ఆయ‌న‌ది ఒన్‌సైడ్ ల‌వ్‌!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ది రాజ‌కీయంగా ఒన్ సైడ్ ల‌వ్ అయ్యింది. ఏడాదిన్న‌ర క్రితం వ‌ర‌కూ ప‌వ‌న్‌ను రాజ‌కీయంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్రేమిస్తుండేవారు. ఈ విష‌యాన్ని కుప్పంలో స్వ‌యంగా చంద్ర‌బాబే చెప్పారు. ప‌వ‌న్‌తో త‌న‌ది ఒన్…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ది రాజ‌కీయంగా ఒన్ సైడ్ ల‌వ్ అయ్యింది. ఏడాదిన్న‌ర క్రితం వ‌ర‌కూ ప‌వ‌న్‌ను రాజ‌కీయంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్రేమిస్తుండేవారు. ఈ విష‌యాన్ని కుప్పంలో స్వ‌యంగా చంద్ర‌బాబే చెప్పారు. ప‌వ‌న్‌తో త‌న‌ది ఒన్ సైడ్ ల‌వ్ అని ఓ కార్య‌క‌ర్త అడిగిన ప్ర‌శ్న‌కు చంద్ర‌బాబు స‌మాధానం ఇచ్చారు. ఏడాదిన్న‌ర‌లో రాజ‌కీయంగా ఇష్టాయిష్టాలు మారాయి, మారుతున్నాయి. ప్ర‌జ‌ల్లో వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త‌, ఇదే సంద‌ర్భంలో టీడీపీపై సానుకూల‌త ఏర్ప‌డిన‌ట్టు చంద్ర‌బాబు న‌మ్ముతున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా మూడు గ్రాడ్యుయేట్స్ స్థానాల్లో టీడీపీ గెల‌వ‌డంతో చంద్ర‌బాబుతో పాటు టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. దీంతో ఎవ‌రినీ లెక్క చేసే ప‌రిస్థితిలో చంద్ర‌బాబు లేరు. పొత్తుల గురించి చంద్ర‌బాబు మాట్లాడ్డం లేదు. అలాగే టీడీపీ నేత‌లెవ‌రూ జ‌న‌సేన‌, బీజేపీతో పొత్తులపై నోరు తెర‌వ‌డం లేదు. కానీ ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాత్రం పొత్తుల గురించే మాట్లాడ్తారు. టీడీపీ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రాకుండానే త‌న‌కు తానుగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎక్కువ ఊహించుకుంటున్నారు.

ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న జ‌న‌సేన‌లో మ‌రింత అయోమ‌య్యాన్ని సృష్టిస్తోంది. ప‌వ‌న్‌కల్యాణ్ త‌న పార్టీ శ్రేణుల‌కు మార్గ‌నిర్దేశకం చేస్తూ… విడుద‌ల చేసిన లేఖ‌పై సోష‌ల్ మీడియాలో సెటైర్స్ పేలుతున్నాయి. పార్టీ శ్రేణుల‌ను అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ప‌వ‌న్ హెచ్చ‌రించ‌డం విచిత్రంగా వుంద‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు మొట్ట‌మొద‌ట అప్ర‌మ‌త్తంగా ఉండాల్సింది జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ విష‌యంలోనే అని నెటిజ‌న్లు దెప్పి పొడుస్తున్నారు.

మ‌న‌తో స‌యోధ్య‌గా ఉన్న రాజ‌కీయ ప‌క్షాలంటూ ప‌రోక్షంగా టీడీపీ, బీజేపీల గురించి ప‌వ‌న్ ప్ర‌స్తావించ‌డాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్ప‌టికే బీజేపీతో మిత్ర‌ప‌క్షంగా ఉన్న‌ప్ప‌టికీ, క‌లిసి రాజ‌కీయంగా సాగుతున్న‌దేం లేద‌ని చెబుతున్నారు. అలాగే టీడీపీతో స‌యోధ్య అని చెప్ప‌డం ద్వారా రాజ‌కీయంగా జ‌న‌సేన‌కు తీవ్ర న‌ష్ట‌మ‌నే ఆందోళ‌న ఆ పార్టీ శ్రేణుల్లో వ్య‌క్త‌మ‌వుతోంది. ఎందుకంటే ఏక‌ప‌క్షంగా త‌న‌కు తానుగా టీడీపీని మిత్ర‌ప‌క్షంగా భావించ‌డం వ‌ల్ల‌, టికెట్ల‌పై డిమాండ్ చేసే ప‌రిస్థితి వుండ‌నే క‌నీస స్పృహ ప‌వ‌న్‌లో లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంద‌ని ఆ పార్టీ నేత‌లు అంటున్నారు.

పార్టీని బ‌లోపేతం చేయ‌డాన్ని విస్మ‌రించి, పొత్తుల‌కు సంబంధించి మేలు చేసే నిర్ణ‌యం తానే తీసుకుంటాన‌న‌డం వెనుక ఉద్దేశం ఏంటో ప‌వ‌న్‌కే తెలియాల‌ని నెటిజ‌న్లు అంటున్నారు. అస‌లు పొత్తుల గురించి ఆలోచ‌నే త‌మ‌కు లేద‌ని ఇటీవ‌ల టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో పొత్తుల గురించి ఆలోచిస్తామంటూ, పార్టీ బ‌లోపేతం, అభ్య‌ర్థుల ఎంపిక‌పై అచ్చెన్నాయుడు, ఇత‌ర నేత‌లు దృష్టి సారించారు. ఇదేం విచిత్ర‌మో కానీ, అప్పుడెప్పుడో చంద్ర‌బాబు ఒన్ సైడ్ ల‌వ్ అన్నార‌ని, దాన్ని ప‌ట్టుకుని ప‌వ‌న్ వేలాడుతున్నారు.

ఇప్పుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఒన్ సైడ్ ల‌వ్‌లో ఉంటూ, పొత్తుల‌పై క‌ల‌లు కంటున్నారు. ప‌వ‌న్ భావిస్తున్న‌ట్టు జ‌న‌సేన‌ను బ‌ల‌హీన‌ప‌ర‌చ‌డానికి మ‌రెవ‌రో కుట్ర‌లు ప‌న్నాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే ఆ ప‌ని ప‌వ‌నే చేస్తారు కాబ‌ట్టి. ప‌వ‌న్ ఎంత‌లా దిగ‌జారారంటే…ఇత‌ర పార్టీల‌కు చెందిన ఎవ‌రైనా నాయ‌కులు జ‌న‌సేన‌పై విమ‌ర్శ‌లు చేస్తే….అవి వారి వ్య‌క్తిగ‌తంగా భావించాల‌ని త‌నే చెప్ప‌డం. ఇంత‌కంటే దౌర్భాగ్యం జ‌న‌సేన‌కు మ‌రేదైనా వుంటుందా?  ఇదంతా ప‌వ‌న్ ఒన్ సైడ్ ల‌వ్ ఎఫెక్ట్ ప‌ర్య‌వ‌సానాల‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.