ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మెగాస్టార్ చిరంజీవి గత నెలలో భేటీ కావడంపై ఆలస్యంగానైనా “మా” అధ్యక్షుడు మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ భేటీ పూర్తిగా వ్యక్తిగతమైందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంచు విష్ణు తాజా వ్యాఖ్యలు టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, మంచు మోహన్‌బాబు కుటుంబాల మధ్య విభేదాలున్నాయనే చర్చ ఎప్పటి నుంచో జరుగుతోంది. తిరుపతిలో మన్యం రాజు మూవీ పోస్టర్‌ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు.
సినిమా టికెట్స్ ధరలు విషయం లో ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. ఎందుకంటే చిత్ర పరిశ్రమ ఏ ఒక్కరి సొత్తు కాదన్నారు. అందరూ కలిసి ఫిల్మ్ ఛాంబర్‌ను ఎన్నుకున్నామన్నారు. అందువల్ల వ్యక్తిగతంగా తన అభిప్రాయం చెప్పడం సరికాదన్నారు. తెలంగాణలో సినిమా టికెట్ల ధరలు పెంచారని, ఆంధ్రాలో తగ్గించారన్నారు. వాటిపై కొందరు కోర్టును ఆశ్రయించారని చెప్పారు.
కానీ రెండు తెలుగు రాష్ట్రాలు చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తున్నాయన్నారు. దేశం గర్వించతగ్గ వ్యక్తి వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు దివంగత దాసరి నారాయణరావు నేతృత్వంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేసి జీవో తెచ్చారన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నపుడు నలుగురి కోసం ఆ జీవో మార్చారని విమర్శించారు. దీనిపై చర్చ జరగాలని విష్ణు సంచలన కామెంట్స్ చేశారు.
“మా” ఎన్నికల్లో మెగాస్టార్ బ్రదర్ నాగబాబు మంచు కుటుంబానికి వ్యతిరేకంగా పని చేశారు. విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌ను నాగబాబు బలపరిచారు. ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు ప్యానళ్ల మధ్య మాటల తూటాలు పేలాయి. సాధారణ ఎన్నికలను తలపించేలా చిత్రపరిశ్రమ ఎన్నికల్లో వ్యక్తిగత దూషణలు, పరస్పరం దాడుల వరకూ వెళ్లారు. ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానల్ ఘన విజయం సాధించింది. “మా” ఫలితాలు వెల్లడైన తర్వాత కూడా కొంత కాలం వివాదం కొనసాగింది.
ఈ నేపథ్యంలో జగన్‌తో చిరు భేటీపై ఇప్పుడు మంచు విష్ణు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి కారణాలేంటనే చర్చకు తెర లేచింది. ఇండస్ట్రీ సమస్యలపై చర్చించేందుకు సీఎం జగన్ ఆహ్వానం మేరకు కళామ తల్లి బిడ్డగా విజయవాడ వచ్చినట్టు చిరంజీవి అప్పట్లో ప్రకటించారు. చిత్రపరిశ్రమ పెద్దలతో చర్చించి మరోసారి అందరం కలిసి సీఎంతో చర్చించేందుకు వస్తామని ఆయన తెలిపారు. అంత వరకూ ఎవరూ సినిమా టికెట్ల ధరల తగ్గింపు, అలాగే ఇతర సమస్యలపై ఏదీ మాట్లాడొద్దని చిరంజీవి విన్నవించారు. జగన్‌కు చిరంజీవి సన్నిహితులని, ఆయన భేటీతో చిత్ర పరిశ్రమ సమస్యలకు తప్పకుండా పరిష్కారం లభిస్తుందని హీరో నాగార్జున అభిప్రాయం వ్యక్తం చేయడం తెలిసిందే.
అయితే జగన్‌తో చిరంజీవి భేటీ వెనుక రాజకీయం ఉందని ఒక వర్గం మీడియా వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చింది. చిరంజీవికి జగన్ రాజ్యసభ పదవి ఆఫర్ చేశారంటూ అసలు విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. ఎల్లో మీడియా కుట్రలను చిరంజీవి అప్పుడే ఖండించి, దుష్ప్రచారానికి చెక్ పెట్టారు. ఇదిలా వుండగా మంచు విష్ణు తాజా వ్యాఖ్యలు మరోసారి చిరంజీవి భేటీపై చర్చకు తెరలేపాయి. జగన్‌తో చిరంజీవి వ్యక్తిగతంగా భేటీ కావడానికి కారణాలేంటనే ప్రశ్నలు మరోసారి చర్చకు వచ్చాయి.
చిత్ర పరిశ్రమ పెద్ద దిక్కుగా కాకుండా, ఓ బిడ్డగా తాను సీఎంను కలిసినట్టు చిరంజీవి బహిరంగంగా ప్రకటించినప్పటికీ, విష్ణు అందుకు విరుద్ధంగా మాట్లాడ్డం గమనార్హం. విష్ణు ఉద్దేశ పూర్వకంగానే చిరుతో పాటు ఆయన సోదరులను బద్నాం చేయడానికి మంచు విష్ణు విషం కక్కారనే విమర్శలు మెగా అభిమానుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. అనేక సార్లు మెగా కుటుంబంపై మంచు కుటుంబం దుష్ప్రచారం చేసిందని చిరంజీవి అభిమానులు గుర్తు చేస్తున్నారు. మంచు విష్ణు కామెంట్స్‌పై మెగాస్టార్ చిరంజీవి ఎలా స్పందిస్తారనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది.