విమర్శ చేయాలి కాబట్టి చేయడం అన్నదే పాలిటిక్స్ అంటే ఎవరేమీ చేయలేరు. కానీ ఒక కామెంట్ చేసినపుడు లాజిక్ ఉండాలి కదా అన్నదే వైసీపీ నేతలు చెబుతున్నా మాట. విషయానికి వస్తే పెందుర్తి నియోజకవర్గాన్ని కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా అనకాపల్లిలో కలిపారు.
ఇదంతా శాస్త్రీయంగా అన్నీ చూసుకునే చేశామని అధికారులు చెబుతున్నారు. ఇక పెందుర్తి అయితే విశాఖలో నిన్నటిదాకా భాగంగా ఉండేది. ఇపుడు అనకాపల్లిలో విలీనం చేయడంతో ప్రజల సంగతేమో కానీ రాజకీయ నాయకులు అయితే కాస్తా రగులుతున్నారు
అందరి కంటే ముందే పెందుర్తి వైసీపీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ విశాఖలోనే పెందుర్తిని ఉంచాలని కోరుతూ కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించారు. దీని మీద ప్రభుత్వ పెద్దలతో కూడా మాట్లాడుతాను అని ఆయన అన్నారు. ఇక దీన్ని అతి పెద్ద ఇష్యూగా ఇపుడు టీడీపీ చేస్తోంది. ఇప్పటికే అఖిలపక్ష నాయకులతో మీటింగ్ పెట్టిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి తాజాగా సంతకాల సేకరణ పేరిట మరో కార్యక్రమం తీసుకున్నారు. పెందుర్తిని విశాఖలో ఉంచాలన్న డిమాండ్ చేయడంలో ఎవరికీ అభ్యంతరాలు లేవు.
కానీ ఇదే సమయంలో బండారు విశాఖ అంటే జగన్ కి కక్ష అని మాట్లాడుతున్నారు. ఆయన తల్లి విజయమ్మ 2014 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తే విశాఖవాసులు ఓడించారు కాబట్టే ఇలా చేశారు అంటున్నారు. నిజంగా ఇందులో తర్కం ఉందా బండారు సారూ అని వైసీపీ నేతలు అంటున్నారు.
ఏపీలో పదమూడు జిల్లాలను 26గా ప్రభుత్వం చేసింది. మరి కేవలం విశాఖ మీద కోపం ఉంటే ఏపీలో అన్ని చోట్లా జిల్లాలను ఎందుకు ముక్కలు చేస్తారు, ఇక పక్కనున్న శ్రీకాకుళం జిల్లాను మూడు ముక్కలు చేసి రెండు నియోజకవర్గాలను మైనస్ చేశారు. విజయనగరాన్ని రెండుగా చేశారు.
మరి ఇవన్నీ కూడా విశాఖ మీద కోపంతోనే చేశారా మాజీ మంత్రి గారూ అంటే ఆయన ఏం జవాబు చెబుతారో అని వైసీపీ నేతలు అంటున్నారు. ఇక కొత్త జిల్లాల ఏర్పాటులో కనీసంగా ఏడు నియోజకవర్గాలు ప్రతీ జిల్లాకు ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ విధంగా పూర్తి సైంటిఫిక్ మెథడాలజీతోనే ఈ విభజన జరిగింది అని అధికారులు అంటున్నారు.
ఇంకో వైపు చూస్తే అనకాపల్లిలో పోటీ చేసే ఎమ్మెల్యేలలో దాదాపుగా అంతా పెందుర్తి నుంచి వెళ్లినవారే. దశాబ్దాలుగా అక్కడా ఇక్కడా అనుబంధాలు, చుట్టరికాలు కూడా ఉన్నాయి. మరి ఇదంతా మరచి జగన్ కి విశాఖ మీద కక్ష అంటూ బండారు అనడంలో లాజిక్ ఏముందని అంటున్నారు.
కొత్త జిల్లాల నోటిఫికేషన్ మీద ప్రజల నుంచి వినతులు తీసుకునేందుకు, సవరణలకు కూడా టైమ్ ఉంది. కాబట్టి ఏం జరుగుతుందో చూడకుండా ప్రతీ దాని మీద రాజకీయ విమర్శలు, జగన్ మీద వ్యక్తిగత విమర్శలు చేయడమే టీడీపీ నేతలు పనిగా పెట్టుకున్నారు అని వైసీపీ నాయకులు ఫైర్ అవుతున్నారు. మొత్తానికి మంత్రిగా చేసిన బండారు వారు ఇపుడు ఇలా మాట్లాడం సబబేనా అని కూడా నిలదీస్తున్నారు.