‌లు పౌర స‌మాజం నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఉపాధ్యాయుల పోరాట ప్ర‌క‌ట‌న‌పై పౌర స‌మాజంతో పాటు సోష‌ల్ మీడియా నుంచి భారీ వ్య‌తిరేక‌త వ‌స్తోంది.

ఉపాధ్యాయుల ఉద్య‌మంపై సెటైర్స్ పేలుతున్నాయి. ప్ర‌భుత్వ ఉద్యోగులెవ‌రికీ లేని అభ్యంత‌రం, ఇబ్బంది ఒక్క ఉపాధ్యాయ వ‌ర్గానికే ఎందుకనే నిల‌దీత‌లు ఎదుర‌వుతున్నాయి. పీఆర్సీ సాధ‌న స‌మితి నేత‌లు, మంత్రి వ‌ర్గ ఉప‌సంఘం మ‌ధ్య అనేక ద‌ఫాలుగా జ‌రిగిన చ‌ర్చ‌లు చివ‌రికి కొలిక్కి వ‌చ్చాయి. ఇరువైపులా ప‌ట్టువిడుపుల‌తో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డంతో సానుకూల ఫ‌లితాలు వ‌చ్చాయి.

ప్రత్యేక జీవో ద్వారా త్వరలో పీఆర్సీ నివేదిక విడుదల, గతంలో ప్రకటించిన విధంగా ఫిట్‌మెంట్‌ 23 శాతం కొనసాగింపు, 50 వేల లోపు జనాభా ఉంటే రూ.11 వేల సీలింగ్‌తో 10 శాతం హెచ్‌ఆర్‌ఏ,  50 వేల నుంచి 2 లక్షల జనాభా ఉంటే రూ.13 వేల సీలింగ్‌తో 12 శాతం హెచ్‌ఆర్‌ఏ, 2 లక్షల నుంచి 50 లక్షల జనాభా ఉంటే రూ.17 వేల సీలింగ్‌తో 16 శాతం హెచ్‌ఆర్‌ఏ, 50 లక్షలకు పైబడి జనాభా ఉంటే రూ.25 వేల సీలింగ్‌తో 24 శాతం హెచ్‌ఆర్‌ఏ, సచివాలయం, హెచ్‌ఓడీ కార్యాలయాల్లో 2024 జూన్‌ వరకు 24 శాతం హెచ్‌ఆర్‌ఏ, రిటైర్డ్‌ ఉద్యోగుల అదనపు క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ 70–74 ఏళ్ల వారికి 7 శాతం, 75–79 ఏళ్ల వారికి 12 శాతం,  వేతన సవరణ పరిమితి ప‌దేళ్ల‌కు బ‌దులు ఐదేళ్లు, అంత్యక్రియల ఖర్చు రూ.25 వేలు, పాత పద్ధతి ప్రకారం సీసీఏ కొనసాగింపు తదిత‌ర సానుకూల నిర్ణ‌యాలు తీసుకునేందుకు ప్ర‌భుత్వం దిగి వ‌చ్చింది.

ఒక్క ఫిట్‌మెంట్ మాత్ర‌మే 23 శాతానికి మించి పెంచేందుకు ప్ర‌భుత్వం ససేమిరా అంది. ప్ర‌ధానంగా ఉద్యోగుల ఆందోళ‌న హెచ్ఆర్ఏ, ప‌దేళ్ల‌కు వేత‌న స‌వ‌ర‌ణ‌, రిటైర్డ్ ఉద్యోగుల అద‌న‌పు క్వాంట‌మ్ ఆఫ్ పెన్ష‌న్ త‌దిత‌ర విష‌యాల‌పై ఉండింది. ఈ విష‌యాల్లో ఉద్యోగుల ఆందోళ‌నకు ఆస్కారం లేకుండా ప్ర‌భుత్వం సానుకూల నిర్ణ‌యాలే తీసుకుంది. ఉదాహ‌ర‌ణ‌కు తిరుప‌తి జ‌నాభా 4 ల‌క్ష‌ల నుంచి 5 ల‌క్ష‌ల లోపు వుంటుంది. ఆధ్మాత్మిక క్షేత్ర‌మైన తిరుప‌తిలో ఉన్న ఉద్యోగుల‌కు  రూ.17 వేల సీలింగ్ విధిస్తే న‌ష్టం ఏంటి? అంత‌కంటే రూమ్ రెంట్ ఎక్కువేమీ కాదు. మ‌రి ఉపాధ్యాయుల బాధ ఏంటి? మిగిలిన ఉద్యోగుల కంటే త‌మ‌కు అన్నీ ఎక్కువే కావాల‌ని ఉపాధ్యాయులు ప‌ట్టుద‌ల‌కు పోవ‌డంలో ఉద్దేశం ఏంటి?  

