Advertisement

Advertisement


Home > Politics - Opinion

వీరంగం చేసిన షర్మిల- కౌంటర్ వేసిన ఎస్సై

వీరంగం చేసిన షర్మిల- కౌంటర్ వేసిన ఎస్సై

సోషల్ మీడియా యుగంలో ఏ పని చేసినా ఒక తూకంలో చెయ్యాలి. ప్రతి చోట నోరుపారేసుకుంటే స్పాట్లో కౌంటర్లు పడొచ్చు, లేదా ట్రోలింగ్ రూపంలో తర్వాతైనా పడొచ్చు. ఈ రోజు జరిగిన ఒక సంఘటన దీనికి నిలువెత్తు తార్కాణం. 

వై.ఎస్. షర్మిల లోటస్ పాండ్ లో తన ఇంటి నుంచి కారులో బయలుదేరింది. కొంత మంది పోలీసులు కారుని అడ్డుకున్నారు. ఆమె ముందుకు వెళ్లడానికి వీల్లేదన్నారు. అంటే ఆమెను వెనక్కి వెళ్లి ఇంట్లో కూర్చోమని సూచించారన్నమాట. 

ఈ అవకాశాన్ని వదలకూడదనుకున్నారో ఏమో ఆమె విప్లవచిత్రాల్లో విజయశాంతి రేంజులో కారు డోర్ తీసుకుని బయటికొచ్చి అడ్డుకుంటున్న లేడీ కానిస్టేబుల్స్ ని పక్కకు తోసారు. కారు తాళం తీసుకునేందుకు ప్రయత్నించిన ఎస్సైని కూడా ఒక తోపు తోసారు. "మీకేం అధికారముందని నన్ను ఆపుతున్నారు"? అంటూ వీరంగం చేసారు. ఆ తర్వాత రొడ్డు మీదే కూర్చుని తనని ఎందుకు ఆపారో చెప్పమంటూ "పని పాట లేకపోతే వెళ్లి గాడిదల్ని కాసుకోండి" అంటూ ఎస్సైని గదమాయించారు. దానికి వెంటనే ఎస్సై, "ఇప్పుడదే చేస్తున్నాం" అన్నాడు. దానికి షర్మిల నుంచి మరో కౌంటర్ లేదు. ఎస్సై తనను పరోక్షంగా "గాడిద" అన్నాడన్న పాయింట్ ఆమెకు తట్టిందో లేదో. 

ఇప్పుడు అసలు విషయమంతా పక్కకి పోయి ఈ ఎస్సై కౌంటర్ ఒక్కటే వైరలౌతోంది. 

ఆమెను పోలీసులు ఇబ్బంది పెడుతున్నప్పుడు వీరనారిలాగ ఆమె చేస్తున్న పోరాటం వైరలవ్వాలని ఆమె కోరుకుంటే ఈ ఎస్సై కౌంటర్ వల్ల అది కాస్తా బెడిసికొట్టింది. 

అప్పట్లో రేణుకా చౌదరి ఒక సీనియర్ పోలీసాఫీసర్ ని చెంప మీద కొట్టిందన్న విషయాన్ని అదేదో పెద్ద ఘనకార్యం కింద కొన్ని పత్రికలు రాసి ఆమెను ఫైర్ బ్రాండ్ గా చిత్రీకరించే ప్రయత్నం చేసారు. కానీ అది ఈ రోజుల్లో లైవ్ కెమెరాల ముందు జరిగుంటే సోషల్ మీడియాలో ఆమెను ఒక ఆట ఆడుకునేవాళ్లు జనం. ఎందుకంటే పోలీసులు వాళ్ల డ్యూటీ వాళ్లు చేస్తారు. కష్టమైనా సరే వారితో సహకరించాలి తప్ప మరో మార్గం లేదు. 

ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక మాట చెప్పారు. మన రాజ్యాంగం ప్రకారం ఏ రకమైన నిరసననైనా తెలిపే హక్కు మనకుంది. కానీ ఒక్కసారి పోలీసు వచ్చి "పదండి" అని మీద చేయి వేస్తే మారు మాట్లాడకుండా లేవాలి తప్ప డ్రామాలు చేయకూడదు. అది మన చట్టం. కానీ డ్రామాకి మాత్రమే ప్రజలు కనెక్ట్ అవుతారు అని నమ్మే ప్రతి నాయకుడు, నాయకురాలు అదే తప్పు చేస్తుంటారు. 

