తెలంగాణ రాజకీయాల్లో తమిళ ‘సై’.. యాక్షన్ ప్లాన్ రెడీ?

కేసీఆర్ ప్రోటోకాల్ ఉల్లంఘించారు, జ్వరం వచ్చిందంటూ మోదీకి స్వాగతం పలకకుండా తప్పించుకున్నారు. కేవలం ప్రోటోకాల్ ఉల్లంఘించడమే కాదు, మోదీని అవమానించారంటూ  ఫైర్ అవుతోంది  బీజేపీ. ఇప్పుడీ మొత్తం వ్యవహారం సరికొత్త యుద్ధానికి తెరతీసేలా ఉంది.…

కేసీఆర్ ప్రోటోకాల్ ఉల్లంఘించారు, జ్వరం వచ్చిందంటూ మోదీకి స్వాగతం పలకకుండా తప్పించుకున్నారు. కేవలం ప్రోటోకాల్ ఉల్లంఘించడమే కాదు, మోదీని అవమానించారంటూ  ఫైర్ అవుతోంది  బీజేపీ. ఇప్పుడీ మొత్తం వ్యవహారం సరికొత్త యుద్ధానికి తెరతీసేలా ఉంది. తాజా సమాచారం ప్రకారం, మిగతా రాష్ట్రాల్లో చేసినట్టుగానే తెలంగాణలో కూడా గవర్నర్ తో యుద్ధం మొదలుపెట్టాలని బీజేపీ భావిస్తోందట.

గవర్నర్ తో రాజకీయాలు చేయడం బీజేపీకి కొత్త కాదు. కర్నాటక, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, ఉత్తరాఖండ్ లో గతంలో బీజేపీ చేసిన 'గవర్నర్ రాజకీయాల్ని' మరిచిపోలేం. తాజాగా తమిళనాడులో కూడా స్టాలిన్ గవర్నమెంట్ పై గవర్నర్ తో రాజకీయాలు మొదలుపెట్టింది బీజేపీ. ఇప్పుడిదే పద్ధతిని తెలంగాణలో కూడా అనుసరించాలని చూస్తోంది.

ఇప్పటికే ప్రగతిభవన్ కు, రాజ్ భవన్ కు మధ్య చాలా దూరం పెరిగిపోయింది. గత నెల జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు కూడా ఆనవాయితీ ప్రకారం రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలిసే ప్రొటోకాల్ ను కేసీఆర్ పక్కనపెట్టారు. ఇప్పుడు ఏకంగా ప్రధాని మోదీని కలవకుండా మొహం చాటేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో.. గవర్నర్ తమిళ సైను ఉపయోగించుకొని తెలంగాణలో రాజకీయ యుద్ధం ప్రారంభించాలనుకుంటోంది బీజేపీ.

ఇప్పటికే తెలంగాణ గవర్నర్ తన మార్క్ ఏంటో చూపించారు. కరోనా టైమ్ లో అధికారుల్ని రాజ్ భవన్ కు పిలిపించుకొని సమీక్షలు నిర్వహించారు. ఓ ఎమ్మెల్సీ నియామకానికి సంబంధించి చాలా రోజులు ఫైల్ ను పెండింగ్ లో పెట్టారు. ఇప్పుడు ప్రధాని అండతో తమిళ సై తన అధికారాలకు మరింత పదును పెడతారని, కేసీఆర్ ప్రభుత్వంపై కత్తి దూస్తారని అంటున్నారు విశ్లేషకులు.

ఢిల్లీలో ఉన్న కేజ్రీవాల్ సర్కారును లెఫ్టినెంట్ గవర్నర్ సహాయంతో కేంద్రం గతంలో చాలా ఇబ్బందులకు గురిచేసింది. మొన్నటికిమొన్న పశ్చిమబెంగాల్ లో మమతా బెనర్జీని గవర్నర్ సహాయంతో ముప్పుతిప్పులు పెట్టింది. అలాంటి 'రాజ్యాంగ ఇబ్బందుల' నుంచి ఆయా రాష్ట్రాల అధినేతలు సక్సెస్ ఫుల్ గా బయటపడ్డారు. ఇప్పుడు తెలంగాణలో అలాంటి 'రాజ్యాంగ రాజకీయం' మొదలైతే, కేసీఆర్ దాన్ని ఎలా తిప్పికొడతారో చూడాలి.

మరీ ముఖ్యంగా ఈమధ్య కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. బడ్జెట్ బాగాలేదని చెప్పడం కోసం ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్యమంత్రి.. ఏకంగా రాజ్యాంగాన్ని మార్చాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రానికి ఈ వ్యాఖ్యలు కోపం తెప్పించాయి. ఈ నేపథ్యంలో.. అదే రాజ్యాంగంతో కేసీఆర్ ను కొట్టాలని మోదీ సర్కారు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

రాబోయే రోజుల్లో తెలంగాణలో సిసలైన బీజేపీ మార్కు రాజకీయం చూడబోతున్నాం. ఇది మాత్రం పక్కా.