ష‌ర్మిల‌, విజ‌య‌మ్మ వీధిన ప‌డ్డారా? ప‌డేశారా?

హైద‌రాబాద్‌లో మ‌రోసారి వైఎస్సార్‌టీపీ అధినేత్రి ష‌ర్మిల‌, ఆమె త‌ల్లి విజ‌య‌మ్మ వ్య‌వ‌హార శైలి తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. వైఎస్సార్ హ‌యాంలో ఓ వెలుగు వెలిగిన ఆయ‌న భార్య‌, కూతురు ఇప్పుడు వీధిపోరాటాలు చేస్తున్నారు. వారిని ఈ…

హైద‌రాబాద్‌లో మ‌రోసారి వైఎస్సార్‌టీపీ అధినేత్రి ష‌ర్మిల‌, ఆమె త‌ల్లి విజ‌య‌మ్మ వ్య‌వ‌హార శైలి తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. వైఎస్సార్ హ‌యాంలో ఓ వెలుగు వెలిగిన ఆయ‌న భార్య‌, కూతురు ఇప్పుడు వీధిపోరాటాలు చేస్తున్నారు. వారిని ఈ స్థితిలో చూడ‌డం వైఎస్సార్ అభిమానులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. తెలంగాణ‌లో వైఎస్సార్‌టీపీ అంటూ సొంత రాజ‌కీయ కుంప‌టిని ష‌ర్మిల పెట్టుకున్నారు. దేశంలో ఎవ‌రైనా, ఎక్క‌డైనా రాజ‌కీయ పార్టీ పెట్టుకునే హ‌క్కు వుంది.

అయితే రాజ‌కీయ పార్టీ అంటే ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ ముఖ్యం. రాజ‌కీయ పార్టీనే కాదు ఒక వ్యాపారం చేయాలంటే ఎంతో క‌స‌ర‌త్తు చేస్తారు. ముఖ్యంగా రాజ‌కీయాల్లో ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ‌, మ‌రో పార్టీ కావాల‌నే ఆకాంక్ష‌ల్లో జ‌నంలో ఉందా? అనే విష‌య‌మై స‌ర్వేల ద్వారా తెలుసుకుంటారు. పాజిటివ్ నివేదిక వ‌స్తే… అడుగులు ముందుకేస్తారు. అలాగే వ్యాపారం కూడా. ప్ర‌జ‌ల్లో డిమాండ్ ఉన్న దాన్ని వ్యాపారంగా మ‌లుచుకుంటే స‌క్సెస్ అవుతారు. ఈ మాత్రం ఇంగితం వైఎస్ ష‌ర్మిల‌కు లేద‌నుకోలేం.

తెలంగాణ‌లో త‌న పార్టీ వైసీపీని ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మూసివేశారు. 2014లో తెలంగాణ‌లో న‌లుగురు ఎమ్మెల్యేలు, ఒక పార్ల‌మెంట్ స‌భ్యుడు వైసీపీ త‌ర‌పున గెలిచిన సంగ‌తి తెలిసిందే. 2018 వ‌చ్చే స‌రికి రాజ‌కీయ ప‌రిస్థితులు బాగా లేవ‌ని, త‌న‌కు అనుకూలంగా లేద‌ని గ్ర‌హించిన జ‌గ‌న్ గౌర‌వంగా వైసీపీని ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ‌రకే ప‌రిమితం చేశారు. ఇవ‌న్నీ తెలిసి కూడా వైఎస్ ష‌ర్మిల తెలంగాణ‌లో పార్టీ పెట్టారు. దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి, ఆయ‌న కుమారుడు వైఎస్ జ‌గ‌న్‌ను తెలంగాణ రాష్ట్రానికి వ్య‌తిరేకులుగా అక్క‌డి స‌మాజం చూస్తుంద‌న్న‌ది వాస్త‌వం. చంద్ర‌బాబును కూడా అట్లే తెలంగాణ స‌మాజం ప‌రిగ‌ణిస్తుంది.

ఇవ‌న్నీ తెలిసి కూడా అనువుగాని చోట ఏ లెక్క‌న రాజ‌కీయంగా రాణిస్తాన‌ని ష‌ర్మిల ఆలోచిస్తున్నారో అర్థం కావ‌డం లేదు. తెలంగాణ‌లో త‌న‌ను అస‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని గ్ర‌హించిన ష‌ర్మిల‌… పాద‌యాత్ర పేరుతో ప్ర‌త్య‌ర్థుల‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌కు దిగారు. చివ‌రికి ఆ పాద‌యాత్ర కూడా మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. త్వ‌ర‌లో తెలంగాణ‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇక పాద‌యాత్ర చేయ‌డానికి ఆమెకు స‌మ‌యం కూడా ఉండ‌దు.

ఈ నేప‌థ్యంలో లోట‌స్‌పాండ్ వ‌ద్ద సోమ‌వారం చోటు చేసుకున్న ప‌రిణామాలు మ‌రోసారి ష‌ర్మిల‌, ఆమె తల్లి విజ‌య‌మ్మ‌కు నెగెటివ్ ప్ర‌చారం తీసుకొస్తున్నాయి. పోలీసుల‌పై చేయి చేసుకోవ‌డం ఏంటంటూ నిల‌దీత‌లు ఎదుర‌వుతున్నాయి. త‌ల్లీకూతురు వీధికెక్కి నీటి కుళాయిల ద‌గ్గ‌ర కొట్లాడుకుంటున్న వైనాన్ని గుర్తు చేస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. ఇంత‌కూ వీళ్ల బాధ ఏంట‌నేది ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు.

త‌న అన్న వైఎస్ జ‌గ‌న్‌పై కోపంతోనే తెలంగాణ‌కు వెళ్లి ష‌ర్మిల పార్టీ పెట్టార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఆస్తుల‌కి సంబంధించి తండ్రి త‌న‌కు ఇచ్చిన హామీని అన్న ప‌ట్టించుకోవ‌డం లేద‌నేది ష‌ర్మిల ఆవేద‌న‌గా ఆమె స‌న్నిహితులు చెబుతున్నారు. జ‌గ‌న్ మొండిత‌నం తెలియ‌డంతో తానేమీ చేయ‌లేన‌ని భావించి, ఇలా ప‌రోక్షంగా అన్న‌ను ఇబ్బందుల‌పాలు చేయ‌డానికి తెలంగాణ‌లో అనుకూలంగా లేని చోట రాజ‌కీయం పేరుతో నానాయాగీ చేస్తోంద‌న్న అభిప్రాయం వుంది. కూతురిపై మ‌మ‌కారంతో ష‌ర్మిల‌కు విజ‌య‌మ్మ అండ‌గా నిలిచింద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

ష‌ర్మిల‌పై త‌ల్లికి ప్రేమ ఉండొచ్చ‌ని, అయితే వైఎస్సార్ పేరుకు మ‌చ్చ తెచ్చేలా కూతురు న‌డుచుకుంటుంటే వారించ‌క‌పోవ‌డం ఏంట‌ని విజ‌యమ్మ‌ను ప్ర‌శ్నించేవాళ్లు లేక‌పోలేదు. నిజంగా జ‌గ‌న్‌పై కోపం వుంటే, ఆంధ్రాలో రాజ‌కీయంగా తేల్చుకుని వుంటే బాగుండేద‌ని మ‌రికొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఏపీలో అధికారాన్ని ద‌ర్జాగా అనుభ‌వించ‌కుండా, తెలంగాణ‌కు వెళ్లి గ‌మ్యం తెలియ‌ని రాజ‌కీయ ప్ర‌యాణం సాగిస్తూ… త‌ల్లీకూతురు అభాసుపాలు అవుతున్నార‌నే అభిప్రాయం రోజురోజుకూ బ‌ల‌ప‌డుతోంది. ష‌ర్మిల‌, విజ‌య‌మ్మ‌ను జ‌గ‌న్ ప‌ట్టించుకోక‌పోవ‌డం వ‌ల్లే ఇవాళ‌… వాళ్లిద్ద‌రూ తెలంగాణ‌లో రోడ్డున ప‌డ్డార‌ని ప్ర‌త్య‌ర్థులు విమ‌ర్శిస్తున్నారు. 

త‌ల్లి, చెల్లినే ప‌ట్టించుకోని జ‌గ‌న్‌, రాష్ట్ర ప్ర‌జానీకాన్ని ఏం ఉద్ధ‌రిస్తార‌నే విమ‌ర్శ‌ల‌కు వాళ్లిద్ద‌రు ఆయుధం ఇచ్చిన‌ట్టైంది. జ‌గ‌న్ వైఖ‌రే త‌ల్లి, చెల్లికి ఇవాళ ఈ దుస్థితి రావ‌డానికి కార‌ణ‌మ‌ని విమ‌ర్శించేవాళ్ల‌కు కొద‌వే లేదు. ఈ ప‌రిణామాలు జ‌గ‌న్‌కు రాజ‌కీయంగా చికాకే. బ‌హుశా ఇదే ష‌ర్మిల కోరుకుంటున్న‌దేమో! ష‌ర్మిల మ‌న‌సులో ఏముందో ఎవ‌రికి ఎరుక‌!