పోలీసులు ఒక హయరార్కీలో పని చేస్తుంటారు. అడ్డుకున్న ఎస్సై ఇక్కడ నిమిత్తమాత్రుడు. పైనున్న ఆఫీసర్లు ఆపమంటే ఆపుతాడు. అంతకుమించి అతనేమీ చెయ్యలేడు. హుందాగా వెనుదిరిగి వెళ్లిపోయి తర్వాత ఏ ప్రెస్మీటో పెట్టి విషయం చెప్పుకోవచ్చు. అక్కడ ఏదన్నా మాట్లాడొచ్చు. కానీ రోడ్డుకెక్కి వీరంగం చేస్తే రోడ్డున పడేది వ్యక్తిగత పరువు, పెట్టుకున్న పార్టీ ప్రతిష్ట. 

అన్నట్టు ఈ మధ్యన షర్మిల మాట్లాడిన మాటలు విపరీతంగా వైరలౌతున్నాయి. 

"పాదయాత్ర అంటే పా..దా..ల ..మీ..ద..నడిచే యాత్ర" అంటూ అదొక రకమైన లయలో ఆమె చెప్పడం విపరీతంగా వైరలయ్యింది. 

"మీ ఆవిడ అని ఎందుకంతారో తెలుసా? మీ ఆవిడ కాబట్టి.." అనేది కూడా వైరల్ వీడియోనే. 

ఇంతకీ ఈ వాక్యాల్లోని పరమార్ధమేంటో అర్ధం కాక నొసట్లు చిట్లించి ఆ వెంటనే నవ్వడమొక్కటే చేస్తున్నారు జనమంతా. 

అసలు ఆవిడ పెట్టిన పార్టీకి, చేస్తున్న ఉద్యమానికి ఎటువంటి బిట్లు వైరల్ అవ్వాలి? సాక్ష్యాలతో ఆమె ప్రధాన ప్రత్యర్థుల అవినీతిని, అన్యాయాలను, భూకబ్జాలను బట్టబయలు చేయగలగాలి. ఆమె ధైర్యానికి, చెప్పే దాంట్లో విషయాలని బట్టి అవి వైరల్ అవుతాయి. అటువంటి అక్రమాలేవి కనిపించకపోతే ఆమె కొత్త పార్టీ పెట్టి ప్రయోజనం లేదు. కనీసం తీన్మార్ మల్లన్న రేంజులోనైనా వీడియోలు చేయాలి. 

ఆ కసరత్తు ఏమీ చేయకుండా కేవలం రోడ్డు మీదకు రావడం, పోలీసులుపై అరవడం వల్ల రాను రాను కామెడీ అయిపోతుంది తప్ప జనం సీరియస్ గా తీసుకోరు. ఆమెను అడ్డుకుంటే ఎలాగో వీరనారి అవతారమెత్తి ఏదో ఒకటి మాట్లాడుతుంది, అది వైరలయ్యి ఆమె పరువేపోతుందిలే అన్న ఆలోచనతోనే తరచూ ఆమెను పోలీసులు అడ్డుకునేలా చేస్తోందేమో ప్రస్తుత పాలకపక్ష యంత్రాంగం అనిపిస్తోంది. 

ఇప్పుడు షర్మిల చూపాల్సిని వ్యవహారంలో హుందాతనం, విషయ సేకరణలో నైపుణ్యం, పాలకపక్షంపై 'సహేతుకంగా' విరుచుకుపడడంలో ధైర్యం. ప్రస్తుతానికి ఇవన్నీ కొరవడి ఉన్నాయి. ఆమె చేస్తున్న పనుల్ని ఆమె తరచి చూసుకోవాల్సిన సమయమిది. లేదంటే రాను రాను కె.ఎ.పాల్ కు, ఈమెకు పెద్ద తేడా కనపడకపోవచ్చు. 

శ్రీనివాసమూర్తి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?