జగన్ వెనక్కు తగ్గారట.. ఎల్లో మీడియా చీప్ ట్రిక్స్

ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలప్రదం అయ్యాయి. ఉద్యోగ సంఘాలు తమ సమ్మెను విరమించాయి. సరిగ్గా ఇక్కడే ఎల్లో మీడియాకు చిక్కొచ్చి పడింది. చర్చలు సఫలం అని చెప్పలేక ఇబ్బంది పడుతోంది చంద్రబాబు మీడియా. అలాఅని…

ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలప్రదం అయ్యాయి. ఉద్యోగ సంఘాలు తమ సమ్మెను విరమించాయి. సరిగ్గా ఇక్కడే ఎల్లో మీడియాకు చిక్కొచ్చి పడింది. చర్చలు సఫలం అని చెప్పలేక ఇబ్బంది పడుతోంది చంద్రబాబు మీడియా. అలాఅని ఇది ఉద్యోగుల విజయం అని కూడా పూర్తిగా వెనకేసుకొచ్చేలా లేదు పరిస్థితి. దీంతో కొత్త పల్లవి అందుకుంది అను'కుల' మీడియా. ఉద్యోగుల విషయంలో ముఖ్యమంత్రి జగన్ వెనక్కి తగ్గారనేది టీవీ5, ఏబీఎన్ ఛానెళ్ల కొత్త పల్లవి.

సమ్మెకు సిద్ధమయ్యే క్రమంలో ఉద్యోగులు 'ఛలో విజయవాడ' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం కొంత ప్రయత్నించిన మాట వాస్తవం. అయితే పోలీసు యంత్రాంగం ఉద్యోగులకు పూర్తిగా సహకరించడంతో, ఛలో విజయవాడ కార్యక్రమం సక్సెస్ అయింది. సరిగ్గా ఇదే అంశాన్ని ఎల్లో మీడియా ఎత్తుకుంది.

భయంతోనే జగన్ వెనక్కి తగ్గారా?

ఛలో విజయవాడ కార్యక్రమానికి వచ్చిన స్పందన చూసి జగన్ లో భయం పట్టుకుందట. ఆయనలో గుబులు మొదలైందట. వెంటనే వెనక్కు తగ్గారట. ఉద్యోగులకు చర్చలకు పిలిచి వాళ్ల డిమాండ్స్ కు తలొగ్గారట. అలా తన ఓటు బ్యాంకును జగన్ కాపాడుకున్నారనేది ఎల్లో మీడియా మాట.

ఇదే ఎల్లో మీడియా అదే నోటితో మరో మాట కూడా చెబుతోంది. చర్చల్లో కొన్ని నిర్ణయాలు, కొన్ని ఉద్యోగ సంఘాలకు నచ్చలేదని, ఉపాధ్యాయుల వాట్సాప్ గ్రూపుల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని డిబేట్లలో చెప్పుకొచ్చారు. ఓవైపు ఉద్యోగుల డిమాండ్లకు జగన్ తలొగ్గారని చెబుతున్న మీడియానే, అదే నోటితో ఉద్యోగుల్లో అసంతృప్తి కూడా ఉందని చెబుతోంది. ఇదెలా సాధ్యం. ఇలా చంద్రబాబు తరహాలోనే రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోంది ఎల్లో మీడియా.

వాస్తవంగా మాట్లాడుకుంటే.. చర్చల్లో తీసుకున్న నిర్ణయాల్లో కొన్ని నిర్ణయాలు కొంతమంది ఉద్యోగులకు నచ్చలేదనేది వాస్తవం. అయినప్పటికీ ఉద్యోగ సంఘాలు సమ్మె నుంచి తప్పుకొని, ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు చెప్పిన మాట నిజం. రాబోయే రోజుల్లో ఉద్యోగుల్ని మరింత ఆదుకుంటామని జగన్ హామీ ఇచ్చిన మాట యదార్థం. ఇలా ఉన్న విషయాల్ని ఉన్నది ఉన్నట్టు చెబితే సరిపోయేది. కానీ జగన్ ను బద్నామ్ చేసేందుకు, ప్రభుత్వాన్ని బలహీన పరిచేందుకు, అదే సమయంలో చంద్రబాబుకు మైలేజీ ఇచ్చేందుకు ఎల్లో మీడియా అబద్ధపు ప్రచారాన్ని అందుకుంది.

ఉద్యోగుల హక్కు అది

తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఉద్యోగులు ఎవరైనా సమ్మె చేస్తారు. ఇది వాళ్లకు చట్టం కల్పించిన హక్కు. ఇదే విషయాన్ని గతంలో జగన్ కూడా చెప్పారు. అలా సమ్మె చేసే ఉద్యోగులపై పోలీస్ కేసులు పెట్టమని కూడా స్పష్టంచేశారు. అయితే గమ్మత్తైన విషయం ఏంటంటే.. ఏపీలో ఉద్యోగులు సమ్మెకు దిగకముందే ఎల్లో మీడియా అలెర్ట్ అయింది. ఉద్యోగుల్ని రెచ్చగొట్టే విధంగా కథనాలు వండివార్చింది. గంటల పాటు డిబేట్లు నడిపింది. అంతేకాదు, ఉద్యోగుల ముసుగులో తమ పెయిడ్ ఆర్టిస్టుల్ని పెట్టి ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమాన్ని దిగ్విజయంగా సాగించింది.

ఇదంతా సమ్మెకు ముందు మాత్రమే. సమ్మె మొదలైన తర్వాత విశ్వరూపం చూపించాలనుకుంది ఎల్లో మీడియా. కానీ జగన్ రాత్రికిరాత్రి అంతా సెట్ చేయడంతో చంద్రబాబు మీడియాకు ఏం చేయాలో పాలుపోలేదు. అందుకే ఇలా మరో ఫేక్ ప్రచారానికి తెరతీశారు.

ఇలాంటి తప్పుడు ప్రచారాలు జగన్ కు కొత్త కాదు. అధికారంలోకి రాకముందు నుంచి, సీఎం అయి పాలన సాగిస్తున్న ఈ క్షణం వరకు ఆయన ఇలాంటివి చాలా చూస్తున్నారు. తాజా డిబేట్లు, విశ్లేషణలు చూసి ఓ నవ్వు నవ్వి ఊరుకుంటున్నారు.