పవన్ కళ్యాణ్ తెలివైన ఆదేశాలు

మైత్రీ మూవీస్ లో రాజకీయ నాయకుల పెట్టుబడులు వున్నాయంటే విశాఖకు చెందిన జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ చేసిన ఫిర్యాదు కాస్త గడబిడ సృష్టించిన సంగతి తెలిసిందే. జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ సినిమా…

మైత్రీ మూవీస్ లో రాజకీయ నాయకుల పెట్టుబడులు వున్నాయంటే విశాఖకు చెందిన జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ చేసిన ఫిర్యాదు కాస్త గడబిడ సృష్టించిన సంగతి తెలిసిందే. జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్న సంస్థ లో వైకాపా పెట్టుబడులు, తెరాస నాయకుల పెట్టుబడులు అంటూ ఆరోపణ చేయడం, విచారణ చేయాలంటూ ఐటి అధికారులకు లేఖ ఇవ్వడం అన్నది చిన్న విషయం కాదు. ఇది పవన్ కు తెలిసి జరిగిన పనా? తెలియకుండా జరిగిన వ్యవహారమా? అన్న అనుమానాలు వినిపించాయి. ఇప్పుడు పవన్ ఏం చేస్తారు? మైత్రీ జోలికి వెళ్లవద్దని మూర్తి యాదవ్ కు నేరుగా చెప్పలేరు. అలా అని మౌనంగా వుండకూడదు.

బహుశా అందుకే కావచ్చు. నిన్న చాలా అంటే చాలా తెలివిగా ఓ ప్రకటన విడుదల చేసారు. ఈ ప్రకటన చుట్టూ తిప్పి, తిప్పి, చాలా తెలివిగా ఇచ్చినా, దీని అర్థం పరమార్థం ఒక్కటే. మైత్రీ సంస్థ మీద చేసిన ఫిర్యాదుల్లాంటివి తొందరపడి చేయద్దు అనే. ఈ విషయం నేరుగా చెప్పకుండా, జనసేనకు వివిధ పార్టీలతో వున్న బంధాలను తెగగొట్టడానికి ప్రత్యర్థులు కుట్ర పన్నుతారట. ఆ ఉచ్చులో పడకూడదట.

అంటే తెలంగాణలో తెరాసతో వున్న బంధాలు తెంపాలని, అక్కడ రాజకీయ నాయకుల పేర్లు ప్రస్తావించారు, ఇది ఏవరో పన్నిన కుట్ర అని పవన్ చాలా తెలివిగా చెబుతున్నారన్న మాట. తెగబారెడు ఉపోద్ఘాతం ఇచ్చి, చివరకు పవన్ తేల్చి చెప్పింది ఏమిటంటే…

1.తొందరపడి రాజకీయ నాయకుల బంధువులను రచ్చకీడ్చద్దు.

బాలినేని బంధువు భాస్కరరెడ్డి పేరును మూర్తి యాదవ్ తన ఫిర్యాదులో ప్రస్తావించడం గమనార్హం.

2.జనసేన నాయకులు ఏం చేసినా పార్టీ మీద ప్రభావం చూపిస్తుంది.

అంటే ఇప్పుడు ఈ ఉదంతం పార్టీ కి తెలిసి చేసిన పని అని అటు మైత్రీ, ఇటు తెలంగాణ రాజకీయ నాయకులు అనుకుంటారు అనే కదా.

3.సరైన ధృవపత్రాలు లేకుండా ఆర్థిక నేరారోపణలు చేయవద్దు

అంటే మైత్రీలో పెట్టుబడులు పెట్టినట్లు మీ దగ్జగర సాక్ష్యాలు లేకుండా ఫిర్యాదు చేసారు అనే కదా. కానీ రాజకీయ నాయకుల విమర్శలు, ఆరోపణల్లో సాక్ష్యాలు ఎక్కువ వుంటాయి. ఎక్కువ శాతం గాలి మాటలే కదా.

మొత్తం మీద మూర్తి యాదవ్ కు నేరుగా కాకుండా టోటల్ జనసేన జనాలకు చెబుతున్నట్లు పవన్ సమాచారం అదించారని అనుకోవాలి. ఆ విధంగా మూర్తి యాదవ్ ఉత్సాహం మీద నీళ్లు జల్లారు. అలా జల్లి ఊరుకుంటే ఫర్వాలేదు. అలా కాకుండా ఇలాంటి వాళ్లతో భవిష్యత్ లో ఏ ఇబ్బంది వస్తుందో అని ముందుగానే జాగ్రత్త పడడం మొదలుపెడితే మాత్రం కష్టమే.