క‌నీసం తాము ప‌నిచేస్తున్న స‌మ‌యానికి, తీసుకుంటున్న జీతానికి న్యాయం చేస్తున్నామా? అని ఉపాధ్యాయులు ఒక్క‌సారైనా ఆత్మ ప‌రిశీల‌న చేసుకున్నారా? జ‌నానికి ఉపాధ్యాయులు జ‌వాబుదారీగా ఉండ‌డం ఎప్పుడో మ‌రిచారు. క‌నీసం త‌మ అంత రాత్మ‌కైనా స‌మాధానం చెప్పుకోవాల‌న్న ఆలోచ‌న ఉపాధ్యాయులకు వ‌స్తోందా? తాము ఎంత మంది పిల్ల‌ల్ని ఉన్న‌త విద్యావంతులుగా తీర్చిదిద్దారో ఉపాధ్యాయులు చెప్ప‌గ‌ల‌రా? త‌మ పాఠ‌శాల‌ల్లో ఉత్తీర్ణ‌త‌, ఉపాధ్యాయులు తీసుకుంటున్న మొత్తం వేత‌నాలు ఏ పాటివో వివ‌రిస్తారా?

ఏడాదికి 220-225 రోజులు ప‌ని చేయాల‌నేది ప్ర‌భుత్వ నిబంధ‌న‌. ఈ ఏడాది క‌రోనా వ‌ల్ల ఆల‌స్యంగా విద్యా సంస్థ‌లు ప్రారంభించారు. దీంతో ఈ అక‌డ‌మిక్ ఏడాది 180 రోజులు ప‌నిదినాలుగా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. అంటే ఏడాదిలో స‌గానికి పైగా సెల‌వులే అన్న‌మాట‌. ఇక మొద‌టి క‌రోనా స‌మ‌యంలో పూర్తిగా సెల‌వుల్లోనే గ‌డుపుతూ ఇంటి ప‌ట్టునే ఉన్నా పూర్తిస్థాయిలో జీతాలు తీసుకున్న ఘ‌న‌త ఒక్క ఉపాధ్యాయుల‌దే. మిగిలిన ఉద్యోగుల విష‌యం అలా కాదు. క‌నీసం ఇంటి నుంచో, ఆఫీస్‌కు వెళ్లో విధులు నిర్వ‌ర్తించాల్సి వ‌చ్చింది.

పిల్ల‌ల‌కు ఎంత మంది ఆన్‌లైన్ పాఠాలు చెప్పారో ఉపాధ్యాయుల‌కే తెలియాలి. చివ‌రికి ప‌రీక్ష‌లు లేకుండా విద్యార్థుల‌ను ఉత్తీర్ణులు చేయాల్సి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. బ‌డికెళ్లి విద్యార్థుల‌కు పాఠాలు చెప్పండ‌య్యా అంటే… క‌రోనా సాకు చూపి ప్ర‌తిప‌క్షాల కంటే ఎక్కువ‌గా ప్ర‌భుత్వాల్ని దుమ్మెత్తి పోయ‌డంలో ఉపాధ్యాయులు ముందు వ‌రుసలో ఉన్నారు. ద‌స‌రా, సంక్రాంతి, రెండో శ‌ని వారం, ఆదివారాలు, మిగిలిన పండుగ దినాల్లో సెల‌వులే సెలవులు. మెజార్టీ ఉపాధ్యాయుల ఆలోచ‌న‌ల‌న్నీ పిల్ల‌ల‌కు పాఠాలు చెప్ప‌డం కంటే, ఎప్పుడెప్పుడు సెల‌వులొస్తాయి, లేదంటే తామెప్పుడు తీసుకోవాల‌నే చింతే త‌ప్ప‌, మ‌రో ధ్యాసే వుండ‌దు.

