టాలీవుడ్ హీరోలు తమ సోషల్ మీడియా అక్కౌంట్ల విషయంలో చాలా జాగ్రత్తగా వుంటారు. దానికి తగినట్లు ఖర్చు చేస్తారు. సోషల్ మీడియాలో అల్లు అర్జున్, మహేష్ బాబు చాలా బలంగా వుంటారు. వారికి బలమైన ఫాలోయింగ్ వుంది. పైగా సోషల్ మీడియాలో బలమైన మద్దతు వుండేలా వారి వారి టీమ్ లు వర్క్ చేస్తుంటాయి. ఈ టీమ్ ల కింద వందలాది అక్కౌంట్లు వుంటాయి. అవి నిర్విరామంగా పనిచేస్తుంటాయి. ఇలాంటి నెట్ వర్క్ లేదు కానీ పవన్ కళ్యాణ్ కు, ప్రభాస్ కు బలమైన ఫాలోయింగ్ అయితే వుంది.
ఎన్టీఆర్ కు ఒకప్పుడు ఈ విధమైన ఏర్పాట్లు వుండేవి కానీ ఈ మధ్య వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. సోషల్ మీడియాలో ఒకప్పుడు మ్యూజిక్ డైరక్టర్ థమన్ కు విపరీతంగా వ్యతిరేకత వుండేది. కానీ ఆ తరువాత ఆయన కూడా స్వంత ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పుడు బోలెడు అక్కౌంట్లు ఆయనకు అనుకూలంగా నిత్యం వర్క్ చేస్తుంటాయి.
ఈ విషయంలో మిగిలిన వారి కన్నా బన్నీ కాస్త ఎక్కువ ఖర్చు చేస్తుంటారు అని టాక్. ఆయనకు అన్ని భాషల్లోనూ పీఆర్ టీమ్ లు వున్నాయి. ఇటీవల మన హీరోలు పాన్ ఇండియా ఇమేజ్ కోసం తహతహ లాడుతున్నారు. ఆ మేరకు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. ఇన్నాళ్లూ సోషల్ మీడియా అక్కౌంట్ల విషయంలో పెద్దగా పట్టింపు లేని రామ్ చరణ్ కూడా హుషారయినట్లు తెలుస్తోంది.
ఆయన తరపున టీమ్ లు ఇప్పుడు రంగంలోకి దిగాయి. ఈ మధ్యనే కొత్తగా రకరకాల అక్కౌంట్లు రామ్ చరణ్ తరపున రంగంలోకి దిగాయి. విశ్వసనీయ వర్గాల భోగట్టా ప్రకారం రామ్ చరణ్ ఇప్పుడు బాలీవుడ్ మీద గట్టి కన్నేసారు. శంకర్ దర్శకత్వంలో భారీ సినిమా చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ విడుదలకు రెడీగా వుంది. ఈ రెండింటి తరువాత సినిమా కోసం బాలీవుడ్ డైరక్టర్ నే అన్వేషిస్తున్నారు.
గతంలో జంజీర్ రీమేక్ చేసినపుడు రామ్ చరణ్ మీద విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా ఇప్పటి నుంచే ఆయన జాగ్రత్త పడుతున్నారు. ఈ మేరకు ఇప్పటి నుంచే రామ్ చరణ్ కు మద్దతుగా వందలాది సోషల్ మీడియా అక్కౌంట్లు రెడీ అయిపోయాయని తెలుస్తోంది.