లోకేశ్ ప‌ప్పు, సుద్ద‌ప‌ప్పు అంటున్నవాళ్లు…!

యువ‌గళం పాద‌యాత్ర మంగ‌ళ‌వారానికి 80వ రోజుకు చేరింది. లోకేశ్ న‌డ‌క మూణ్నాళ్ల ముచ్చ‌టే అన్న‌వాళ్లు, ప్ర‌స్తుతం ఆయ‌న ప‌ట్టుద‌ల‌ను చూస్తూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఏమో అనుకున్నాం కానీ, 4 వేల కిలోమీట‌ర్లు న‌డిచేలా ఉన్నాడే అనే…

యువ‌గళం పాద‌యాత్ర మంగ‌ళ‌వారానికి 80వ రోజుకు చేరింది. లోకేశ్ న‌డ‌క మూణ్నాళ్ల ముచ్చ‌టే అన్న‌వాళ్లు, ప్ర‌స్తుతం ఆయ‌న ప‌ట్టుద‌ల‌ను చూస్తూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఏమో అనుకున్నాం కానీ, 4 వేల కిలోమీట‌ర్లు న‌డిచేలా ఉన్నాడే అనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. పాద‌యాత్ర ద్వారా త‌న‌పై నెగెటివిటీని పోగొట్టుకోడానికి లోకేశ్ ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇటీవ‌ల కాలంలో సీఎం జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు త‌గ్గించి, స్థానిక స‌మ‌స్య‌ల‌పై దృష్టి సారించారు.

స‌మ‌స్యల ప‌రిష్కారానికి తాము అధికారంలోకి వ‌స్తే ఏం చేస్తారో వివ‌రిస్తున్నారు. తాజాగా ఆయ‌న వ్యూహాత్మ‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ ప్ర‌క‌ట‌న వెనుక లోకేశ్ దూరాలోచ‌న గ‌మ‌నిస్తే… ఆయ‌న‌పై ప‌ప్పు, సుద్ద ప‌ప్పులాంటి సెటైర్స్ విసిరే వాళ్లు సైతం ఔరా అన‌కుండా ఉండ‌లేరు. టీడీపీ అధికారంలోకి వ‌స్తే స‌చివాల‌యాలు, వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌ను కొన‌సాగిస్తామ‌ని లోకేశ్ తేల్చి చెప్పారు. అంతేకాదు, వాటిని ర‌ద్దు చేస్తామ‌ని తాము ఎప్పుడూ చెప్ప‌లేద‌ని స్ప‌ష్ట‌త ఇచ్చారు.

స‌చివాల‌యాలు, వలంటీర్ల వ్య‌వ‌స్థ‌ను పంచాయ‌తీల‌కు అనుసంధానం చేసి గ్రామీణ ప్రాంతాల‌ను అభివృద్ధి ప‌థంలో న‌డిపిస్తామ‌న్నారు. స‌చివాల‌యాలు, వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌పై లోకేశ్ కీల‌క ప్ర‌కట‌న చేయ‌డం వెనుక రాజ‌కీయ వ్యూహం ఉంది. ఎన్నిక‌ల్లో ఈ వ్యవ‌స్థ క్రియాశీల‌క పాత్ర పోషించ‌నుంది. ఈ వ్య‌వ‌స్థ‌ను అడ్డు పెట్టుకుని జ‌గ‌న్ రాజ‌కీయంగా ల‌బ్ధి పొందుతార‌నే ఆందోళ‌న ప్ర‌తిప‌క్షాల్లో వుంది.

ఈ నేప‌థ్యంలో స‌చివాల‌య, దానికి అనుబంధంగా ఉన్న వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌ను త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకునేందుకు నారా లోకేశ్ ప్ర‌క‌ట‌న చేశార‌ని చెప్పొచ్చు. ఎన్నిక‌ల్లో స‌చివాల‌య ఉద్యోగులు, వ‌లంటీర్లు పూర్తిగా వైసీపీకి కాకుండా, త‌మ‌కు కూడా అనుకూలంగా ప‌ని చేయించుకునేందుకు లోకేశ్ ప్ర‌క‌ట‌న చేసిన‌ట్టు చెబుతున్నారు. 

ఓట్ల చేరిక‌లు, తీసివేత‌లు మొద‌లుకుని ప్ర‌తి విష‌యంలో ఈ వ్య‌వ‌స్థే కీల‌కంగా ప‌ని చేస్తోంది. ప్ర‌జ‌ల‌తో ఈ వ్య‌వ‌స్థ అత్యంత బ‌లీయ‌మైన సంబంధాన్ని ఏర్ప‌ర‌చుకుంది. వైఎస్ జ‌గ‌న్ మాన‌స‌పుత్రిక‌గా చెప్పుకునే ఈ వ్య‌వ‌స్థ‌ను మచ్చిక చేసుకోవ‌డం ద్వారా ఎన్నిక‌ల్లో న‌ష్టాన్ని చాలా వ‌ర‌కు త‌గ్గించుకునే వ్యూహంలో భాగంగా లోకేశ్ సానుకూల ప్ర‌క‌ట‌న చేశారు.

అలాగే ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత వ‌లంటీర్లుగా త‌మ వాళ్ల‌ను పెట్టుకుంటార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. వ్య‌వ‌స్థ అట్లే ఉంటుందే త‌ప్ప‌, వ‌లంటీర్లు కాద‌నేది నిజం. స‌చివాల‌య ఉద్యోగులు ప్ర‌భుత్వ ఉద్యోగులు కావ‌డంతో వారిని మార్చే ప‌రిస్థితి వుండ‌దు. వైఎస్ జ‌గ‌న్‌కు ఎన్నిక‌ల ప‌రంగా లాభించే అంశాల‌పై లోకేశ్ దృష్టి సారించారు. ఒక్కొక్క‌టిగా త‌మ వైపు తిప్పుకునేందుకు లోకేశ్ త‌న‌దైన మార్గంలో ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇందులో భాగంగానే స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌పై లోకేశ్ ప్ర‌క‌ట‌న‌ను చూడాల్సి వుంటుంది.