పీఆర్సీ సాధన సమితి నేతలను ఉద్యోగులు టార్గెట్ చేశారు. ఉద్యోగుల ఆందోళనకు ఎల్లో మీడియా ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో ఉద్యోగుల ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోందన్న బిల్డప్. మంత్రుల కమిటీతో జరిపిన చర్చల్లో అన్నింటికి తలూపి… ఆ తర్వాత బయటికి వచ్చాక ఉద్యోగ సంఘాల నేతలు యూటర్న్ తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదేదో సమావేశంలోనే పీఆర్సీతో పాటు ఇతర అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసి వుంటే చర్చించే వాళ్లమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు.
ఉపాధ్యాయ సంఘాల నేతలపై పీఆర్సీ సాధన సమితి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రుల కమిటీ సిఫార్సులను ఆమోదించిన ఉపాధ్యాయ సంఘాల నేతలు ఇప్పుడు భిన్నంగా మాట్లాడ్డం సరికాదని నాలుగు సంఘాల నేతలు తప్పు పడుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలని వారు కోరడం గమనార్హం.
ప్రభుత్వ ప్రతిపాదనలకు పీఆర్సీ సాధన సమితి నేతలు అంగీకరించడాన్ని ఏపీటీఎఫ్, యూటీఎఫ్, సీపీఎస్యూఎస్ తదితర సంఘాల నేతలు తప్పు పడుతున్నారు. డిమాండ్లు నెరవేరకనే సమ్మె విరమిస్తున్నట్టు పీఆర్సీ సాధన సమితి నేతలు ఎలా ప్రకటిస్తారని ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.
పీఆర్సీ సాధన సమితి నేతల వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగడం గమనార్హం. ఈ సందర్భంగా నిన్నటి వరకూ భుజాన మోసిన పీఆర్సీ సాధన సమితి నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, వెంకట్రామిరెడ్డి, సూర్యనారాయణ, బండి శ్రీనివాస్ ఫొటోలకు నివాళులర్పిస్తూ ఉపాధ్యాయులు నిరసన తెలియజేయడం విమర్శలకు దారి తీస్తోంది.
ఈ నలుగురి దిష్టిబొమ్మలకు శవయాత్రలు కూడా చేస్తూ తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు. ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిన నాయకులకు నరక ప్రాప్తిరస్తు అంటూ శాపనార్థాలు పెట్టారు. నేతలు అమ్ముడుపోయారంటూ విమర్శలు గుప్పించారు.
ఈ నలుగురు నాయకుల పిలుపు మేరకు ఈ నెల 3న చలో విజయవాడకు వేలాదిగా ఉద్యోగులు తరలి వచ్చారు. కనీసం రెండు రోజులు కూడా గడవకనే ఇదే నాయకులపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేయడం విమర్శలకు దారి తీస్తోంది.