తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ దూకుడు పెంచింది. కేసీఆర్‌పై ఏకంగా దేశద్రోహం కేసు వేయాలని బీజేపీ నిర్ణయించు కోవడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా ….అది ప్రజావ్యతిరేకంగా ఉందంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా రాజ్యాంగాన్ని మార్చాలంటూ కేసీఆర్ డిమాండ్ చేయడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
కేసీఆర్ రాజ్యాంగ మార్పిడి వ్యాఖ్యలను రాజకీయంగా సొమ్ము చేసుకునేందుకు ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీతో ఇక యుద్ధమే అంటూ కేసీఆర్ సమరశంఖం పూరించారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీని కనీసం మర్యాదపూర్వకంగా కలిసేందుకు కూడా కేసీఆర్ ఇష్టపడలేదు. మోదీతో, బీజేపీతో తాను దూరంగా ఉన్నాననే సంకేతాల్ని కేసీఆర్ పంపారు.
కేసీఆర్ దూకుడుకు తగ్గట్టే బీజేపీ కూడా పంథా మార్చుకుంది. కేసీఆర్‌పై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలనే డిమాండ్‌తో పోరాట కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఈ నెల 14 నుంచి న్యాయస్థానాల ఎదుట ‘చేంజ్ సీఎం.. నాట్ కాన్‌స్టూషన్’ పేరుతో కార్యక్రమాలు చేపట్టనున్నట్టు బీజేపీ సీనియర్ నేత రామచంద్రరావు తెలిపారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై న్యాయపోరాటం చేస్తామన్నారు.
రాజకీయ దురుద్దేశంతోనే రాజ్యాంగాన్ని తిరిగి రాయాలంటూ అంబేద్కర్‌ను అవమానించారన్నారు. రాజ్యాంగం రచించిన వారందరినీ కేసీఆర్ అవమానించారనీ.. ఇది దేశ వ్యతిరేక చర్యని ఆయన తేల్చి చెప్పారు. కేసీఆర్ వ్యాఖ్యలపై న్యాయస్థానాల్లో ప్రైవేటు కేసులు వేస్తామని ఆయన వెల్లడించారు.