చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అనే సామెత ఉంది కదా. ఎర్ర పార్టీల తీరు అంటే కమ్యూనిస్టు పార్టీల తీరు అలాగే ఉంది. ఇది మనం చెబుతున్న మాట కాదు, సీపీఐ లో తల పండి పోయిన, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి అయిన డాక్టర్ నారాయణ చెప్పారు. ఆంద్ర జ్యోతి రాధాకృష్ణ ప్రతి ఆదివారం ఓపెన్ హార్ట్ విత్ ఆర్ కె పేరుతో వివిధ రంగాల ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తారు కదా.
ఈ వారం నారాయణను ఇంటర్వ్యూ చేశారు. అందులో నారాయణ కొన్ని నిజాలు చెప్పారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కమ్యూనిస్టులు మారలేదన్నది ఒక పాయింటు. సరళీకరణ ప్రభావాలను అర్ధం చేసుకోలేకపోయామని, కంప్యూటర్లు, సెల్ ఫోన్లను అడ్డుకోవాలని చూశామని, దూరదృష్టితో ఆలోచించలేకపోయామని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను నెగెటివ్ గానే చూశామని అన్నారు.
కంప్యూటర్లు, సెల్ ఫోన్లు వచ్చినప్పుడు వాటిని బూర్జువా కల్చర్ అన్నామని నారాయణ చెప్పారు. సరళీకరణ విధానాలవల్లనే ఈనాడు సామాన్యులకు కూడా డబ్బులు వస్తున్నాయని, ఆ విషయం తాము ఆలస్యంగా అర్ధం చేసుకున్నామని నిజాయితీగా ఒప్పుకున్నారు నారాయణ. కమ్యూనిస్టు పార్టీల నాయకుల పిల్లలు ఎర్ర పార్టీల్లో చేరడంలేదని కూడా చెప్పారు. కమ్యూనిస్టులు వేరే పార్టీలను బూర్జువా పార్టీలని అంటాయి.
ఆ పార్టీలే ప్రపంచంలో జరుగుతున్న మార్పులను త్వరగా అర్ధం చేసుకున్నాయి. పీవీ నరసింహా రావు ప్రధాని అయ్యాకనే దేశంలో సరళీకరణ విధానాలు అమలు చేశారు. వాటి అమల్లో కొన్ని లోపాలు జరిగి ఉండొచ్చు. కానీ ఆర్ధికంగా భారత దేశం నిలదొక్కుకుందని చెప్పడంలో సందేహం లేదు. సరళీకరణ విధానాలవల్లనే అనేక విదేశాల కంపెనీలు దేశంలోకి వచ్చాయి. పీవీ నరసింహారావు బూర్జువా పార్టీకి (కాంగ్రెస్) చెందిన వాడే.
మైనారిటీ ప్రభుత్వాన్ని ఐదేళ్లపాటు విజయవంతంగా నడిపిన నాయకుడు. సాధారణంగా సంకీర్ణ ప్రభుత్వంలో సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం తక్కువ. కానీ పీవీ నరసింహారావు మునిగిపోతున్న నావను సరళీకరణ విధానాలతో ఒడ్డుకు చేర్చారు. అయినప్పటికీ సరళీకరణ విధానాలతో ప్రైవేటు రంగానికి కొమ్ముకాస్తున్నారని కమ్యూనిస్టులు మండిపడ్డారు కామ్రేడ్లు ముఖ్యంగా సీపీఎం నాయకులు అమితంగా ఇష్టపడే చైనాయే పెట్టుబడిదారీ వర్గాలకు రెడ్ కార్పెట్ పరిచింది. కానీ చైనా విధానాలు దేశానికి నష్టం చేసేవి కావని కామ్రేడ్లు వాదిస్తారు.
భారత దేశంలో కమ్యూనిస్టులు మారకపోతే అవి అంతరించిపోతాయనే అర్ధం వచ్చేలా నారాయణ మాట్లాడారు. దాదాపు అర్ధ శతాబ్దం కిందట యువత కమ్యూనిజం అంటే ఊగిపోయారు. పిచ్చి అభిమానం పెంచుకున్నారు. కమ్యూనిస్టు పార్టీల్లో విపరీతంగా చేరేవారు. కానీ క్రమంగా కమ్యూనిజం మీద మోజు తగ్గుతూ వచ్చింది. ఇప్పటి యువతకు కెరీర్ మీద ఉన్న శ్రద్ధ కమ్యూనిజం పట్ల లేదని చెప్పొచ్చు. కమ్యూనిజాన్ని నమ్ముకుంటే తమ జీవితాలు బాగుపడవని యువత అర్ధం చేసుకున్నారు.