ప్ర‌భుత్వం నుంచి వేలు, ల‌క్ష‌లాది రూపాయ‌లు జీతంగా తీసుకుంటున్న ఉపాధ్యాయులు త‌మ పిల్ల‌ల్ని మాత్రం గుడివాడ‌, విజ‌య‌వాడ‌, గుంటూరు, హైద‌రాబాద్ త‌దిత‌ర ప్రాంతాల్లోని కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల్లో చ‌దివిస్తున్న సంగ‌తి వాస్త‌వం కాదా? ఏడాదిలో క‌నీసం స‌గం రోజులు కూడా ప‌ని చేయ‌ని కార‌ణంగానే మిగిలిన ఉద్యోగుల కంటే త‌మ‌కు అన్నీ ఎక్కువ ఉండాల‌ని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారా? త‌మ పిల్ల‌లు మాత్రం బాగా చ‌దువుకుని ప్ర‌యోజ‌కులు కావాలి, ఊరోళ్ల పిల్ల‌లు మాత్రం చ‌దువు సంధ్య‌ల్లేకుండా గాలికి తిర‌గాల‌నేదే ఉపాధ్యాయుల అంత‌ర్గ‌త భావ‌న అని జ‌నం మండిప‌డుతున్నారు.

ఇదిలా వుండ‌గా మిగిలిన ఉద్యోగుల‌కు ప్ర‌భుత్వ ప్ర‌తిపాద‌న‌ న‌చ్చ‌డానికి, త‌మ‌కు న‌చ్చ‌క‌పోవ‌డానికి స‌హేతుక కార‌ణాలేంటో చెప్పాల్సిన బాధ్య‌త ఉపాధ్యాయుల‌పై ఉంది. ఇప్ప‌టికే ఉపాధ్యాయులంటే కుటుంబ స‌భ్యుల‌పై ఇన్స్యూరెన్స్‌, రియ‌ల్ ఎస్టేట్‌, వ‌డ్డీ, ఇత‌ర‌త్రా వ్యాపారాలు చేసే వ్య‌క్తులుగా పేరొందారు. జ్ఞానం అంటే పాఠాలు అర్థ‌మ‌య్యేలా చెప్ప‌డం కాద‌ని, సంప‌ద‌ను అంత‌కంత పెంచుకోవ‌డం ఎలా అని ఉపాధ్యాయులు త‌మ చేష్ట‌ల ద్వారా కొత్త నిర్వ‌చ‌నం ఇస్తున్నార‌నే విమ‌ర్శ‌లు లేక‌పోలేదు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఉపాధ్యాయులు ఉద్య‌మ బాట ప‌ట్టాల‌ని నిర్ణ‌యించుకోవ‌డం అంటే, ప్ర‌జాభిప్రాయానికి విరుద్ధంగా రోడ్డెక్క‌డ‌మే.

ఉపాధ్యాయుల చ‌ర్య ముమ్మాటికీ బ్లాక్‌మెయిలే అనే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి ఎలా వున్నా త‌మ‌కు సంబంధం లేద‌నే బాధ్య‌తా రాహిత్యం వాళ్ల డిమాండ్ల‌లో క‌నిపిస్తోంది. రాష్ట్ర ప్ర‌జానీకాన్ని ఎండ‌బెట్టి, త‌మ‌కు మాత్రం పంచ‌భ‌క్ష్య ప‌రిమాన్నాలు పెట్టాల‌నే ఉపాధ్యాయుల అత్యాశ చూస్తుంటే వారిపై ఏహ్య భావం క‌లుగుతోంద‌ని తోటి ప్ర‌భుత్వ ఉద్యోగులు అంటున్నారంటే, వారిపై ఎంత‌టి వ్య‌తిరేక‌త ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇప్ప‌టికైనా ఉపాధ్యాయులు త‌మ తీరు మార్చుకోక‌పోతే మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించ‌క త‌ప్ప‌దు.